ఇంటి నుంచే సీఎం జగన్‌ పాలన

రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని సార్లు సచివాలయానికి వెళ్లాడంటే వేళ్లమీద లెక్కించవచ్చు.

Update: 2024-01-01 13:21 GMT
AP Secretariat

పాలకులు పరిపాలించేందుకు ఒక కేంద్రం ఉంటుంది. దానిని ఆధునిక పరిభాషలో సచివాలయం అంటారు. ఆ సచివాలయంలో సచివులు నిత్యం అందుబాటులో ఉండాలి. వీరిని మంత్రులు అంటారు. సచివులు అందుబాటులో ఉంటే ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారు. సచివాలయంలో అవసరమైనప్పుడు ప్రజలు, ఇతర నాయకులు మంత్రులను కలిసే అవకావం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ దరిద్రం ఏంటో కానీ నాలుగున్నర ఏళ్ల కాలంలో మంత్రులు, ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నది చాలా తక్కువ రోజులు మాత్రమే.

సీఎం సచివాలయానికి వెళ్లడాన్ని వేళ్లమీద లెక్కించాల్సిందే..
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని సార్లు సచివాలయానికి వెళ్లాడంటే వేళ్లమీద లెక్కించవచ్చు. కేవలం మంత్రివర్గ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే హాజరయ్యేవారు. అది కూడా ఒక్కోసారి క్యాంపు కార్యాలయంలోనే క్యాబినెట్‌ సమావేశం జరిగేది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతున్నది. సచివాలయం పేరుకు మాత్రమే ఉంది. అక్కడ సచివులు ఉండరు. అధికారులూ ఉండరు. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిస్థితి.
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కట్టించిన సచివాలయం నుంచి నేను పరిపాలన సాగించడం ఏమిటని అనుకున్నాడో ఏమో కాని ముఖ్యమంత్రి కార్యాలయానికి రాకపోవడం పలువురిని ఆశ్చర్య పరిచింది. నాలుగున్న ఏళ్లలో సుమారుగా 20సార్లు మంత్రి వర్గ సమావేశాలు జరిగిఉంటాయనుకుంటే ఆరోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో హాజరైన దాఖలాలు లేవు. అధికారులు ఏ ఫైలుపై సంతకం కావాలన్నా క్యాంపు కార్యాలయానికి రావాల్సిందే. దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ ఇలాగే ప్రభుత్వ ధనంతో కార్యాలయం నిర్మించి అక్కడికి రాకుండా పాలన సాగించారు. అదే కోవలో ఏపీ సీఎం జగన్‌కూడా తన సొంత డబ్బుతో ప్యాలెస్‌ నిర్మించుకుని అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు.
జనం కలిసే పరిస్థితి లేదు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు కలిసే అవకాశం లేకుండా పోయింది. సచివాలయంలో ఉంటే అక్కడికి వచ్చిన జనాన్ని ఏదో ఒక సమయంలో కలిసేందుకు అవకాశం ఉంటుంది. జనం సచివాలయానికి వచ్చినా అక్కడ మంత్రులు ఉండరు, ముఖ్యమంత్రి ఉండరు. వీరెవ్వరూ ఉండకపోవడంతో అధికారులు కనిపించాల్సిన అవసరం లేకుండా పోయింది. సచివాలయంలో మంత్రులు, ముఖ్యమంత్రుల పేషీల వద్ద సెక్యూరిటీ కాపలా మాత్రం ఉంటారు. ఇంకెవరూ కనిపించరు. కనీసం ఓఎస్‌డీలు కూడా ఉండటం లేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
క్యాంపు కార్యాలయం వద్ద భారీ సెక్యూరిటీ
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు ఎవరైనా వెళదామంటే అరకిలోమీటరు దూరంలో ఉండాల్సిందే. తాడేపల్లిలోని మెయిన్‌ రోడ్డుపై నుంచి సీఎం ఇంటి వరకు ఉన్న రోడ్డుపై పోలీసులు నిత్యం పహారా కాస్తుంటారు. చుట్టుపక్కల ఇండ్లవారు ఇంటికి పోవాలన్నా, ఇతరులు ఎవరైనా ఆ రోడ్డులో వెళ్లాలన్నా ఎక్కడికి పోతున్నారో చెప్పాలి. వారి గుర్తింపు కార్డు చూపించాలి. గుర్తింపు కార్డు లేకపోతే ఆధార్‌కార్డు చూపించాలి. ఇదీ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఇండ్ల వాళ్ల పరిస్థితి. క్యాంపు కార్యాలయానికి వెనుకవైపు ప్రజాశక్తి కార్యాలయం ఉంది. వారు కూడా నిత్యం గుర్తింపు కార్డు జేబులో పెట్టుకుని చూపించి వెళ్లాలి. సీఎం ఇంటికి ఉత్తరం, దక్షిణం, తూర్పున దారులు ఉన్నాయి. ఈ దారుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎవ్వరినీ అటువైపుకు చూడనివ్వరు. కనీసం ప్రెస్‌వారికి కూడా ఇంటి సమీపంలోకి వెళ్లే అవకాశం లేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎక్కడైనా ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో విలేకరులు ఉండేందుకు ఒక షెల్టర్‌ ఉంటుంది. అక్కడ మంత్రులు, ఇతర అధికారులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం ఇక్కడ లేదు.
అనారోగ్య బాధితులకు సభల వద్ద కలిసే అవకాశం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంవత్సర కాలంగా ఎక్కువగా సభలు జరుగుతున్నాయి. ప్రజలకు అందించే ఉచిత ఆర్థిక సాయాన్ని ఇంతకుముందు క్యాంపు కార్యాలయం నుంచే కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా వారికి అందించేవారు. ఇటీవల అలా కాకుండా ఏదో ఒక పట్టణం, గ్రామంలో సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రజలకు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా బ్యాంకు ఖాతాలకు డబ్బులు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సందర్భంలో ఎవరైనా అనారోగ్య బాధితులు రోడ్లపక్క నిర్మించిన బారికేట్లకు అవతలివైపున ఉండి పెద్దగా కేకలు వేస్తే అప్పుడు వారిని పిలిపించి స్థానిక కలెక్టర్‌కు అప్పగించి వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు సహకరిస్తే అది జరగుతుంది. లేదంటే వారు నెట్టేస్తే సమీపానికి కూడా వారు వచ్చే అవకాశం లేదు. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి.
ఏ హామీ ఇవ్వలేదని మంత్రులు
ఎవరైనా బాధితులు నేరుగా మంత్రిని కలిసి తనకు ఈ సాయం కవాలని కోరితే వారికి సాయం చేయలేని పరిస్థితి మంత్రులది. ఎందుకంటే వారి వద్ద ఒక్క రూపాయి కూడా డబ్బు ఉండటం లేదు. నేరుగా సీఎం కార్యాలయం నుంచి మాత్రమే నిధులు విడుదల కావాలి. గతంలో అధికారుల పీడీ అకౌంట్స్‌లో కొద్దో గొప్పో డబ్బులు ఉండేవి. ఎవరైనా బాధితులు వచ్చి మంత్రులను కలిస్తే సంబంధిత అధికారులకు అప్పగించి వారికి కావాల్సిన సాయం చేయించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవడంతో వారికి కూడా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అందుకే నేరుగా సీఎంను కలిసేందుకు జనం నానా పాట్లు పడాల్సి వస్తుంది.
మంకుపట్టు..
చంద్రబాబునాయుడు కట్టించిన తాత్కాలిక సచివాలయం నుంచి నేను పరిపాలన సాగించేది ఏంటనే మంకుపట్టు సీఎం జగన్‌లో ఎక్కువగా ఉందని, అందుకే ఆయన సచివాలయానికి రావడం లేదని పలువురు వైఎస్సార్, టీడీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ధైర్యంగా తమ పేరు చెప్పటం బాగుండదని, అందుకే విషయం చెబుతున్నామని పలువురు చెప్పడం విశేషం.
పీఠమెక్కగానే రాజరిక పోకడలు..

Delete Edit

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం కోసం పాదయాత్రలు చేశాడు. ప్రజల నెత్తిన చేతులు పెట్టాడు. ముద్దులు పెట్టాడు. అధికారం చేజిక్కగానే రాజరిక పోకడలు పోతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని అవమానిస్తున్నాడు. కప్పదాటు వైఖరంటే ఇలాగే ఉంటుంది. కేసీఆర్, జగన్‌ ఇద్దరూ ఇద్దరే. ప్రపంచంలో వీరు మాత్రమే జనానికి దూరంగా ఉన్న ముఖ్యమంత్రులు. జగన్‌ సొంత డబ్బుతో ప్యాలెస్‌ కట్టుకుని అందులోనే ఉంటూ అంతా అక్కడి నుంచే సాగిస్తున్నాడు. ఇది రాజరిక వ్యవస్థ కాదనేది జగన్‌ ఎప్పటికి తెలుసుకుంటాడో చూడాలి. జనం ఓడిస్తే దానంతకదే తెలిసొస్తుంది. కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే రాజరిక సౌకర్యాలకంటే మిన్నగా ఉండే కార్యాలయం ప్రజా ధనంతో నిర్మించాడు. ఎవరు ఏమి చెప్పారో కానీ ఆ కార్యాలయానికి రావడం మానేశారు. ప్రగతిభవన్‌గా పేరు పెట్టి ఎవ్వరూ ఆ పరిసరాలకు రావడానికి వీలులేకుండా దుర్భేద్యమైన ఇనుప కంచె వేయించాడు. ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. ఆంధ్రలో కూడా జగన్‌ ఇంటిచుట్టూ దుర్భేద్యమైన కాంపౌండ్‌ నిర్మించాడు. చుట్టూ పోలీస్‌తో నింపేసాడు. ఇదీ నేటి పాలకుల పరిస్థితి.
–కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ.
ప్రభుత్వం పనైపోయింది

Delete Edit


నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యంలో పనికి రావడని తేలిపోయింది. అధికారం కోసం ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయానికి రాకుండా పాలన సాగించడం రాజరిక పోకడకు దర్పణం. ఇప్పటి వరకు చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏదో ఒక సమయంలో క్యాంపు కార్యాలయం వద్ద కానీ, సచివాలయంలో కానీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవారు. ఇప్పుడు పోలీసుల మధ్యలో ఉండిపోతున్నారు. ప్రజలు వారిని కలిసే అవకాశం లేకుండా పోయింది. జగన్‌ ఈ విషయంలో నాలుగు అడుగులు ముందున్నారు. సచివాలయాన్ని పాడుపడిన బంగళాగా మార్చాలని చూస్తున్నాడు.
–బొండా ఉమామహేశ్వరావు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యలు.


Tags:    

Similar News