రుషికొండ ప్యాలెస్‌పై ఊగిసలాట..!

మంత్రులు లోకేష్, దుర్గేష్‌లు తలోమాట. ప్రజల సందర్శనకు కేటాయిస్తామంటున్న లోకేష్. ఎంఐసీఈకీ ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్న దుర్గేష్.;

Update: 2025-01-28 09:02 GMT
రుషికొండ ప్యాలెస్

వివాదాస్పద విశాఖ రుషికొండ ప్యాలెస్ పాలకులను గందరగోళానికి గురి చేస్తూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఈ ప్యాలెస్ పై స్పష్టత కొరవడుతూనే ఉంది. అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్మించిన ఈ రాజ సౌధాన్ని దేనికి వినియోగించాలన్న దానిపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక పోతోంది. విశాఖ సాగరతీరంలోని రుషికొండపై పర్యాటక శాఖ రిసార్టులను తొలగించి గత వైసీపీ ప్రభుత్వం ఓ అత్యద్భుత ప్యాలెస్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా చేసి అక్కడి నుంచే పరిపాలన సాగించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు.

ఇందుకోసం రుషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాలను కట్టించి సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించాలని తలపోశారు. కానీ వైసీపీకి బదులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ స్వప్నం సాకారం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ మంత్రి లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. కళ్లు చెదిరే లాంటి ఆ ప్యాలెస్ ను చూసిన నోరెళ్లబెట్టారు. దాని నిర్మాణం అత్యంత రహస్యంగా సాగడం, అటువైపు ఎవరూ తొంగి చూసే అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఈ ప్యాలెస్ ఎలా ఉంటుందో సామాన్యులకే కాదు.. అప్పటి మంత్రులు, ప్రముఖులకూ తెలియకుండా పోయింది. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక వాటిలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు అడుగు పెట్టడం, అందులోని అందాలను ఫోటోలు, వీడియోల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు.

సువిశాలమైన కాన్ఫరెన్స్ హాలు

 

తొలుత చంద్రబాబు ఏమన్నారంటే?

గత నవంబరు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కలల సౌధం రుషికొండ ప్యాలెస్ లోకి తొలిసారి అడుగుపెట్టారు. ఆ ప్యాలెస్ అంతటా కలియదిరిగారు. అక్కడ భవంతుల నిర్మాణ తీరుతెన్నులు, అందచందాలను చూసి అవాక్కయ్యారు. 'రుషికొండ ప్యాలెస్ కోసం రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఒక్క బాత్ టబ్ కోసమే రూ.36 లక్షలు ఖర్చు చేశారు. 18 ఎకరాల్లో ఏడు బ్లాకుల్లో భవనాలు నిర్మించారు. ఎటు చూసినా సముద్రం కనిపించేలా కట్టారు. రాజులు కూడా ఇలాంటి కట్టుకోలేరేమో?వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్ లోనూ ఇంతటి విలాసం కనిపించదు. ఈ ప్యాలెస్ను దేనికి ఉపయోగించాలన్న దానిపై ఓ కమిటీ వేస్తాం. ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటాం. ఆపై అందులోకి ప్రజలను అనుమతిస్తాం' అని అప్పట్లో మీడియాతో చెప్పారు.

ప్యాలెస్ లో కారిడార్

 

మంత్రి లోకేష్ ఏమన్నారు?

గత డిసెంబరులో ఐటీ మంత్రి లోకేష్ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు రుషికొండ ప్యాలసన్ను ఏం చేయాలనుకుంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకాయన సమాధానం చెబుతూ.. 'దానిని ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదు. అయితే రూ.500 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి కోసం ఇంతటి భవనాలను నిర్మించడం వంటి పనులు నియంతలే చేస్తారు. ఆ విషయం ప్రజలకు తెలియాలి. అందుకే అందులోకి ప్రజలు అనుమతించేలా చర్యలు తీసుకోబోతున్నాం' అని స్పష్టం చేశారు. తాజాగా సోమవారం విశాఖ వచ్చినప్పుడు కూడా లోకేష్ రుషికొండను మరో మూడు నెలల్లో ప్రజల సందర్శనకే అనుమతిస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. అలా ప్రజల సందర్శనకు అనుమతించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల సొమ్మును వృధా చేశారన్న భావనను శాశ్వతంగా కలిగిస్తే రాజకీయంగా లబ్ది పొందవచ్చన్నది ఆయన వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు.

పర్యాటక మంత్రి దుర్గేష్ ఏం చెప్పారంటే?

పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సోమవారం విశాఖలో జరిగిన ప్రాంతీయ పర్యాటక సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ 'విశాఖలో గతంలో పర్యాటక శాఖ స్థలంలో నిర్మించిన భవనాలను కూల్చేసి పర్యాటక శాఖ ఆదాయానికి గండి కొట్టారు. వాటి స్థానంలో కొత్తగా అత్యాధునిక భవనాలు నిర్మించారు. ఇప్పుడు వాటిని 'మైస్' (మీటింగ్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్) సెంటర్కు వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది' అని వెల్లడించారు. దీనిని బట్టి ఇప్పటివరకు చెబుతున్నట్టుగా రుషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు కాకుండా మైస్కు ఉపయోగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని స్పష్టమవుతోంది.

విలాసవంతమైన స్యూట్ రూమ్లు

 

రుషికొండ ప్యాలెస్ లో ఏమున్నాయి?

రుషికొండలోని 18 ఎకరాల్లో ఏడు బ్లాకులు నిర్మించారు. వాటిలో విశాలమైన 12 గదులున్నాయి. ఇందులో ప్రెసిడెన్షియల్ స్యూట్, స్యూట్ రూమ్లు, బాంకెట్ హాళ్లు, డీలక్స్ స్యూట్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, రిక్రియేషనల్ లాంజి, బిజినెస్ సెంటర్ ప్రైవేటు స్యూట్ రూమ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఇంకా హోం థియేటర్ స్క్రీన్, అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టం, సెంట్రలైజ్డ్ ఏసీ, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత ఖరీదైన ఆధునిక సోఫాలు, కుర్చీలు, మంచాలు, గృహాలంకరణ సామగ్రి, సీలింగ్ ఫ్యాన్లు, షాండ్లియర్లు, టీవీలు, ఫ్రిడ్జిలు, ఫైళ్లు భద్రపరచుకునేందుకు లాకర్లు ఇతర ఫర్నిచరు, వివిధ ఆకర్షణీయమైన కళాఖండాలు ఉన్నాయి. కాన్ఫరెన్స్ హాళ్లలో వందలాది మంది కూర్చునే వీలుంది. ఇటాలియన్ మార్బుల్ గోడలు, గచ్చులు తళతళ మెరిసిపోతుంటాయి. ఈ ప్యాలస్లోకి ప్రవేశిస్తే భారత్లో కాకుండా మరో సంపన్న దేశంలో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది. దానికి తోడు సీ వ్యూ కనిపించేలా నిర్మాణాలు చేపట్టారు.

ప్రఖ్యాత సదస్సులకు అనుకూలం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచూ పెట్టుబడుల సదస్సులను నిర్వహిస్తుంది. మూడు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ఇన్వెస్టర్స్ మీటికి దేశ విదేశాల నుంచి ప్రముఖ సంస్థల ప్రతినిధులు వస్తుంటారు. ఈ సదస్సులోనే తాము పెట్టబోయే పెట్టుబడులపై ఎంఓయూలు కుదుర్చుకుంటారు. అందుకోసం సువిశాల స్థలంలో అత్యాధునిక హంగులతో అందమైన జర్మన్ టెంట్లను నిర్మిస్తారు. ఈ సదస్సు జరిగే స్థలాన్ని చదును చేస్తారు. తాత్కాలికంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తారు. సదస్సు పూర్తవగానే వాటిని తొలగిస్తారు. ఇలా మూడు నాలుగు రోజుల సదస్సుకే రూ.10-15 కోట్ల వరకు వెచ్చిస్తారు. జగన్ పుణ్యమాని రుషికొండలో నిర్మించిన ప్యాలెస్ ను ఇలాంటి సదస్సుల నిర్వహణకు వినియోగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొంతమంది మేథావుల నుంచి వ్యక్తమవుతోంది.

 

బాంకెట్ హాలు

దీనిని దృష్టిలో ఉంచుకునే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంఐసీఈకి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పినట్టు స్పష్టమవుతోంది. ఇంకా తరచూ జీ-20 సహా పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులనూ నిర్వహిస్తోంది. వీటికి ఎక్కువగా విశాఖనే ఎంపిక చేస్తోంది. వీటిని స్టార్ హోటళ్లలో నిర్వహించడం వల్ల కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి సదస్సులకు రుషికొండ ప్యాలెస్ను వినియోగించడం ద్వారా ప్రతిసారీ తాత్కాలిక ఏర్పాట్ల కోసం పదుల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఆదా చేయవచ్చన్న భావనగా ఉంది. ఇలా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ ప్యాలెస్ వినియోగంలో చంద్రబాబు తనయుడు, ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఐటీ మంత్రి లోకేష్ మాట నెగ్గుతుందా? లేక సంబంధిత పర్యాటకశాఖ మంత్రి దుర్గేష్ మాట చెల్లుబాటు అవుతుందో చూడాలి మరి! 

Tags:    

Similar News