జగన్.. మా మంచి పనులు నీ కళ్లకు కన్పించవా?
కూటమి ప్రభుత్వం చాలా పనులు చేసిందని, కాకపోతే అవన్నీ మాజీ సీఎం జగన్‌కు కనిపించడం లేదని మంత్రులు విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చాలా పనులు చేశామని, కాకపోతే అవన్నీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కనిపించడం లేదని మంత్రులు విమర్శించారు. వరద సాయంపై మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ అమరావతిలో మాట్లాడుతూ తమ 100 రోజుల పాలనలో ఎన్ని మంచి పనులు చేశామో జగన్ తెలుసుకోవాలన్నారు. బురద రాజకీయాలు మానుకోవాలని జగన్‌కు హితవు పలికారు. దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. వరదల్లో తీవ్రంగా ప్రజలు నష్టపోతే వారిని ఆదుకోవలసింది పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
వర్షాలు, వరదల వల్ల కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకుండా పోతే, యుద్ధ ప్రాతిపదికన బాధితులకు తాగడానికి నీళ్లందించామన్నారు. పారిశుధ్య పనుల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి 7వేల మందిని పిలిపించామన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ నుంచి 3వేల మంది పనిచేశారన్నారు. నిద్రాహారాలు మానుకొని దాదాపు 10వేల మంది వరకు కష్టపడ్డారని, రోడ్లు, ఇళ్లల్లో పేరుకొని పోయిన బురదను ఫైరింజన్ల ద్వారా శుభ్రం చేయించామన్నారు. వరదల సమయంలో ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తే అవి జగన్‌కు కనిపించ లేదా అని నిలదీశారు. వరద సాయం కింద రూ. 601 కోట్లు ఖర్చు అయిందన్నారు. ఆహారానికి రూ. 92.5 కోట్లు, తాగు నీటికి రూ. 11.2 కోట్లు, మెడికల్ కేర్‌కు రూ. 4.45 కోట్లు, పారిశుధ్యానికి రూ. 22. 56 కోట్లు ఖర్చు పెట్టినట్లు వివరాలను వెల్లడించారు. వరదలకు ఎన్టీఆర్ జిల్లాలో రూ. 139.44 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు.