TTD | 'తిరుపతి స్థానిక కోటా' టోకెన్లు మొదటి ఆదివారం జారీ
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు అందించారు. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-02 04:55 GMT
తిరుపతి స్థానికులకు నెలలో 3,000 మందికి మొదటి ఆదివారం శ్రీవారి దర్శన కోటా టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల కోటా టికెట్ల జారీ చేయడం ద్వారా సోమవారం ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది.
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఈఓ జె. శ్యామలరావుతో కలిసి ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఐదు గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. అప్పటికే తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనం టికెట్ల కోసం బారులుదీరారు. ఏడు గంటల తరువాత కూడా క్యూలో ఉన్న తిరుపతి స్థానికులు టోకెన్లు తీసుకున్నారు.
టికెట్లు తీసుకున్న యాత్రికులకు మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంతో పాటు ఆ తరువాత ఉచితంగా ఓ లడ్డు ప్రసాదంగా అందించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు తెలిపారు.
తిరుపతి మహతి ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు డాక్టర్ ఎం.శాంతారాం, తిరుపతి ఎమ్మెల్యే ఏ. శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌ఓ శ్రీధర్, డిప్యూటీ ఈఓ లోకనాథం హాజరయ్యారు.
గత నెల 18న జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు. ఆ మేరకు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం తిరుపతి స్థానికులకు 2,500, తిరుమలలో 500 మందికి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తామని ఆయన వివరించారు. వారికి నెలలో మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించడానికి కూడా తిరుమలలో ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.
స్థానికుల కోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఏడు కౌంటర్లు, తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో మూడు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒరిజినల్ ఆధార్ కార్డుతో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, తిరుమల నివాసితులకు టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
శ్రీవారి దర్శనం టోకెన్లు తీసుకున్న తిరుపతి స్థానికులు ఆధార్ కార్డుపై మళ్లీ 90 రోజుల తర్వాత మాత్రమే, టోకెన్ తీసుకోవడానికి అనుమతి ఉంటుందని ఆయన చెప్పారు. తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ, టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరితో టీడీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.