రేషన్ కార్డులివ్వడానికీ ఇంత ఆర్భాటమా? రోటీన్ లో భాగం కాదా?

రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం దాని పర్యవేక్షణ చూడాల్సి ఉంటుంది. ఆ పనినే కొత్తగా చెబుతూ కొత్తపని చేస్తున్నట్లు చూపించడం ఆశ్చర్యం.

Update: 2024-10-09 10:30 GMT

ప్రభుత్వం ఏదైనా ఒక పథకం రూపొందించినప్పుడు కొన్ని నిబంధనలు కూడా రూపొందిస్తుంది. ఈ పథకం 365 రోజులు సక్రమంగా అమలు జరుగుతుందా? లేదా? అనేది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. పుట్టేవారు, పెరిగే వారు, గిట్టేవారు ఉన్నప్పుడు పథకం కూడా నిరంతరం పనిచేస్తూ ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలు మధ్యలో కొంతకాలం ఆగిపోతాయి. ఆ తరువాత మళ్లీ పనిమొదలవుతాయి. అప్పుడు తాము కొత్తగా చేస్తున్నామనే ఫీలింగ్‌ను ప్రజల్లో తీసుకు రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ తంతు చూస్తుంటే ఆశ్యర్యంగా అనిపిస్తుంది. అయినా చేసేది లేక చూస్తూ ఉండాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు.

రాష్ట్రంలో పేద వారికి ఇచ్చే రేషన్‌ కార్డుల విషయంలో చేస్తున్న పనులు వింత గొలిపేవిగా ఉన్నాయి. ఇంట్లో ఎంత మంది ఉన్నారో వివరాలు నోట్‌ చేసుకుని సంఖ్యను బట్టి బియ్యం, ఇతర నిత్యావసరాలు రేషన్‌ కార్డులోని వివరాల ప్రకారం ఇవ్వాలి. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ పేరును వెంటనే తొలగించాలి. పుట్టిన పిల్లల పేర్లు కొత్తగా చేర్చాల్సి వస్తే చేర్చాలి. పిల్లలకు పెళ్లయిన రువాత వారు వేరుగా ఉంటే ఆ కుటుంబానికి కొత్తకార్డు ఇవ్వాలి. కానీ ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగటం లేదు. ప్రభుత్వం మారగానే కొత్తగా రేషన్‌ కార్డులు ఇస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తారు. ఇదేందబ్బా అని ఆలోచిస్తే కొత్త సీసాలో పాత నీరేనని అర్థమవుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,43,671 బియ్యం కార్డులు ఉన్నాయి. ఇందులో 89లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా బియ్యం, సరుకులు అందుతున్నాయి. మిగిలిన 59,43,671 రేషన్‌ కార్డులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రేషన్‌ ఇస్తున్న కార్డులకు కేంద్రం ప్రభుత్వం రేషన్‌ ఇవ్వాలని, పెద్ద మనసుతో అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటే ఈ కార్డులకు కూడా రేషన్‌ కేంద్రం ద్వారానే అందుతుందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం ఏ విషయం చెప్పలేదు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరు పేదలు రాష్ట్ర జనాభాలో మూడో వంతు ఉన్నారని అర్థమవుతోంది.
కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పేదలు ఉన్నప్పటికీ రేషన్‌ కార్డులు నిరంతరం ఇవ్వడం కుదరదని చెప్పకనే చెబుతున్నది. కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలంటే ప్రత్యేకించి దరఖాస్తులు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను అధికారులు వెరిఫికేషన్‌ చేసి దరఖాస్తుల్లో నిజమెంత అనేది తేల్చాల్సి ఉంటుంది. అప్పుడు కాని రేషన్‌ కార్డు పేదవానికి ఇచ్చేందుకు మార్గం సుగుమం అవుతుంది. అందుకేనట రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించింది. అంటే పథకాలు ఎప్పుడంటే అప్పుడు ఆగిపోతాయి. తిరిగి కొనసాగాలంటే నేతల ఆదేశాలు కావాలి. అధికారులు ఈ ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతారు.
ఇదేమి విచిత్రమో కాని రేషన్‌ కార్డులు పేదవారికి ఇచ్చే పథకాన్ని నిరంతరాయంగా ఇస్తూనే ఉండాలని పథకం రూపకల్పనలోనే నిర్ణయించారు. పైగా కార్డులో ఎప్పుడు ఎటువంటి మార్పులు కావాల్సి వచ్చినా చేయాలి. అంటే కార్డులో ఒకరి పేరు తొలగించాలన్నా, మరొకరిపేరు చేర్చాలన్నా, కార్డు దారుని అడ్రస్‌ మార్చాలన్నా, ఆ కుటుంబంలో నుంచి విడిపోయి మరో కుటుంబంగా ఏర్పడిన వారికి కొత్త కార్డు ఇవ్వాలన్నా నిరంతరం సాగే ప్రక్రియ ఆగకూడదు. కానీ గత ప్రభుత్వ హయాంలోనే ఉన్నట్లుండి ఈ ప్రక్రియకు ఎక్కడో బ్రేక్‌ పడింది. ఇప్పుడు దీనిని కొత్తగా ప్రారంభిస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. ఏమిజరిగినా మన మంచికేనని అనుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కొత్త కార్డులు ఇస్తున్నారట. అంటే దీనర్థం ఇప్పటి వరకు అర్హులైన వారికి కార్డులు ఇవ్వకుండా ఆపేసినట్లే కదా...
Tags:    

Similar News