‘ప్రమాదంలో గోరుకల్లు రిజర్వాయర్’.. కలెక్టర్‌కు వివరించిన బొజ్జా దశరథరామిరెడ్డి
రాయలసీమ నూతన కలెక్టర్ రాజకుమారిని కలిసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి.. జిల్లాలోని సాగునీటి సమస్యలను వివరించారు.
రాయలసీమ జిల్లా నూతన కలెక్టర్‌గా రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, సమితి కార్యవర్గ సభ్యులు ఈరోజు నూతన కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగానే రాయలసీమ ప్రజలు సాగునీటి కోసం పడుతున్న కష్టాలను దశరథరామిరెడ్డి.. కలెక్టర్‌కు వివరించారు. ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రాంలో అటకెక్కేసిన ప్రాజెక్ట్‌ల గురించి, రావాల్సిన ప్రాజెక్ట్‌ల గురించి కూడా ఆయన కలెక్టర్ రాజకుమారికి వివరించారు.
ప్రమాదంలో గోరుకల్లు రిజర్వాయర్
ఈ సందర్భానే రాయలసీమ సాగునీటి అంశాలతో పాటు ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై, జిల్లాలో నీటి లభ్యత వంటి అంశాలపై కూడా ఆయన వివరించారు. గోరుకల్లు రిజర్వాయర్ ప్రమాదపుటంచున ఉందని ఆయన చెప్పారు. అదే విధంగా జిల్లాలో అత్యంత పురాతనమైన కేసీ కెనాల్ ఆయకట్టుకు ఎప్పటి వరకు నీరు అందిస్తారు అన్నది చెప్పలేని స్థితిలో ఉందని, దాని కారణంగా ఏ పంటలు వేసుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో రైతన్న ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఒకవేళ ధైర్యం చేసి ఏదైనా పంటవేస్తే దానికి తగిన నీరు అందుతుందో లేదో అన్న మనోవేదనతోనే రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారని రైతుల కష్టాలను కూడా ఆయన కలెక్టర్‌కు చెప్పారు.
అందుకు సమయం లేదు
ఈ నేపథ్యంలోనే తాను రాసి ‘నీటి అవగాహనే రాయలసీమకు రక్ష’ పుస్తకాన్ని దశరథరామిరెడ్డి.. కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. సాగునీటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని ఉన్నా ప్రస్తుతం సమయం లేదని, కావున ఈ అంశాలను త్వరలో నిర్వహించే మలివిడత సమావేశంలో చర్చిద్దామని ఆయన కలెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగానే తాను ఇచ్చిన వివరణకు కలెక్టర్ సానుకూలంగా స్పందించాని దశరథరామిరెడ్డి చెప్పారు.
కలెక్టర్‌లో తెలుసుకోవాలన్న తపన ఉంది
కలెక్టర్ రాజకుమారిలో రాయలసీమ సాగునీటి అంశాలను తెలుసుకోవాలన్న తపన ఉందని, అది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని దశరథరామిరెడ్డి చెప్పుకొచ్చారు. తాను రాసిన పుస్తకం చదివిన తర్వాత మరోసారి కూర్చుని రాయలసీమ సాగునీటి అంశాలపై చర్చిద్దామని కలెక్టర్ చెప్పినందుకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు దశరథరామిరెడ్డి. కలెక్టర్‌ను కలిసిన వారిలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు ఉన్నారు.