సీఆర్‌డిఏకు మళ్లీ ప్రాణం
ప్రభుత్వం మారడంతో సీఆర్‌డిఏకు మళ్లీ ప్రాణం వచ్చింది. గత ఐదేళ్ల కాలంలో సీఆర్‌డిఏకు పనిలేకుండా పోయింది. రాజధాని ప్రాంతంలో పనులు మొదలయ్యాయి.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-19 04:17 GMT
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డిఏ)కు మళ్లీ ప్రాణం వచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలం ఎందుకు పనికి రాని సంస్థగా మారింది. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సీఆర్‌డీఏ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రాజధాని ప్రాంతంలో ఎటువంటి పనులు చేయాలన్నా.. సీఆర్‌డిఏ అనుమతులు తప్పనిసరి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసే వెంచర్లకు సీఆర్‌డిఏ అప్రూవల్స్ ఉంటేనే ప్లాట్లు కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు ముందుకు వస్తున్నారు. ఐదేళ్ల క్రితం సీఆర్‌డిఏ పరిధిలో వేసిన పలు వెంచర్లు నేటికీ అలాగే ఉన్నాయి. నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే ఈ వెంచర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. తిరిగి కొనుగోళ్లు మొదలయ్యాయి.
రెండేళ్లల్లో రాజధాని నిర్మాణాలు పూర్తి
రెండు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాల నాణ్యతను పరిశీలించేందుకు టెక్నికల్ పర్సన్స్‌తో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందజేస్తుంది. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల నాణ్యతపైన కూడా పరిశీలించి కమిటీ నివేదిక రూపొందిస్తుంది. అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలకు ఏమైనా మరమ్మతులు చేయాల్సి వస్తే ఎక్కడెక్కడ చేపట్టాలి, ఎలాంటి మరమ్మతులు చేయాలి, అందుకు కోసం ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందనే అంశాలను టెక్నికల్ పర్సన్స్ ఇచ్చే నివేదికలో పొందుపరచనున్నారు. అసలు పనికి రావనకున్న భవనాలు ఏమైనా ఉంటే బేస్‌మెంట్ లెవల్ వరకు తొలగించి తిరిగి నిర్మాణాలు చేపడతారు. అలా కాకుండా నిర్మాణానికి అనువుగా ఉంటే తిరిగి వాటిని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే గతంలో నిర్మించిన భవనాల చుట్టూ పెరిగిన పిచ్చి చెట్లు, ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. రహదారులను శుభ్రం చేయించారు. రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కోసం తీసిన కాల్వలు పూడి పోవడంతో వాటిని తిరిగి తవ్వడం మొదలు పెట్టారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నూతన నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.
పాత ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికల ప్రకారమే రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే సచివాలయానికి పౌండేషన్ పూర్తి అయి అలాగే ఉంది. ప్రధాన నిర్మాణాల్లో సచివాలయం ఒకటి కాబట్టి టెక్నికల్ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత ఈ భవనం పనులు చేపట్టే అవకాశం ఉంది. రోడ్ల నిర్మాణాలను మాత్రం వెంటనే మొదలు పెట్టనున్నారు. ఇక నుంచి రాజాధాని అమరావతి అభివృ కోసం జరిగే ప్రతి పని సీఆర్‌డిఏ ద్వారా మాత్రమే అమలవుతాయి. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇచ్చే పెన్షన్, కౌలు, ఇతర వ్యవహారాలు సిఆర్‌డీఏ అధికారులు అమలు చేస్తారు.
నిర్మాణ బాధ్యతలు నారాయనణకు..
అమరావతిలో ఏపీ రాజధాని భవనాలు నిర్మించే బాధ్యత పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రి పి నారాయణ తీసుకున్నారు. గతంలోనూ ఆయనే దగ్గరుండి పనులు చేయించారు. ఈ పనులపై పూర్తి స్థాయిలో ఆయనకే అవగాహన ఉందని, అందువల్ల అమరావతిలో నిర్మాణాల బాధ్యత నారాయణకే ముఖ్యమంత్రి అప్పగించారు. ఇప్పటికే నారాయణ రెండు సార్లు అమరావతిలో పర్యటించారు. పలు సార్లు మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.సీఆర్‌డిఏకు మళ్లీ ప్రాణంCRDA is back to life