మెట్టుదిగని జగన్, మడమ తిప్పని అంగన్ వాడీ సైన్యం

మీరు ఇచ్చిన హామీ మేరకు జీతాలైనా పెంచండి.. లేదంటే జైల్లోనైనా పెట్టండి’ ఇది అంగన్వాడీల మాట.. ఉద్యోగాల్లో చేరతారా ఊస్టింగ్ చేయమంటారా అని సర్కారు హెచ్చరిక..

Update: 2024-01-10 03:23 GMT
పోలీసులు అరెస్ట్ చేస్తున్న అంగన్వాడీలు

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటమ్ ను సమ్మెలో ఉన్న అంగన్ వాడీలు ఖతారు చేయలేదు. ఊహించినట్టే ప్రభుత్వం అంగన్‌వాడీలపై చర్యకు సిద్ధమైంది. ఉద్యోగాల నుంచి ఎందుకు తీసివేయకూడదో చెప్పాలంటూ సంజాయిషీ నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టింది. విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో సంజాయిషీ ఇవ్వాలంటూ మంగళవారం నుంచి నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. అయినా సరే వెనక్కి తగ్గేది లేదని అంగన్ వాడీల సమ్మెకు నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాలు ప్రకటించాయి.


రోపక్క, సమ్మెకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీనటుడు బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రుద్రరాజు మద్దతు పలికారు. తమ ప్రభుత్వం వచ్చాక అంగన్ వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు నిన్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన సభలో బహిరంగంగా ప్రకటించారు.

అంగన్ వాడీల సమ్మె రోజుకో మలుపు...

ప్రభుత్వం, అంగన్ వాడీల చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అంగన్ వాడీలు సమ్మెను ఉధృతం చేశారు. ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల ముందు అక్కచెల్లెమ్మలంటూ ఎక్కడ లేని ఆప్యాయతను ఒలకబోస్తూ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి....సీఎం పీఠం ఎక్కాక వాటిని పూర్తిగా మర్చిపోయారని సమ్మెకు నాయకత్వం ఏఐటీయూసీ నాయకుడు జి.ఓబులేసు విమర్శించారు. అంగన్వాడీల 11 సమస్యల్లో 10 పరిష్కరించామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. డబ్బులు మాత్రం పెంచలేమన్నారు మంత్రి బొత్స. అడుగుతున్నదే ఆర్ధికమైనప్పుడు వేతనాలు పెంచకపోతే ఎలా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.

ఉద్యోగాల నుంచి తీసేస్తారా..


“రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నారని ఏకంగా అంగన్‌వాడీల ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్‌వాడీ సేవలను అత్యవసర చట్టం పరిధిలోకి తెచ్చి మరీ ఎస్మాను ప్రయోగించిన వారు లేరు“ అంటున్నారు అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు సుబ్బరావమ్మ. ఈనెల 9వ తేదీలోపు సమ్మెను విరమించి ఉద్యోగాల్లో చేరాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతరు చేయకపోవడంతో ప్రభుత్వం సంజాయిషీ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. మరో రెండు రోజుల్లో నోటీసుల జారీ ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొందరి ఇళ్లకు వెళ్లి అధికారులు నోటీసులు అంటించారు. జగన్‌ ప్రభుత్వ తీరుపై అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. నోటీసులు జారీ చేస్తే బెదిరేది లేదని, దీనిపై అన్ని రకాలుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయన ఎంతదూరం వెళ్లినా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. వారు జైల్‌ భరో కార్యక్రమం చేపట్టగా.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

ఒక్కో కార్యకర్తకు మూడు రకాలుగా నోటీసులు..

అంగన్‌వాడీలను విధుల్లో నుంచి తొలగింపులో సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా న్యాయసలహాలు తీసుకున్నారు. అందులో భాగంగా మూడు రకాలుగా నోటీసులు జారీ చేయిస్తున్నారు. రిజిస్ట్రర్‌ పోస్టు ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తల నివాస చిరునామాకు నోటీసులు జారీ చేయించే ప్రక్రియను ప్రారంభించారు. దీంతోపాటు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ అంటించనున్నారు. ఇదేకాకుండా వారి ఆధార్‌లోని చిరునామాకు వెళ్లి నేరుగా నోటీసును కార్యకర్తలకు, ఆయాలకు అందిస్తారు. వారు తీసుకోని పక్షంలో ఇంటికి అంటించి రావాలని ఆదేశాలిచ్చారు. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్తకు మూడు రకాలుగానూ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ‘ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదో నోటీసు అందిన 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలి. లేని పక్షంలో.....ఈ కాలవ్యవధి ముగిసిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’ అని నోటీసులో ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News