ఇంటర్ విద్యపై బోర్డు విరుద్ధ నిర్ణయాలు

విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, పేదవారికి ఉచితంగా విద్య నందించాలని మన పాలకులు నిత్యం చెబుతాంటారు. అది మాటలకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి.;

Update: 2024-12-07 11:09 GMT

ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజీలకు ఎప్పుడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ప్రభుత్వ రంగంలో మాత్రం ఇవ్వడం లేదు. ప్రైవేట్ వారు కాలేజీల కోసం దరఖాస్తులు చేసుకోవడం, వారికి అనుమతులు ఇచ్చి తాము కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం పరిపాటిగా మారింది. మెడికల్ కాలేజీల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటుకు కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం కోటాలో సీటు వచ్చిన వారు ఆరు సంవత్సరాల్లో ఒక కోటి రూపాయల ప్రభుత్వ ఖర్చుతో మెడిసిన్ చదివి బయటకు వస్తుంటే అదే ప్రైవేట్ కాలేజీల్లో చదివే వారు కనీసం మూడు కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

పేదవారికి అందనంత దూరానికి ఇంటర్ విద్య..

ఈ పరిస్థితి రానున్న కాలంలో ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. పేద వారికి ఉన్నత విద్య అందనంత దూరం వెళ్లిపోతోంది. ఇంటర్మీడియట్ విద్య ఒక పేద విద్యార్థి పూర్తి చేయాలంటే ఏడాదికి లక్ష ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు మూడు నుంచి ఆరు వేలు ఫీజు కడితే సరిపోయేది నేడు ఆ పరిస్థితి లేదు. జూనియర్ కాలేజీలంటే ప్రస్తుతం రాష్ట్రంలో నారాయణ, చైతన్య అనే వారే తప్ప పలానా గ్రామంలోనో, పట్టణంలోనో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉందని, అందులో పిల్లలను చేర్పిద్దామని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. కాలేజీలు ఉన్నా అందులో సరిపడా లెక్చరర్లు ఉండటం లేదు. ల్యాబులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వాన్ని నిందించడం కాదు కానీ ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుందో ఆలోచించాల్సి ఉంది. ఇప్పటి కిప్పుడు ఎవరైనా అమరావతిలో విద్యా సంస్థను ఏర్పాటు చేస్తామంటే వారికి రెడ్ కార్పెట్ పరిచి ప్రభుత్వం ఆహ్వా నిస్తుంది. అదే ప్రభుత్వం పెట్టవచ్చు కదా అంటే డబ్బులు లేవంటోంది. ఇదీ నేటీ విద్యా విధానం పరిస్థితి.

రాష్ట్ర వ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల (New Junior Colleges) ఏర్పాటుకు ప్రభుత్వం (Government) అమోదం తెలిపింది. రాష్ట్రంలో 37 మండలాలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించిందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ (Kona Shasidhar) ఉత్తర్వులు జారీ చేశారు. 37 మండలాల్లో 47 కళాశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఆరు కళాశాలల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు (Inter Board) కార్యదర్శి కృతికా శుక్లా (Kritika Shukla) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 480 జూనియర్ కాలేజీలున్నాయి.

గతంలో బోర్డు అధికారుల ప్రకటన..

గత ప్రభుత్వం రాష్ట్రంలో 679 మండలాలు ఉండగా 1,358 ఇంటర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 474 జూనియర్‌ కాలేజీలున్నాయని, మిగతా 884 హైస్కూళ్లలో టెన్త్‌ పాసైన విద్యార్ధులు ఇంటర్‌లో చేరేందుకు వీలుగా ఆయా మండలాల్లో రెండేసి హైస్కూళ్లలో ఇంటర్‌ తరగతులు (10 + 2) ప్రారంభిస్తారు. వీటిలో ఒకటి కో ఎడ్యుకేషన్‌ కాలేజీ కాగా రెండోది ప్రత్యేకంగా బాలికల కోసమే నిర్వహిస్తామని తెలిపారు. ఏమిటో ఈ లెక్కల తేడా. నిబంధనలు అమలు చేయలేని, ప్రైవేటు కళాశాలలను నియంత్రించలేని, ఆరంభ సూరత్వం అనుకోవాలో ఏమో అర్థం కావడం లేదు. అందుకే బోర్డు అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏమిటంటే పాఠశాల ఉన్నత విద్య పై ప్రభుత్వం పెట్టే దృష్టి ఇంటర్ విద్యపై పెట్టడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కళాశాలలు, బోర్డు అధికారులు, వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తీరు మారాలి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను, బోర్డును ప్రక్షాళన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల అసోసియేషన్ ఆఫ్ ఏపీ వారు కోరుతున్నారు.

Tags:    

Similar News