న్యాయస్థానాల్లో విచారణకు వచ్చిమీడియా ముందుకొచ్చిన కేసులు ఏంటో తెలుసా?
సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో నేడు విచారణకు వచ్చి మీడియాలో చర్చకొచ్చిన కేసులు అన్నీ వైఎస్సార్సీపీవే. ఆ కేసులు ఏమిటో తెలుసా...
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరమైన కేసులకు ప్రాధాన్యత పెరిగింది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ వారిపై నమోదైన కేసులే ఎక్కువ కోర్టులకు వచ్చాయి. అలాగే ప్రస్తుతం వైఎస్సార్సీపీ వారిపైనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోందనే చర్చ రాష్ట్రంలో ఎక్కువైంది. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ అనుకూలురు షోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపైనే అందరి దృష్టీ ఉంది. నేడు సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో చర్చకు వచ్చిన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సుప్రీం కోర్టులో రెండు వైఎస్సార్సీపీకి సంబంధించిన వారికి విచారణకు రాగా హైకోర్టులో ఒకరి కేసు విచారణకు వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ కేసులు బాగా ఫీడ్ అందించాయి.
సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసు విచారణకు వచ్చింది. ఇన్నేళ్ల నుంచి ఈ కేసును ఎందుకు పరిష్కరించలేదు. సీబీఐ, ఈడీల వద్ద నుంచి రావాల్సిన విచారణ నివేదికలు ఇంకా ఎందుకు రాలేదు. తెలంగాణ హైకోర్టు నుంచి రావాల్సిన కేసు పూర్వాపరాలు ఇంకా ఎందుకు సుప్రీం కోర్టుకు రాలేదని జడ్జి ప్రశ్నించారు. రెండు వారాల సమయం ఇస్తున్నాం, ఈ లోపు అన్ని విచారణ నివేదికలు సుప్రీం కోర్టు ముందు ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసును డిసెంబరు 13కు వాయిదా వేశారు. ఈ కేసు విషయంలో మీడియానే కాదు ప్రజలు కూడా ఆసక్తిగా గమనించారు. కోర్టు ఏమి చెబుతుందోనని ఎదురు చూశారు. మీడియాలో అయితే ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్ర్కోలింగ్ లు, రిపోర్టులు వస్తూనే ఉన్నాయి.
సోషల్ మీడియాపై ఎవరిపైన ఏ కేసు నమోదవుతుంది. ఎప్పుడు నమోదవుతుంది. అందులో ఎంత పెద్ద వారు ఉన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఉన్న వారి పరిస్థితి ఏమిటనేది నేడు పెద్ద చర్చ. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో పోలీసులు, లాయర్లు, ప్రభుత్వ పెద్దలు.. అందరి దృష్టి సోషల్ మీడియాపైనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కూడా సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి చర్చించారు. ఈ చర్చతో పాటు సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేసిన సజ్జల భార్గవ్ రెడ్డి విషయం మీడియాలో పెద్ద చర్చగా మారింది. సుప్రీం కోర్టు భార్గవరెడ్డి పిటీషన్ ను స్వీకరించకుండానే ఆయన లాయర్ కపిల్ సిబాల్ చెప్పిన మాటలు విన్నది. న్యాయమూర్తి భార్గవరెడ్డి నియమించుకున్న న్యాయ మూర్తి వాదన విన్న తరువాత కేసు హైకోర్టులోనే పరిష్కారం అవుతుందని, రెండు వారాల పాటు భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ టాపిక్ కూడా సోమవారం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. కోర్టులో న్యాయ వాది నిందితుని తరపున వాదించినప్పటి నుంచి సాయంత్రం వరకు స్ర్కోలింగ్ లు వస్తూనే ఉన్నాయి.
హైకోర్టులో వైఎస్సార్సీపీ నాయకుడు పూనూరు గౌతంరెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరిగింది. గౌతంరెడ్డి తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే న్యాయ మూర్తి ఇరువురు న్యాయ వాదుల వాదనలు వితన్న తరువాత మంగళవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో ఒక వ్యక్తిపై పూనూరు గౌతంరెడ్డి ఉద్దేశ్య పూర్వకంగా హత్య చేయించేందుకు ప్రయత్నించారని, భూ వివాదంలో రాజీకి రావాల్సిందిగా బాధితునిపై వత్తిడి తెచ్చి చివరకు హత్యాయత్నానికి ప్రయత్నించారనే నేరం కింద కేసు నమోదైంది. ఈ కేసులో బాధితుని శరీరంపై గాయాలు ఉన్నాయా? అంటూ న్యాయవాదిని అడిగి జడ్జి తెలుసుకోవడం విశేషం. గాయాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని బాధితుని తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఈ మూడు కేసులు సోమవారం మీడియాకు పెద్ద వార్తలుగా మారాయి. పైగా మూడు కేసులు కూడా కేవలం వైఎస్సార్సీపీకి సంబంధించిన ముఖ్య నేతలవి కావడంతో జనం టీవీలకు అతుక్కు పోయారు. అన్ని కేసులూ వాయిదా పడటంతో నిట్టూర్చి వదిలేశారు.