‘శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తిని ఆపండి’

ప్రకృతి కనికరించినా, శ్రీశైలం రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తున్న పాలకుల వైనంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-11-27 08:55 GMT

ప్రకృతి కనికరించినా, శ్రీశైలం రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తున్న పాలకుల వైనంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువకు నీళ్ళు వదలుతున్న అంశంపై బుధవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడారు.. ఈ సందర్భంగా తాగు, సాగు నీటి రక్షణకు రూపొందించిన శ్రీశైలం రిజర్వాయర్ విధివిధానాలను వివరిస్తూ ... వందలాది టీఎంసీల నీళ్ళు శ్రీశైలం దాటి దిగువకు వెళ్ళినప్పటికీ రాయలసీమలోని ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ విఫలమయిందని విమర్శించారు.

ఈ వర్ష సంవత్సరంలో జూన్ మొదటి నుండి నేటి వరకు కృష్ణా, తుంగభద్ర నదుల పరవళ్ళతో 1532 టీఎంసీల నదీ జలాలు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరాయి. దాదాపు 100 రోజుల పాటు నిరంతర ప్రవాహం కొనసాగినప్పటికీ కృష్ణా, పెన్నా జలాల సంరక్షణలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుగంగ, గాలేరు - నగరి, హంద్రీ - నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణాలకు, నీటి వినియోగానికి రాష్ట్ర విభజన చట్టం అనుమతులు ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ నేటికి కూడా ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టకు నీరు లభించడం లేదని ఇది జలవనరుల శాఖ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. సుమారు 885 టీఎంసీల కృష్ణా నది జలాలు సముద్ర గర్భంలో కలిసినప్పటికీ, లక్షల ఎకరాల సాగునీరు, అనేక ప్రాంతాలలో త్రాగునీరు లభించని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీరు, సాగునీరు అవసరాలు తీరిన తరువాతనే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేపట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఈ విధివిధానాలలో ఏ ఒక్కటి కూడా అమలు పరచడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని విమర్శించారు. నీటి పారుదల ప్రయోజనాలకు ఏ విధంగానూ భంగం కలగకుండా విద్యుత్ ఉత్పత్తి చేయాలనీ, నాగార్జున సాగర్ ఆయకట్టుకు కేటాయించిన నీటి పరిమాణానికి లోబడే విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రాజెక్టు అనుమతులలో పొందుపరిచినప్పటికీ వాటిని కాలరాసి నీటిని దిగువకు తోడేయడం శోచనీయమన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే విధంగా శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల పైన 60 టీఎంసీల నీటిని "క్యారీ ఓవర్" గా నిలువ ఉంచాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొందనీ, ఏదైనా అవసరం కోసం విద్యుత్ ఉత్పత్తి చేసినా నాన్ పీక్ అవర్స్‌లలో " రివర్సబుల్ టర్బైన్లు " ఉపయోగించి నీటిని తిరిగి శ్రీశైలం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే వెసలుబాటు కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిర్మించిన ప్రాజెక్టులు తుంగభద్ర డ్యాం, జూరాల ప్రాజెక్టు, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్లు, ప్రకాశం బ్యారేజిలు అన్నీ జలకళలతో ఉంటే కేవలం శ్రీశైలం రిజర్వాయర్‌లో మాత్రం నీరు అడుగంటే పరిస్థితి దాపురిస్తోందనీ, ఈ అంశంపై దృష్టి సారించడంలో ప్రభుత్వం విఫలమైనట్లుగా రాయలసీమ సమాజం భావిస్తోందని ఆయన అన్నారు.

కృష్ణా జలాలను ఒడిసిపట్టి, వాటి సంరక్షణకు చేపట్టవలసిన కీలక అంశాలను దాటవేస్తూ గోదావరి కృష్ణా నదిని అనుసంధానం చేస్తే రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని "ఏమార్చే" మాటలను విస్తృతంగా ప్రచారం చేయడం బాధాకరంగా ఉందన్నారు. పాలకుల అలక్ష్యం వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక కరువు, వలసలతో సహజీవనం చేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపి వేసి, శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాలను కఠినంగా అమలుచేసి శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటకుండా కాపాడి రాయలసీమ ప్రాంత తాగు, సాగునీటికి ఇబ్బందులు కలుగకుండా కాపాడాలని ప్రభుత్వానికి దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News