పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
30వేల మంది యువతుల మిస్సింగ్ కేసు, కేసు విచారణకు సరైందేనని హైకోర్టు;
By : The Federal
Update: 2025-07-22 12:16 GMT
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 30వేల మంది యువతుల మిస్సింగ్ కేసు మళ్లీ తెరపైకి రానుంది. 2023లో పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నమోదు చేసిన క్రిమినల్ కేసును కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపసంహరించుకుంది. అయితే, ఆ చర్యను సవాల్ చేస్తూ వాలంటీర్స్ తరఫున హైకోర్టులో దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌కు తక్షణమే నంబర్ కేటాయించాలని హైకోర్టు- రిజిస్ట్రీని ఆదేశించింది.
ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గతంలో వాదిస్తూ – "వాలంటీర్స్ కింది కోర్టులో కక్షిదారులు కారు కనుక, రివిజన్ పిటిషన్‌కు నంబర్ కేటాయించకూడదు" అనే అభ్యంతరాన్ని హైకోర్టు స్పష్టంగా తిరస్కరించింది.
"కిందటి కోర్టులో కక్షిదారు కాకపోయినా, ఫిర్యాదుదారులుగా ప్రజలందరికీ హక్కుంది. పైగా ఈ అంశం ప్రజా ప్రయోజనాన్ని కలిగించేదేనని, అందువల్ల విచారణ జరగాలి" అని ధర్మాసనం స్పష్టం చేసింది.
వాలంటీర్స్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన "30 వేల అమ్మాయిలు మిస్సింగ్‌కు వాలంటీర్ల వ్యవస్థ కారణం" అనే వ్యాఖ్యలు తేలికగా తీసుకునేలా లేవనని, ఇవి వాలంటీర్ల పరువు, భద్రతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ కేసు నేపథ్యం...
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా కోర్టులో ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద ఫిర్యాదు నమోదు చేసింది. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన వ్యక్తిగత నివేదిక ఆధారంగా న్యాయస్థానం పవన్‌కు సమన్లు జారీ చేసింది. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, కొత్త ప్రభుత్వం ఈ క్రిమినల్ కేసును విచారణ జరపకుండా ఉపసంహరించుకుంది. దీనిపై న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టుకు వెళ్లారు.
తెరపైకి రాజకీయ పరమైన వాదనలు?
ఈ వ్యవహారం అధికారపక్షం-ప్రతిపక్షం మధ్య రాజకీయ ఘర్షణను మళ్ళీ తెరపైకి తెస్తోంది. ఒకవైపు ప్రభుత్వం కేసు ఉపసంహరణను సమర్థిస్తుండగా, మరోవైపు వాలంటీర్లు తమ పరువుపై దాడిగా చూస్తున్నారు. హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ అంశం తిరిగి న్యాయపరిధిలోకి వచ్చినట్టు స్పష్టం అవుతోంది.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
2023లో ఏపీలోని ప్రభుత్వం, పాలనాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక సభలో –
“రాష్ట్రంలో 30 వేల మంది యువతులు మిస్సింగ్ అయ్యారు. ఈ విషయంలో వాలంటీర్స్ పాత్ర కూడా ఉంది. వారు ఎవరి ఇంట్లోకైనా వెళ్లి సమాచారం సేకరిస్తున్నారు. ఇది భద్రతా అంశం. ఇది చాలా ప్రమాదకరం.” అని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు ఆవేళ దుమారం రేపాయి. ముఖ్యంగా ఆయన వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశించి మాట్లాడినట్టు వైసీపీ ఆరోపించింది. వాలంటీర్లు కూడా పలుచోట్ల ఆందోళన చేశారు. మహిళా వాలంటీర్లు తమపై అవమానకరంగా ఆరోపణలు చేశారంటూ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటూ కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు నిరసనలు కూడా చేశారు.
వైసీపీ ప్రభుత్వ ఫిర్యాదు – కేసు నమోదు
ఈ నేపథ్యంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం – పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వాలంటీర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీయడమే కాకుండా అవినీతి లేకపోయినా ఉన్నట్టు చూపుతున్నారని అభిప్రాయపడింది.
దీనిపై గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఐపీసీ సెక్షన్లు 499, 500 ఫిర్యాదు నమోదు అయ్యింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన వ్యక్తిగత నివేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్‌కు సమన్లు కూడా జారీ అయ్యాయి.
కానీ, 2024 మేలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర ప్రభుత్వం తన విచక్షణా అధికారాన్ని వినియోగించి — ఈ కేసును విచారణ జరపకుండా ఉపసంహరించుకుంది. దాంతో, కొందరు వాలంటీర్లు — తమకు న్యాయం జరగలేదని భావించి — హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ల వాదనలో – "ఒకవేళ ఫిర్యాదుదారులుగా కాకపోయినా, తమకు అపకీర్తి కలిగిన ఈ అంశంలో విచారణ కొనసాగాల్సిందే" అని కోర్టును కోరారు.