బందరుకు 100కిలోమీటర్ల దూరంలో మొంథా తుపాను
కాకినాడ బదులు నరసాపురం వద్ద తీరం దాటుతుందా? ప్రస్తుతానికి దిశ మారలేదని ఐఎండీ ప్రకటన
By : The Federal
Update: 2025-10-28 09:58 GMT
మొంథా తీవ్ర తుపాను (Cyclone Montha) కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసినా ప్రస్తుతం తుపాను దిశ మారినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్ కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన తుపాను ప్రస్తుతానికి మచిలీపట్నంకి 100 కిమీ, కాకినాడకి 180 కిమీ, విశాఖపట్నంకి 270 కిమీ దూరంలో ఉంది.
ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అయితే కొన్ని ప్రైవేటు వాతావరణ సంస్థలు మాత్రం మొంథా తుపాను దిశ మార్చుకుందని, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైపు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈనేపథ్యంలో వాతావరణశాఖ పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని భద్రదాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో ఆకస్మిక వరదలు( ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే అవకాశముందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుపానుగా (Cyclone Montha) బలపడింది. ఈ మేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుపాను కదిలిందని తెలిపింది.
మొంథా తుపాను (Cyclone Montha) తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 9.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటలకు ముందే సురక్షిత లే భై లో నిలుపుకోవాలి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు అని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తుపాను దిశ మారితే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటి వరకూ Cyclone Montha ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నమోదు అయిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కాపులుప్పాడ దగ్గర సుమారు 125 మిల్లీమీటర్లు, విశాఖ పట్నం రూరల్ లో సుమారు 120 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. ఆనందపురంలో సుమారు 117 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.