Elephant attack | ఏనుగుల దాడిలో సీఎం బంధువు మృతి

నారావారిపల్లెలో విషాదం అలుముకుంది. ఏనుగుల దాడిలో ఉపసర్పంచ్ మృతిచెందారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-19 04:45 GMT

చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఆగడం లేదు. తాజాగా ఆదివారం వేకువజామున సీఎం చంద్రబాబు సమీప బంధువు, టీడీపీ నేత ఒకరు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. మామిడి తోటల్లోకి ప్రవేశించిన ఏనుగులను తరిమికొట్టడానికి వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..


చంద్రగిరి మండలం రామాపురం, కొంగరపల్లె సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులకు సమాచారం అందింది. దీంతో నారావారిపల్లె ఉపసర్పంచ్, చంద్రగిరి మండల టీడీపీ నేత మారువూరి రాకేష్ చౌదరి కూడా గ్రామస్తులతో కలిసి మామిడి తోటలపై పక్కకు వెళ్లారు. అరుపులు, కేకలు వేస్తూ, ఏనుగుల గుంపును తరమడానికి ప్రయత్నం చేశారు. జనం అరుపులకు మరింత రెచ్చిపోయిన ఏనుగుల మంద తిరగబడినట్లు గ్రామస్తుల కథనం. దీంతో ఏనుగుల దాడి చేస్తాయని గ్రామాస్తులు పరుగులు పెట్టారు. అదే సమయంలో కొందరు గ్రామస్తులు చెట్లపైకి ఎక్కి టార్చ్ లైట్లు ఆఫ్ చేసుకున్నారు.

మామిడి తోటలకు నష్టం జరగకుండా నివారించాలనే యత్రంలో రాకేష్ చౌదరి ముందు ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా చేతిలో ఉన్న లైట్ కూడా ఆన్ లో ఉండడం, ఎదురుగా మనిషి జాడలు స్టష్టంగా కనిపెట్టిన ఏనుగులు రాకేష్ పై దాడి చేసినట్లు గ్రామస్తులు చెబుతున్న సమాచారం. అదీకాకుండా రాకేష్ తెలుపు చొక్కా ధరించి ఉండడం వల్ల స్పష్టంగా కనిపిస్తుండడంతో రెచ్చిపోయిన ఏనుగు రాకేష్ ను తొండంతో పట్టుకుని చెట్లకు కొట్టి, కింద పడేసి తొక్కేయడంతో అక్కడి అక్కడి మరణించారని వెంట వెళ్లి గమనించిన గ్రామస్తులు చెబుతున్నారు.

సీఎం ఎన్. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడూ కాకుండా, బంధువు కూడా అవుతారని నారావారిపల్లె ప్రజలు చెబుతున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగకు గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబు కుటుంబంతో రాకేష్, భార్య రెండేళ్ల పాపతో వెళ్లి కలిశారు.
ఇదిలా ఉండగా, ఆదివారం వేకువజామున ఏనుగుల దాడిలో టీడీపీ నేత రాకేష్ చౌదరి మరణించారనే సమాచారం తెలిసిన వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనా స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కూడా చేరుకున్నారు.
Tags:    

Similar News