టీడీపీలో కీలక పరిణామాలు.. రఘురామకు టికెట్ ఫిక్స్!

నరసాపురం ఎంపీ రఘురామ టికెట్ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రఘురామకు టికెట్ ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.

Update: 2024-04-19 14:12 GMT

నరసాపురం రఘురామకృష్ణం రాజు‌కు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా? పోటీలో ఉంటే ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు? అన్నవి ప్రస్తుతం ఆంధ్ర అంతటా వినిపిస్తున్న ప్రశ్నలు. జగన్‌తో పోరాడుతూ వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన రఘురామ తొలుత బీజేపీ నుంచి టికెట్ వస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆఖరి నిమిషయంలో ఆయనకు బీజేపీ మొండి చేయి చూపింది. దీంతో చివరికి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రశ్నల తీవ్రత ఆంధ్రలో మరింత పెరిగిపోయింది. అనేక ఊహాగానాలు కూడా వినిపించాయి. బీజేపీతో చర్చలు చేసి నరసాపురం సీటులను ఆలూరు లేదా వేరే సీటుతో మార్చుకునే యోచనలో బాబు ఉన్నారన్న వాదనలు కూడా వినిపించాయి.

మొదటి నుంచి వివాదమే

రఘురామకృష్ణ రాజు.. టీడీపీలో చేరిన క్షణం నుంచి ఆయన పోటీ వివాదాస్పదంగానే ఉంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఆయనకు టికెట్ ఇవ్వడానికి టీడీపీ ఎవరిని పక్కన కూర్చోబెడుతుంది? అసలు టీడీపీ అయినా రఘురామకు టికెట్ ఇస్తుందా? టికెట్ దక్కకుండా టీడీపీ నుంచి కూడా తప్పుకుని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడతారా? ఇలా మరెన్నో ప్రశ్నలు చెలరేగాయి. ఈ క్రమంలోనే రఘురామకు ఉండి టికెట్ ఖరారు అయిందని కూడా ప్రచారం జోరుగా సాగింది. అయితే అలా జరగదని, ఇప్పటికే ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారని, ఇప్పుడు రఘరామ కోసం రామరాజును కాదనడం జరగదని ప్రతివాదనలు వినిపించాయి. అయితే తాజా పరిణామాలను చూస్తుంటే రామరాజుకు టికెట్ లేనట్లే ఉంది.

ఆంధ్రలో నామినేషన్ల పర్వం ప్రారంభమైపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఘట్టం ముగియనుంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉండి టికెట్‌ను రఘురామకు ఇవ్వాలని నిశ్చయించుకున్నారని, ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన పార్టీ నేతలతో కూడా చర్చించారని, వారిని కూడా ఒప్పించారని సమాచారం.

రామరాజును అందుకే మార్చారా

ఉండి టికెట్‌ను రామరాజుకు ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. అధిష్టానంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులు ఇప్పటికీ చల్లారలేదు. అదే సమయంలో రఘురామకు కూడా తప్పక టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటంతో చేసేదేమీ లేక చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చంద్రాబాబు.. రామరాజుతో కూడా చర్చించి ఒప్పించారని, టికెట్‌కు ప్రత్యామ్నాయంగా అతనికి న్యాయం చేస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న సీతా మహలక్ష్మి పరిస్థితి ఏంటని, ఆమెకు కూడా ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

రామరాజుకు ఇన్‌ఛార్జ్ పదవి

ఎన్నికల టికెట్‌ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్న చంద్రబాబు.. రామరాజుకు కాదనలేన ఆఫర్ చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ వెనక్కు తీసేసుకోవడంతో ఆయనకు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే అందుకు రామరాజుకు ఓకే చెప్పారా లేదా? అసలు చంద్రబాబు ఈ ఆఫర్ ఇచ్చారా లేదా అన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. మరి త్వరలో దీనిపై ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఉండి అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆర్ఆర్ఆర్ తనయుడు

ఉండి నియోజకవర్గం సీటుకు స్వతంత్ర అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు తనయుడు కనుమూరి భరత్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఆఖరి తేదీ దగ్గర పడుతుండటం, తనకు టికెట్ విషయంపై టీడీపీలో ఉత్కంఠ ఇంకా వీడని నేపథ్యంలోనే రఘురామ తన కుమారిడితో నామినేషన్ దాఖలు చేయించినట్లు సమాచారం. దీంతో టీడీపీ నుంచి కూడా తనకు టికెట్ దక్కకపోతే ఉండి నియోజకవర్గం నుంచి తన తనయుడు భరత్‌ను బరిలోకి దింపి అతడి గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ తన ప్లాన్ ఏంటి అన్న అంశాలపై రఘురామ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

Tags:    

Similar News