స్పీకర్ తమ్మినేనికి.. అసమ్మతి కుంపటి...

స్పీకర్ తమ్మినేని నియోజకవర్గంలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. సొంత పార్టీలోనే రెండు గ్రూపులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

Update: 2024-03-17 11:49 GMT


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు.. అలకలు... బుజ్జగింపులు.. కామన్‌గానే కనిపిస్తుంటాయి. అందులోనూ అధికారపార్టీలో ఇలాంటి వ్యవహారం కాస్త ఎక్కువనే చెప్పాలి. కానీ శ్రీకాకుళం జిల్లా వైసీపీలో మాత్రం అధికార పార్టీ నేతల తీరు రొటీన్‌కు భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ కోసం ఆది నుంచి కష్టపడినవారిని పార్టీ పెద్దలు గుర్తించనప్పుడు ఎంత కష్టపడి ఏముంది అన్నట్టు ద్వితీయ శ్రేణి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేస్తున్న సిక్కోలు జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో కనిపిస్తుంది.

చాప కింద నీరులా గ్రూపు రాజకీయాలు....

వాస్తవానికి మిగతా జిల్లాలతో పోలిస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిక్కోలు నేతలకు ప్రాధాన్యత ఉన్న పదవులే లభించాయి. జిల్లానుంచి మంత్రులుగా ధర్మాన కృష్ణ దాస్, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులు పనిచేశారు. అలాగే సీనియర్ నేత తమ్మినేని సీతారాం స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ సిక్కోలు వైసీపీ నేతల్లో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. వైసీపీ టికెట్లు ప్రకటన తర్వాత ఆమదాలవలస నియోజకవర్గంలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. ఇక్కడ నుంచి తమ్మినేని సీతారాం ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ సిగ్మెంట్లో గ్రూపు రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. ఓ గ్రూపును ఎమ్మెల్యే... మరో గ్రూపును చింతాడ రవికుమార్, ఇంకో గ్రూపును సువ్వారి గాంధీలు నిర్వహిస్తున్నారు. సొంత పార్టీలోనే ప్రతిపక్షం మాదిరిగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఆరోపణలు చేసుకుంటున్నారు.

బగ్గుమన్న అసంతృప్తి...

ఆముదాలవలస నియోజకవర్గంలో ఇప్పటికే తమ్మినేనితో విభేదించిన కోట బ్రదర్స్‌ పార్టీని వీడగా... తాజాగా వైసీపీ ముఖ్య నేత సువ్వారి గాంధీ తన ఎంపీపీ పదవితో పాటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయన భార్య గ్రంథాలయ చైర్మన్ పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇండిపెండెంట్‌గా ఆమె బరిలో దిగనున్నట్లు ప్రచారం సాగుతోంది.


Tags:    

Similar News