ఏడాదికేడాది ఉచ్చు బిగిస్తున్న సైబర్ నేరగాళ్లు
టెక్నాలజీ పెరిగింది. దాంతో పాటే నేరాలూ పెరిగాయి. ఎక్కడో ఉండి. ఆన్ లైన్ లోనే బెదిరించి డబ్బు దోచుకుంటున్నారు.
సైబర్ నేరాల పోకడ పోలీసులకు కూడా అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు పోలీస్ ఉద్యోగం కావాలంటే ఆరడుగుల ఎత్తు. శరీర దారుఢ్యం, పదో తరగతి పాసై ఉంటే సరిపోయేది. ఒక విధంగా ఆరోగ్యంగా ఉండి. శరీర దారుఢ్యం ఉంటే సరిపోయేది. కానీ నేడు పోలీసు ఉద్యోగానికి కూడా బుర్ర పనిచేయాలి. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని అందుకోవడంలో వెనుక బడితే ఆ టెక్నాలజీ తోనే నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉండే వారు నేరాలు చేసి డబ్బులు లాగుతున్నారు. పోలీసులు ఏర్పాటు చేస్తున్న సైబర్ పోలీస్ స్టేషన్ లలో పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉంది. కేవలం పోలీసులకు ఉండే క్వాలిఫికేషన్ సైబర్ పోలీసులకు ఉంటే సరిపోవడం లేదు. టెక్నాలజీతో ఎలా నేరాలు చేస్తారో కూడా వారికి తెలిసి ఉండాలి. ఆ నేరస్తులను ఎలా పట్టుకోవాలో కూడా తెలియాలి. నేరస్తులను పట్టుకోవడం చేతకాక పోయినా పోయిన డబ్బును రాబట్టుకోగలిగిన తెలివితేటలతో కూడిన టెక్నాలజీ ఆ పోలీసులకు తెలిసి ఉండాలి.
పోలీసుల ప్రయత్నాలు కొంతవరకే ఫలిస్తున్నాయి..
సైబర్ నేరాలను అదుపు చేయడంలో పోలీసుల ప్రయత్నాలు కొంత వరకే ఫలిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు సైబర్ నేరాలపై అవేర్ నెస్ చేసే కార్యక్రమాలు చేపడుతున్నా మరో వైపు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు పెరుగుతున్న టెక్నాలజీని నిందించలేము. అలాగని ప్రజలు పోగొట్టుకుంటున్న డబ్బును తిరిగి రాబట్టుకోలేక పోతున్నాము. దీనికి పరిష్కారం ఒక్కటే జనం చైతన్య వంతులు కావడం. వారిని చైతన్య వంతులను చేసే పనిలో పోలీసులు ఉన్నా వారి సిబ్బందిలో ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ పెరగాల్సి ఉంది.
విదేశీ మోజులో పడి నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు..
ఆంధ్రప్రదేశ్ సైబర్ నేరస్తులకు అడ్డాగా మారింది. నిరక్ష రాస్యత కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడటానికి కారణం అవుతోంది. విదేశీ మోజులో పడటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తే అక్కడే ఉద్యోగాలు వస్తాయని, డబ్బు ఐదారు సంవత్సరాల్లో సంపాదించుకుని అక్కడే ఉద్యోగాల్లో ఉన్న ఇండియన్స్ ను పెళ్లి చేసుకుని స్థిరపడితే సుఖంగా బతుకుతారనే అత్యాశ కూడా ఒక కారణం. సైబర్ నేరాలు చేసే వాళ్లు విదేశీ కాలేజీల్లో ఉన్న ఇండియన్స్ వివరాలు సేకరిస్తున్నారు. వారి పేర్లు ఫోన్ నెంబర్లు కూడా సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎవరి ద్వారా వెళ్లారు. ఎంత ఖర్చు చేశారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు. బ్యాంకుల నుంచి అప్పుగా ఎంత తీసుకున్నారు. వంటి వివరాలు సేకరించి తల్లిదండ్రులను డిజిటల్ అరెస్ట్ ల పేరుతో బెదిరించి కోట్లు గుంజుతున్నారు.
డేటింగ్ ల మోజులో మోస పోతున్నారు..
సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ డేటింగ్ లో ఉంటున్న వాళ్లను గుర్తిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా డేటింగ్ లో ఉండే వాళ్లను గుర్తించి వాళ్లకు ఫోన్ లు చేసి బెదిరించి డబ్బులు ఇవ్వకుంటే న్యూడ్ చిత్రాలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. దీంతో బెంబేలెత్తిన చాలా మంది వాళ్లు అడిగినంత డబ్బును ఇస్తున్నారు. డబ్బులేదంటే బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల వివరాలు కూడా వాళ్లు చెబుతున్నారు. ఇక డిజిటల్ అరెస్ట్ లు అనేవి వ్యక్తిలో భయాన్ని సృష్టిస్తున్నాయి.
గత ఏడాది కంటే 52శాతం పెరిగిన సైబర్ నేరాలు
ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలు గత ఏడాది కంటే ఈ ఏడాది 52.4శాతం పెరిగాయి. మోసపోతున్న వారిలో అవేర్‌నెస్ తెచ్చేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులు సఫలం కాలేకపోతున్నారు. గత సంవత్సరం (2023) ఫోన్ కాల్స్ ద్వారా 4,74,391 ఫిర్యాదులు వస్తే, ఈ సంవత్సరం (2024) ఇప్పటి వరకు 7,23,378 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించి అప్పటికప్పుడు నేరస్తులను గమనించి డబ్బులు వారి చేతుల్లోకి పోకుండా చూసిన కేసులు చాలా వరకు ఉన్నాయి. పోలీసులు ఈ ఫోన్ కాల్స్ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించి నమోదు చేసిన కేసులు గత సంవత్సరం 682 ఉంటే, ఈ సంవత్సరం 916 ఉన్నాయి. గత సంవత్సరం రూ. 173 కోట్లు మోసగాళ్లు కొట్టేయగా, ఈ సంవత్సరం రూ. 1,229 కోట్లు కొట్టేశారు. గత ఏడాదితో పోలిస్తే 359శాతం ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నారు. ఎంత అవేర్ నెస్ చేసినా డబ్బులు పోగొట్టుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వివరాలు రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
ఈ తప్పులు చేయకూడదు..
బ్యాంకు సిబ్బంది అని ఎవరైనా ఫోన్ చేసినా, OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) చెప్పకూడదు. బ్యాంకు ఖాతాకు సంబంధించిన OTPలను బ్యాంకు అధికారులు కూడా అడగరు. వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియాలో వచ్చే తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదు. అవి ఫిషింగ్ లింక్‌లు కావచ్చు. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవు. ఎవరైనా మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్టు చేశామని చెబితే అది మోసం అని గుర్తించాలి.
ఆన్‌లైన్‌లో అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడులను నమ్మకూడదు. చాలా సందర్భాల్లో ఇవి మోసాలుగా మారుతున్నాయి. మీ పుట్టినరోజు, చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంకు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదు. తెలియని వెబ్‌సైట్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు. అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. వాటిని ఎవరితోనూ షేర్ చేసుకో కూడదు. తరచుగా మీ పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి. సైబర్ నేరాలు, వాటిని ఎలా నివారించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సైబర్ భద్రతపై అవగాహన కల్పించే వెబ్ సైట్లు పరిశీలిస్తే మంచిది. అందులో ఉన్న సమాచారం ప్రకారం ఫాలో అయితే నేరాల ఉచ్చులో పడకుండా ఉండే అవకాశం ఉంది.
పోలీసులు ఏమంటున్నారు.
సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయండి. సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే, డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయాన్ని "గోల్డెన్ అవర్" అంటారు.
మీ కంప్యూటర్, మొబైల్ ఫోన్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్‌లను తనిఖీ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని పరిమితం చేయటం మంచిది. పబ్లిక్ Wi-Fiని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మంచిది.