తగ్గుతున్న మగ్గాలు.. తీరని నేతన్న కష్టాలు
భారత దేశ గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చేనేత కళా రంగం ఉనికి ప్రస్తుతం ఏపీలో ప్రశ్నార్థకంగా మారింది. దీనికి కారకులు ఎవరు? దారి తీసిన పరిస్థితులు ఏమిటి?
Byline : Vijaykumar Garika
Update: 2024-08-19 14:20 GMT
భారత దేశపు ప్రాచీన కళల్లో చేనేత రంగం ఒకటి. తొలి నాళ్ళల్లో ఒక వెలుగు వెలిగిన ఈ చేనేత పరిశ్రమ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేక పోవడంతో రోజు రోజుకు కుదేలై పోతోంది. కష్టపడి ఉత్పత్తి చేసుకున్న చేనేత కార్మికులకు కష్టమే మిగులుతుంది. తలసరి ఆదాయం రోజుకు రూ. 57 కంటే మించడం లేదు. నాలుగవ హ్యాండ్ లూమ్ గణాంకాల ప్రకారం చేనేత కార్మికుడి సంపాదన నెలకు రూ. 5వేల కంటే తక్కువ ఉంది. రూ. 20 వేలు అంత కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య చాలా స్వల్పంగానే ఉంది. ఆర్థిక భారం పెరగడం, ఆదాయం లేక పోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో మగ్గాల సంఖ్య బాగా తగ్గి పోతోంది. 2009–10లో 1.77లక్షలుగా ఉన్న మగ్గాల సంఖ్య 2019–20 నాటికి 1.22లక్షలకు తగ్గి పోయింది.
శ్రమ ఎక్కువ.. వేతనం తక్కువ
శ్రమ ఎక్కువ వేతనం తక్కువ అన్నచందంగా చేనేతల జీవితాలు మారి పోయాయని సీనియర్ జర్నలిస్టు అవ్వారు శ్రీనివాసరావు ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’కు తెలిపారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేక పోవడం, అనారోగ్యాల బారిన పడటం, ఆదాయాలు ఆశించిన మేరకు రాకపోవడం వంటి అనేక కారణాల వల్ల కొత్త జనరేషన్‌లు మగ్గం నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. మగ్గం నేయడం కంటే ఇతర పనుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువుగా ఉండటంతో వారసులు ఈ పనులకు దూరమై పోతున్నారని వివరించారు. మగ్గం నేయడం ఒకరితో అయ్యేపని కాదు. ఇంటిల్లపాది చేసుకోవలసిన పని. అందరూ సహకరించి కష్టపడితే కానీ సాధ్యం కాదు. అదే శ్రమకు తగిన ఫలితం ఉండి ఆర్థికంగా ఆదాయాలు సమకూరినటై్టతే ఇది కుటీర పరిశ్రమగా ఎంతగానో వర్థిల్లేదని, ప్రస్తుతం ఆ పరస్థితులు కనిపించడం లేదని శ్రీనివాసరావు అభిప్రాయ పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ఈ దుస్థితికి కారణమని తెలిపారు.
ఈ రంగంపై ఆధారపడిన చేనేత కార్మికుల్లో ఎక్కువ మందికి కంటి చూపు మందగిస్తుంది. టీబీ బారిన పడుతున్నారు. పౌష్టిక ఆహారానికి దూరమవుతుండటం వల్ల మాల్ న్యూట్రిషన్ వంటి సమస్య వెంటాడుతోంది. శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కువ సేపు కూర్చోని పని చేయాల్సి రవావడం వల్ల తీవ్రమైన మోకాళ్ల నొప్పులు వంటి అనేక సమస్యలు తోడవడంతో చిన్న వయసులోనే ముసలి వారులా వారి అప్పీయరెన్స్ మారిపోతుందని శ్రీనివాసరావు తెలిపారు.
పవర్ లూమ్స్ నుంచి పెద్ద సవాళ్లు
మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులకు పవర్ లూమ్స్ నుంచే అతి పెద్ద సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పవర్ లూంబ్స్ ద్వారా తయారైన వస్త్రాలను చేనేత వస్త్రాలుగా విక్రయిస్తూ చేనేత కార్మికుల పొట్ట కొట్టడమే కాకుండా, వారి మార్కెట్‌ను సైతం సొమ్ము చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర పధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’కు తెలిపారు. పవర్ లూంబ్స్ ద్వారా తయారు చేసిన వస్త్రాలు కూడా హ్యాండ్‌లూంబ్స్ ద్వారా తయారు చేసినవి మాదిరిగానే కనిపించడం వల్ల వినియోగ దారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చేనేత వస్త్రాలకు మార్కెట్ తగ్గి పోతుంది. ఎప్పుడైతే మార్కెట్‌లో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో మగ్గాలు నేయించడం కానీ, సొంతంగా నేయడం కానీ కష్టంగా మారిపోతుంది. రాను రాను చేనేత కార్మికులు వృత్తిని, ఉపాధిని కోల్పోతున్నారు. మంగళగిరి ప్రాంతంలో 1985లో దాదాపు 12వేల మగ్గాలు ఉండేవి. ప్రస్తుతం 1000 వరకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొందని బాలకృష్ణ తెలిపారు.
చేనేత పరిశ్రమ ఔన్నత్యాన్ని గుర్తించిన నాటి కేంద్ర ప్రభుత్వం 1985లోనే 11 రకాల వస్తువులను కేటాయించింది. టవళ్ళు, అంగవస్త్రాలు, లుంగీలు, బెడ్ కవర్లు, పంచెలు, చీరలు, బెడ్ షీట్లు, ఫర్నీచింగ్ మెటీరియల్స్, దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్స్, శాలువాలు, మఫ్లర్లు, ఉలెన్ టవళ్లు వంటి 11 వస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లో పవర్ లూమ్స్ యజమానులు తయారు చేయకూడదనే నిబంధనలు కూడా విధించింది. ఒక వేళ తయారు చేస్తే వారిపైన కేసులు పెట్టొచ్చు. కానీ ఇది ఎక్కడా అమలు చేయడం లేదు. పవర్ లూమ్స్ కూడా వీటిని తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు.
పాలక వర్గాలు, అధికారంలో ఉన్న పార్టీలు, పవరల్ లూంబ్స్ యజమానులతో లాలూచీపడి, ఇంకా రాయితీలు కల్పిస్తున్నారు. దీంతో పవర్ లూమ్స్ యజమానుల ఇష్టారాజ్యంగా మారిపోయిందని, చేనేత రంగం సంక్షోభంలో పడటానికి ఇదొక ప్రధాన కారణమని బాలకృష్ణ తెలిపారు. చేనేత వస్త్రాలు కాకుండా, వేరే వస్త్రాలను పవర్ లూమ్స్ యజమానులు తయారు చేసుకుంటే అసలు సమస్యలు ఉండవు. కానీ ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా చేనేత కార్మికులు అమలు కావడం లేదు. మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన పథకాన్ని నీరు గార్చారు. ఇది 1985 నుంచి ఈ పథకం ఉంది. దీని ద్వారా మరణించిన కార్మికులకు అందాల్సిన బీమా సౌకర్యం అమలు కావడం లేదు. 2017 మార్చి 31న దీనిని ప్రధాన నరేంద్ర మోదీ రద్దు చేశారు. అదేవిధంగా ఏడాదికి రూ. 30వేల వరకు ఉచిత వైద్య సేవలు పొందేందుకు ఏర్పాటు చేసిన ఆరోగ్య బీమా పథకాన్ని కూడా 2017, మార్చి 31న ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేశారు. చేనేతల గురించి చర్చించేందుకు నేషల్ హ్యాండ్ లూమ్ బోర్డును కూడా లేకుండా రద్దు ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. చేనేతలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవలసిన ప్రధాని మోదీ, ఉన్న పథకాలను కూడా రద్దు చేయడమే కాకుండా చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశారని బాలకృష్ణ విమర్శించారు.
చేనేతపై ప్రభుత్వాలకు చిత్త శుద్ధి లేదు..
చేనేత రంగాన్ని కాపాడుకోవడం కోసం గతంలో హ్యాంక్ యార్న్ నోటిఫికేషన్ ఇచ్చింది. పవర్ లూమ్స్ యజమానులు కేంద్రంపై ఒత్తిడి చేయడం వల్ల దీని నిబంధనలు సడలించడంతో చేనేత రంగానికి ప్రాధాన్యతను తగ్గించారు. దీంతో పాటుగా ఆ నోటిఫికేషన్ నిబంధనలను సరిగా అమలు చేయడంపై కేంద్రం ఎన్నడూ దృష్టి సారించ లేదు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, దేశ వాళీ చేనేత ఉత్పత్తులను ఇతర దేశాల్లో డిమాండ్ పెంచుతూ, మార్కెట్ చేయడానికి ఏర్పాటు చేసిన హ్యాండ్ లూమ్స్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్‌పోర్టు కార్పొరేషన్(హెచ్‌హెచ్‌ఈసీ)ను కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలో చేనేత ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మార్కెట్‌ను కల్పించడం కోసం హ్యాండ్ లూమ్స్ ఎక్స్‌పోర్టు కౌన్సిల్(హెచ్‌ఈపీసీ)ను ఇది వరకు ఏర్పాటు చేశారు. ఇది కూడా సరిగా పని చేయడం లేదని, నామ మాత్రంగా మారి పోయిందని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బండారు ఆనందప్రసాద్ ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’కు తెలిపారు.
దీని ద్వారా చేనేత రంగానికి పెద్దగా ఉపయోగం లేక పోగా హెచ్‌ఈపీసీ ఎక్జిమ్ కోడ్‌ను ఉపయోగించుకొని పవర్ లూమ్స్ ఉత్పత్తులను ఎక్స్‌పోర్టు చేస్తూ చేనేత రంగానికి పెద్ద ఎత్తున నష్టాన్ని చేకూర్చుతున్నారని ఆనంద ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ ప్రభావం కూడా చేనేత రంగాన్ని అతలాకుతలం చేసింది. హ్యాండ్ లూమ్స్‌కు, పవర్ లూంబ్స్‌కు ఒకే హెచ్‌ఎస్‌ఎన్ ఇవ్వడం వల్ల చేనేత రంగానికి పెద్ద నష్టం వాటిల్లుతోందని, ముడి సరుకుల ధరల రీత్యా చేనేత ప్రొడక్షన్ కాస్టు ఎక్కువుగా ఉంటుందని, దీనిపై అదనంగా జీఎస్టీ విధిస్తే ఇంక ఎవరు కొంటారని, దీని వల్ల నష్టమే జరుగుతోందని ఆనంద ప్రసాద్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేత రంగాన్ని ఆదరించింది లేదు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పథకాలను కూడా అమలు చేయడం లేదు. చేనేత వస్త్రాల అమ్మకాలపై రిబెట్ పథకం, డీసీసీ బ్యాంకులో తీసుకున్న క్యాష్ క్రెడిట్ రుణాలపై పావలా వడ్డీ పథకం, సహకార రంగ చేనేత కార్మికుల పొదుపు(త్రిఫ్ట్ ఫండ్) పథకం, యార్న్ సబ్సిడీ పథకం, చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన మార్కెటింగ్ ఇన్‌సెంటివ్ పథకం వంటి పలు పథకాలు అమలు కావడం లేదని బండారు ఆనంద ప్రసాద్ తెలిపారు.