విశాఖ ఉక్కును ముంచేస్తుంటే బాధ్యత లేదా?

కేంద్రాన్ని నిలదీసే సత్తా లేకపోవడంపై ఆగ్రహం. కర్నాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కు రూ.15 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఉక్కు మంత్రి కుమారస్వామి. ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్.

Update: 2024-12-26 09:35 GMT

తమ రాష్ట్రంలో చావు బతుకుల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను బతికించడానికి కర్నాటక ఎంపీలు, మంత్రులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బతికున్న ఉక్కు ఫ్యాక్టరీని చంపేయడానికి కేంద్రం సాయశక్తులా కృషి చేస్తుంటే చేష్టలుడిగి చూస్తున్నారు. ఆంధ్ర ఎంపీల వైఖరిపై మేధావులు మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపకపోతే వీరు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఏవేవో వంకలు పెట్టి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే నిర్ణయించింది. అప్పట్నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్స్టాంట్ కార్మికులు ఆందోళనలు, ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు చేపడుతూనే ఉన్నారు. వీరికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తూతూమంత్రంగా మద్దతునిస్తున్నారు. అంతేతప్ప వీరెవరూ సీరియస్ గా రోడ్డెక్కడం గాని, తీవ్ర స్థాయిలో ఉద్యమించిన పరిస్థితి గాని లేదు. దీంతో ప్రైవేటీకరణను అడ్డుకునే బాధ్యత ఉక్కు కార్మికులకే పరిమితమైన పరిస్థితి ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని ప్రకటించినప్పట్నుంచి కేంద్రం మరింత పగబట్టినట్టుగా వ్యవహరిస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ ఎంపీలు ఈ స్టీల్ ప్లాంట్పై ఉద్యమించ లేదని, కేంద్రాన్ని నిలదీయలేదని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్కు వచ్చి కార్మికుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నికలైన రెండు నెలల్లోనే ప్లాంట్కు రివైవల్ ప్యాకేజీ ప్రకటించేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆయన హామీ మాట దేవుడెరుగు.. అటువైపు కన్నెత్తే చూడడం మానేశారు. ఇక చంద్రబాబు సంగతీ అంతే. ఎన్నికల ముందు కూటమిని గెలిపిస్తే ప్లాంట్ను రక్షిస్తామని చెప్పిన ఆయన ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తల్లి చేను మేస్తే పిల్ల గట్టును మేస్తుందా? అన్న సామెతలా పార్టీల అధినాయకులే ఈ స్టీల్స్టాంట్పై బాధ్యతా రాహిత్యంతో ఉంటే ఇక ఆ పార్టీల ఎంపీలూ అదే తీరులో నడుచుకుంటున్నారు. అడపాదడపా ప్రైవేటీకరణ జరగదని ఒకసారి, ఆపడానికి ప్రయత్నిస్తామని మరోసారి పొంతన లేని ప్రకటనలిచ్చి పబ్బం గడుపుకుంటున్నారు. మరోవైపు కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెచ్కీ కుమారస్వామి ఉక్కు శాఖ మంత్రి అయ్యారు. ఆ హోదాలో కొన్నాళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చారు. అప్పట్లో ఆయన ఈ ప్లాంట్ను ప్రైవేటకరణ జరగకుండా చూస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు.

విశ్వేశరయ్య స్టీలు రూ.15 వేల కోట్ల ప్యాకేజి..

కర్నాటక భద్రావతిలో ఉన్న విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ చాన్నాళ్లుగా సంక్షోభంలో ఉంది. దానిని బతికించడానికి అక్కడ ఎంపీలతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన ఉక్కు మంత్రి కుమారస్వామి ఎంతగానో పాటుపడుతున్నారు. తాజాగా ఈ ప్లాంట్ పునరుద్ధరణకు రూ.15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. దీని ద్వారా అక్కడ వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ నిధులతో ఆ ఫ్యాక్టరీకి మళ్లీ పూర్వ వైభవం లభించనుంది.

ఆ ఎంపీలు అలా.. మన ఎంపీలు ఇలా..

కర్నాటకలో జనతాదళ్ (ఎస్)కు కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. తమ రాష్ట్రంలోని స్టీల్ ప్లాంట్ను బతికించుకోవడానికి రూ.15 వేల కోట్ల ప్యాకేజీని తెచ్చుకోగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 16 మంది, వైసీపీకి నలుగురు, బీజేపీకి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు వెరసి 25 మంది లోక్సభ ఎంపీలున్నారు. వీరిలో రామ్మోహన్నాయుడు (టీడీపీ) కేంద్రమంత్రి కూడా. బీజేపీ నుంచి ఎన్నికైన ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ సాక్షాత్తూ ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వీరు కాకుండా రాజ్యసభ నుంచి మరో పదకొండు మంది ఉన్నారు. ఏపీ నుంచి ఇంతమంది ఎంపీలున్నా విశాఖ స్టీల్స్టాంట్ కోసం చిత్తశుద్ధితో ఉద్యమించే వారు కనిపించడం లేదు. వీరంతా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని గాని, ప్రధాని మోదీని గాని నిలదీసే సాహసం చేయలేకపోతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను బతికించడానికి నిధులివ్వండి మహా ప్రభో! అంటూ కార్మికులు అర్థిస్తున్నా వీరికి చెవికెక్కడం లేదు. కేవలం 243 మంది మాత్రమే కార్మికులున్న విశ్వేశ్వరయ్య స్టీలు రూ.15 వేల కోట్లు సాయం అందిస్తే.. 20 వేల మంది ఉద్యోగులున్న వైజాగ్ స్టీల్కు ఒక్క పైసా కూడా విదిల్చకపోయినా ఏపీ ఎంపీలకు చీమ కుట్టడం లేదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడవడానికి రూ.18 వేల కోట్ల సాయం అందించాలని ఎప్పట్నుంచో కోరుతున్నా పట్టించుకోవడం లేదు అధికారంలో ఉన్న వారూ, ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలూ వైజాగ్ స్టీల్ ప్లాంట్పై పట్టించుకోకపోవడం వల్లే కేంద్రం ప్రైవేటీకరణపై దూసుకుపోతోందన్న భావన విశాఖ వాసుల్లో బలంగా ఉంది. పైగా మూడు నెలల నుంచి ప్లాంట్ కార్మికులు/ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిలో ఉంది. వీరి ఆకలి కేకలు కూడా ఎంపీలకు వినిపించడం లేదు. విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ అడపాదడపా కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు మీడియాలో ప్రకటనలిస్తున్నారు. కానీ కార్మికులకు జీతాలు కూడా ఇప్పించలేకపోతున్నారు. తాజాగా కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి తమ రాష్ట్రంలోని విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కు ఏకంగా రూ. 15 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించారన్న సంగతి తెలుసుకున్న ఉత్తరాంధ్ర వాసులు.. మన ఎంపీల నిర్లిప్తత, నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. అధికారం కోసం పాకులాడడం మానేసి వైజాగ్ స్టీల్స్టాంట్ పరిరక్షణ కోరుతూ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

అంతమంది ఎంపీలుండీ ఏం లాభం?

కర్నాటకలో జేడీ (ఎస్) నుంచి ఇద్దరు ఎంపీలే ఉన్నా అక్కడ స్టీల్ ప్లాంట్ను బతికించడానికి రూ.15 వేల కోట్ల రివైవల్ ప్యాకేజీని సాధించారు. మనకు 40 మందికి పైగా ఎంపీలున్నా వైజాగ్ స్టీల్స్టాంట్ కోసం ఒక్క రూపాయి కూడా సాధించలేకపోవడం బాధాకరం. మూడు నెలలుగా మా కార్మికులకు జీతాల్లేవని గొంతెత్తుతున్నా వీరంతా ఏం చేస్తున్నారు? ప్లాంట్కు వస్తున్న ఆదాయాన్ని పన్నుల చెల్లింపులకే తన్నుకుపోతున్నారు తప్ప జీతాలివ్వడం లేదు. ఈ ప్లాంట్కున్న 20 వేల ఎకరాల భూమి రాష్ట్రపతి పేరున ఉంది. ఆ భూమిని స్టీల్ ప్లాంట్ పేరుకు బదలాయించి నెట్వర్త్ను పెంచాలి. ప్లాంట్కు సొంత గనులు కేటాయించి, సెయిల్లో విలీనం చేయాలి' అని వైజాగ్ స్టీల్స్టాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జ్యేష్ట అయోధ్యరామ్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ' ప్రతినిధితో చెప్పారు.

 

నాటి ప్రగల్బాలేమయ్యాయి?

ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని ప్రగల్భాలు పలికారు. కూటమి అధికారంలోకి వస్తే ప్లాంట్ రివైవల్ ప్యాకేజీని తెప్పిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ స్టీల్ ప్లాంట్పై ఒక్క మాటా మాట్లాడడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించిన వీరు అంతకంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికంటే కూటమి నేతలు, ఎంపీలే చేతగాని వారయ్యారు. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి' అని సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు.

 

ఆంధ్ర ఎంపీలు రాజీనామాలు చేయాలి..

విశాఖ స్టీల్ ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి సరికాదు. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసినప్పుడు ఈ ప్లాంట్ కంటే ఇతర అంశాలపైనే చర్చిస్తున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ ఫ్యాక్టరీకి నిధులపై కాకుండా నక్కపల్లిలో ప్రతిపాదిత ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనుల గురించి చర్చించడం విడ్డూరం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ గతంలో ఉక్కు శాఖమంత్రి కుమారస్వామికి లేఖ రాశాను. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చింది. కానీ ఇక్కడ ఎంపీలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఏపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వైజాగ్ స్టీల్ గట్టెక్కేందుకు గట్టిగా ప్రయత్నించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం అప్పటి ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో దిగివచ్చిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్టీల్స్టాంట్కు ఆమోదం తెలిపారు. ఇప్పుడూ ఆంధ్ర ఎంపీలు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తమ పదవులకు రాజీనామాలు చేయాలి' అని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News