‘కరువు, వలసలను నిర్మూలించండి’.. ఎమ్మెల్యేకు దశరథరామిరెడ్డి విజ్ఞప్తి

గుండ్రేవుల రిజర్వాయర్,వేదవతి ఎత్తిపోతల, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాలకు కృషి చేయాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి కోరారు.

Update: 2024-07-12 10:36 GMT

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమర్థవంతంగా పనిచేయడానికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన వివిధ చట్టబద్దమైన విధానపరమైన నిర్ణయాల అమలుపై కార్యాచరణ చేపట్టాలని నంద్యాల జిల్లా డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

డోన్ శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా కోట్లను లద్దగిరిలోని ఆయన స్వగృహంలో బొజ్జా దశరథరామిరెడ్డి ఆద్వర్యంలో సమితి ఉపాధ్యక్షులు వాడాల చంద్రశేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పోలిరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు కోట్లకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి హక్కులుపై ఇరువురు నేతలు సమగ్రంగా చర్చించారు. రాయలసీమ జిల్లాలకు నీటి పంపిణీ జరిగే ముఖద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులు, భవిష్యత్తులో త్రాగునీటి కొరత లేకుండా చేపట్టవలసిన రిజర్వాయర్ల నిర్మాణాలపై బొజ్జా కోట్లకు వివరించారు. తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు ఒక లక్షా యాబై ఒక్క వెయ్యి ఎకరాలకు పూర్తిగా సాగునీరు అందించడానికి వేదవతి నది జలాలను గూల్యం నుండి ఎత్తిపోతల ద్వారా నాలుగు కి. మీ. కాలువ నిర్మాణంలో తుంగభద్ర దిగువ కాలువకు అనుసంధానం చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని బొజ్జా కోట్లను కోరారు. దీనివలన యల్ యల్ సి లోని చివరి ఆయకట్టు వరకు నీరు అందడం వలన ఈ ప్రాంతం సుభిక్షంగా వుంటుందని బొజ్జా వివరించారు. కె.సి కెనాల్ పరిరక్షణకే గాకుండా లక్షలాది ప్రజల త్రాగునీటి సమస్యను గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం ద్వారా తీర్చవచ్చని రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా కృషి చేయాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారే గాకుండా యవగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ కర్నూలు పశ్చిమ ప్రాంత దయనీయ స్థితిపై వారు స్పష్టమైన హామీలను ఇచ్చారని ఆ హామీలు అమలు అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు లపై చర్చించాలని కోట్లను కోరారు. కృష్ణా జలాలలో అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు వున్న కర్నూలు జిల్లాలోనే KRMB ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా కోట్ల ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. డోన్ నియోజకవర్గంతో పాటుగా కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి, గొంతెండిపోతున్న పశ్చిమ పల్లెలకు శాశ్వతంగా త్రాగునీరు అందేలాగా, వలసల నిర్మూలనకు కార్యాచరణ చేపడుతున్నానని బొజ్జాకు తెలిపారు. సాగునీటి హక్కుల అంశాలపై కోట్ల సానుకూలంగా స్పందిస్తూ వేదవతి ఎత్తిపోతల, గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, చట్టబద్దమైన హక్కులు అమలు తదితర విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోతానని హమీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్, జలవనరులశాఖ ఛీఫ్ ఇంజనీర్లను కలిసిన బొజ్జా బృందం కర్నూలు జిల్లా కలెక్టర్, సాగు నీటి శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషాలకు బొజ్జా దశరథ రామిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగు నీటి అంశాలు, చేపట్టాల్సిన నిర్మాణాలు, శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాల నీటిపై రాయలసీమ హక్కుల గురించి తెలిపారు. ఈ అంశాలపై వివరణాత్మకంగా రాసిన పత్రాన్ని, "నీటి అవగాహనే రాయలసీమకు రక్ష" పుస్తకాన్ని బొజ్జా వారికి అందచేసారు.‌

Tags:    

Similar News