అమరావతికి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ

ఏపీ రాజధాని అమరావతి నుంచి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలను కలుపుతూ ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదలకు కేంద్ర రహదారుల శాఖ ఆమోదం తెలిపింది.

Update: 2024-07-11 05:33 GMT

రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) సహా ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ 2014–19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టినవే. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవన్నీ విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులు కావడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్‌ ఫైనాన్షియల్‌ కమిటీతో పాటు, ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ప్రస్తుతం ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే రాష్ట్ర, అంతరాష్ట్ర ప్రాంతాలతో పూర్తి స్థాయి కనెక్టివిటీ ఏర్పడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటి సారిగా ఢిల్లీ వెళ్లి పలువురు మంత్రులు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సాయం గురించి వారి ముందుంచారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిపిన భేటీలో రహదారులకు సంబంధించిన ప్రాథమిక ఆమోదం లభించింది.

ఓఆర్‌ఆర్‌ నిర్మాణ వ్యయం కేంద్రం భరించేందుకు సిద్ధం
అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు భూసేకరణతో కలిపి మొత్తం రూ. 25 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి, హైదరాబాద్‌ మధ్య మెరుగైన రవాణా కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా సుమారు 70 కిలో మీటర్ల దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి బాపట్ల జిల్లా మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల–అమరావతి మధ్య 90 కిలో మీటర్ల పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనకు కూడా కేంద్రం ఓకే చెప్పింది.
ఓఆర్‌ఆర్‌ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి. రాజధాని అమరావతితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ముఖ చిత్రమే మారిపోతుంది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. పెట్టుబడి దారులు ముందుకొస్తారనే ఆశాభావంతో ప్రభుత్వం ఉంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన రోడ్డు కనెక్టివిటీ రావడం వల్ల పెట్టుబడి దారులు ఎంతైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకున్నట్లు సమాచారం.
ఓఆర్‌ఆర్‌ పొడవు 189 కిలో మీటర్లు
ఓఆర్‌ఆర్‌ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో 189 కిలో మీటర్ల పొడవున, ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. రెండు పక్కలా సర్వీసు రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు 150 మీటర్లుగా ఉంటుంది. 2018 జనవరి నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు రూ.17,761.49 కోట్లు, అవసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4,198 కోట్లు.
ఆరున్నరేళ్ల క్రితానికీ ఇప్పటికీ ఓఆర్‌ఆర్‌ నిర్మాణ వ్యయం రూ.20 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. భూసేకరణకు అయ్యే ఖర్చు కూడా కలిపితే రూ.25 వేల కోట్లకు చేరవచ్చని అంచనా.
రాయలసీమ నుంచి అమరావతికి...
శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలో మొదలయ్యే ఆ రహదారిని బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వద్ద చెన్నై–కోల్‌కతా ఎన్‌హెచ్‌లో కలిసేలా పరిమితం చేసింది.
ఆ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచి, పనులు కూడా అప్పగించడంతో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కిలో మీటర్ల మేర కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. దాని వల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అనంతపురం–అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్‌వేకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ఎన్‌హెచ్‌–544 ఎఫ్‌ అనే సంఖ్యనూ కేటాయించింది. భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టి పెగ్‌మార్కింగ్‌ చేశారు.
విజయవాడకు తూర్పు బైపాస్‌ వరం
విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారిని సుమారు 49 కిలో మీటర్ల మేర నాలుగు వరుసలుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి, విజయవాడ చుట్టూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) నిర్మించాలనుకుంది. అప్పటికి విజయవాడ పశ్చిమ బైపాస్‌ రహదారి నిర్మాణం మొదలు కాలేదు. విజయవాడకు పశ్చిమం వైపున చిన్నఅవుటపల్లి నుంచి నాగార్జున యూనివర్సిటీ దగ్గర కాజ వరకు వరకు 47.8 కిలో మీటర్ల ఆరు వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. దీంతో ప్రస్తుతానికి రాజధాని ఐఆర్‌ఆర్‌ ప్రతిపాదనను ఉపసంహరించుకొని విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విజయవాడ పశ్చిమ రహదారి నిర్మాణం రాజధాని అమరావతి మీదుగానే జరుగుతోంది. తూర్పు బైపాస్‌ కూడా పూర్తయితే అమరావతి మీదుగా విజయవాడ చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటవుతుంది.
విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని జనాభా సుమారు 18.50 లక్షలు. ప్రతిపాదిత ఓఆర్‌ఆర్‌ పరిధిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మొత్తం జనాభా 37 లక్షలు ఉంటుందని అంచనా. ఓఆర్‌ఆర్‌కి పూర్తిగా లోపల ఉన్నవి, ఓఆర్‌ఆర్‌ వెళ్తున్న మండలాలు 40 ఉన్నాయి. దీనివల్ల విజయవాడ, గుంటూరులతో పాటు తెనాలి, మంగళగిరి, గుడివాడ, గొల్లపూడి, నూజివీడు, కొండపల్లి, పొన్నూరు, సత్తెనపల్లి, ఉయ్యూరు ప్రాంతాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా శరవేగంగా పురోగతి సాధిస్తాయి.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విజయవాడ బైపాస్‌ రోడ్డును కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రానికి ఎలాంటి సంబంధమూ లేదు. పైగా రాజధాని అమరావతి ప్రతిపాదనకు ముందే 2011లోనే ఆ బైపాస్‌ రోడ్డుకు ప్రణాళిక సిద్ధమైంది. 2012లో భూసేకరణ జరిగింది. గతంలోనే గామన్‌ ఇండియా సంస్థకు ఆ రోడ్డు నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తే వైఎస్‌ జగన్‌ వేరే సంస్థకు పనులు అప్పగించేలా కేంద్రంతో మాట్లాడి అప్పట్లో ఒప్పించారు.
Tags:    

Similar News