మంత్రులు వరదల్లో ఎలా పనిచేశారో తెలుసా...
మంత్రులు బాధితులకు సాయం అందించడంలో చూపిన చొరవ బుడమేరు గండ్లు పూడ్చంలో ఎందుకు చూపలేదనే విమర్శలు వచ్చాయి. అయితే మంత్రులు మాత్రం కష్టపడి పనిచేశారనటంలో సందేహం లేదు.
విజయవాడను ముంచెత్తిన వరదల నుంచి ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రులు రేయింబవళ్లు కష్టపడి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించారు కూడా. వరద పోటును ఆపకుండా వరద నీటిలో తిరుగుతూ బాధితులను పరామర్శించేందుకు చూపిన చొరవ బుడమేరుకు పడిన గండ్లను పూడ్చడంలో చూపించలేదనే విమర్శలు ఉన్నాయి. కాలువకు పడిన గండ్లు పూడ్చే యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద లేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ జరిగింది ఇదే. ఎవరు ముందు ప్రజలను పలకరిస్తే మంచిదని అనుకున్నారే కాని వారం రోజుల పాటు బుడమేరు కాలువ కట్ట మూడు చోట్ల తెగి నీళ్లు పారుతుంటే వాటిని ఆపేందుకుచేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు కేంద్రం నుంచి నిపుణుల బ్రుంధాలను పిలిపించి వారి ద్వారా గండి పూడ్చే కార్యక్రమాలు చేపట్టారు. మూడో గండిని శనివారం సాయంత్రానికి పూర్తిగా పూడ్చే అవకాశం ఉంది. శుక్రవారం హెలికాఫ్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించి గండ్లు త్వరగా పూడ్చాలనే నిర్ణయానికి వచ్చారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు బుడమేరు గండ్లు పడిన ప్రాంతాలకు వెళ్లిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కట్టపైనే ఐదు రోజుల పాటు ఉన్నారు. అక్కడే తింటూ తిరిగారు. కానీ గండ్లను పూడ్పించే అవకాశం మాత్రం ఆయనకు రాలేదు. అక్కడే ఎందుకు ఉన్నాడంటే గండి పూడ్చే వరకు అక్కడి నుంచి కదలొద్దని సీఎం చంద్రబాబు ఆర్డర్ వేశారు. దీంతో స్కూలు పిల్లోడి మాదిరి దానిని పాటించారు. ఇదీ వరదల్లో ఆయన చేసిన పని. 90 మార్క్స్ వస్తాయనుకున్న స్టూడెంట్ 70 మర్క్స్ తెచ్చుకుంటే ఎక్స్త్రా టైం చదివినట్లు, లోకేష్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, కంట్రోల్ రూమ్ లొనే ఉంటున్నాడు. కారణం RTGS శాఖ మంత్రి ఆయనే కాబట్టి.
వరద ఉధృతంగా ఉన్న 4 రోజులు తన నియోజకవర్గంలో కరకట్టకి కాపలా కాసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరద తగ్గిన వెంటనే రంగంలోకి దిగి రాష్ట్ర నలుమూలల నుంచీ సరుకులు తెప్పించి, బాధితులకు అందించే పనిలో ఉన్నారు. రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మూడు రోజులు తన నియోజకవర్గంలో కట్టకి కాపలా కాసి, తర్వాత నుంచీ వెళ్లి గండి పూడ్చే పనిలో ఉన్నాడు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన జిల్లాలో కట్టకి గండి పడకుండా అప్పటికప్పుడు చర్యలు తీసుకుని, వరద నీళ్లు పోయిన వెంటనే ఒక్కో ఏరియాకి కరెంట్ సప్లై వచ్చేలా చూశారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అయితే వరద ప్రాంతాల్లోనే తిరుగుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకుని వచ్చి క్లినింగ్ చేయిస్తున్నారు. విపత్తుల శాఖ కూడా చూసే హోమ్ మంత్రి వంగలపూడి అనిత వరద నీటిలోనే తిరుగుతున్నారు.
వీళ్ళందరి శాఖలు పని చేయడానికి డబ్బులు సర్దాల్సిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఒకపక్క వరద ప్రాంతాల్లో తిరుగుతూనే, నష్టం వివరాలు తీస్తూ, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దుర్గగుడి కిచెన్ లో లక్షల ఆహార పొట్లాలు తయారు అవుతున్నాయి. వండిన ఆహారం అయితే త్వరగా చెడిపోతుంది అని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల ద్వారా లక్షల సంఖ్యలో యాపిల్స్ సేకరించారు.
ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మొదటి 2 రోజులు కంట్రోల్ రూము లోనే ఉన్నారు. (ఇండియాలో డ్రోన్స్ ఎగరాలంటే ఏవియేషన్ మినిస్ట్రీ పర్మిషన్ ఉండాలి). మరో కేంద్ర మంత్రి తన నియోజకవర్గంలో వరద ప్రాంతాల్లో పర్యటించి, వరద సాయం చేసే పనుల్లో ఉన్నారు, నెక్స్ట్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆరో రోజు వరదల్లో బాధితులను పలకరిస్తూ రోడ్లపై మోకాలి లోతు నీటిలో తిరిగారు.
మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథిలు సాయం అందించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాలువను పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పి మాత్రం చేయగలిగారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంతో మంది ట్రాక్టర్ లు నడుపుతూ ఆహార ప్యాకెట్లు ఇస్తున్నారో లెక్క తెలీదు. ఎక్కడి ఎమ్మిగనూరు అక్కడి నుంచీ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చారు. ఎక్కడి దాచేపల్లి అక్కడి నుంచీ ట్యాంకర్లు వచ్చాయి. ఎక్కడి వైజాగ్ డైరీ అక్కడి నుంచీ పాల ప్యాకెట్లు వచ్చాయి. ఎక్కడి చిత్తూరు అక్కడి నుంచీ కూరగాయలు వచ్చాయి.
మంత్రులు అంతా ఇటు ఉంటే, సాధారణ పరిపాలన వదిలేశారు అని ఏడ్చే రెండు రోజుల క్రితం వరదల్లో ఉన్న విజయవాడలోనే వేదాంత కంపెనీ రాష్ట్రంలో 83వేల కోట్ల పెట్టుబడులకు రెడీ అనింది, ఆ కార్యక్రమం పెట్టుబడుల శాఖ మంత్రి గారు హాజరు అయ్యారు. మరో మంత్రి ఢిల్లీలో మంత్రుల సదస్సులో ఉన్నాడు. రోజువారీ జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి.
రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారని తిట్టుకుంటాం, అడ్మినిస్ట్రేషన్ విషయంలో తప్పులు చేస్తున్నారని ఒప్పుకుంటాం, అయితే డిజార్డర్ మేనేజ్మెంట్, క్రైసిస్ హ్యాండ్లింగ్ లో మాత్రం ఎలా చేయాలో... ఏమి చేయాలో ఇంకా పాలకులు తెలుసుకోలేక పోవడం పలు విమర్శలకు దారి తీసింది. ప్రచారం కోసం చూపిన చొరవ గండ్లు పూడ్చే విషయంలో చూపలేదనే విమర్శలు ఉన్నాయి.