‘వివేకం’ సినిమా లక్ష్యం జగనన్న ఓటమేనా?

‘వివేకం’ సినిమా ఎవరు తీశారో తెలియదంటున్న వైఎస్ సునీత ఈసారి ఎన్నికల్లో జగనన్న ఓటమే లక్ష్యంగా పని చేస్తానంటున్నారు. కడపలో వైఎస్ షర్మిలకు పూర్తి మద్దతిస్తానన్నారు.

Update: 2024-04-02 07:40 GMT
తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న సునీత

‘వివేకం’ సినిమా ఎవరు తీశారో నిజంగానే వైఎస్‌ సునీతకు తెలియదా? ఆమెకు తెలియకుండానే ‘వివేకం’ సినిమా బయటకువచ్చిందనుకోవాలా? అంటే అవుననే ఆమె సమాధానం చెబుతున్నారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె అయిన సునీత మంగళవారం (ఏప్రిల్‌ 2) కడపలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘ఆ సినిమా ఎవరు తీశారో తనకు తెలియదు. కానీ చాలా ధైర్యంగా తీశారు’ అన్నారు వైఎస్‌ సునీత. సినిమాలో చూపించిన దానికంటే ఇంకా ఘోరంగా తన తండ్రిని హత్య చేశారన్నారు. హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదని, తన అన్న జగన్‌ ప్రభుత్వం మళ్లీ వస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే తాను ముందుకు వచ్చానంటున్నారు సునీత.

ఎంపీగా పోటీ చేయాలని వివేకా శాయశక్తులా కృషి చేశారు. ఆ ప్రయత్నంలోనే హత్యకు గురయ్యారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎంపీగా పోటీ చేస్తారని తన తండ్రి కూడా కోరుకున్నారు. అలా జరగలేదు. ఇవేళ అలా జరుగుతున్నందుకు సంతోషం. షర్మిల పోటీ చేయడం అభినందించదగ్గ విషయం. వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడింది. జగన్‌ జైలు నుంచి బయటకు వచ్చాక షర్మిలకు భయపడి ఆమెను దూరం పెట్టారు అన్నది సునీత వాదన. షర్మిలకు రాజకీయ సపోర్ట్‌ లేకుండా ఉండేందుకే వివేకాను హత్య చేశారా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? .. వాస్తవాలన్నీ బయటకు రావాలన్నారు సునీత. ‘ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి. కడప ఎంపీగా అవినాష్‌ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం.. వీలైతే వైఎస్‌ జగన్‌నూ ఓడించాలి.. ప్రస్తుతానికి ఇదే నా లక్ష్యం’ అంటూ వైఎస్‌ సునీత తన అన్న జగన్‌పై మండిపడ్డారు. వైఎస్‌ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసు. ప్రజలు చాలా తెలివైన వారు. ప్రతిసారీ మోసపోరు అన్నారు సునీత. నిజమేంటో ప్రజలకు బాగా తెలుసు. ప్రతిసారి ఎవరూ అందరినీ మోసం చేయలేరు. ఏం జరిగిందో కడప ప్రజలకు తెలుసు. అన్న సీఎం జగన్‌ కడప ప్రజల్లో మనిషే కదా?.. ఆయనకు అంత భయమెందుకు? వారు ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. మీరు ఎక్కడ చెబితే అక్కడ చర్చకు సిద్ధం. సాక్షి చానల్‌కు రమ్మన్నా చర్చకు వస్తా అంటున్నారు సునీత.
అవినాష్‌ను ఎందుకు కాపాడుతున్నారు?
‘‘వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని జగన్‌ అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా! అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో.. ఎవరు చేయించారో మీకూ తెలిసినట్లే కదా! అది ఎందుకు బయటపెట్టడం లేదు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే.. ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంతభయం దేనికి? నేరుగా మాట్లాడాలంటే చెప్పండి. నాకు అభ్యంతరం లేదు.. మీ సాక్షి ఛానల్‌కి వస్తా.. డిబేట్‌ చేద్దాం. నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు’’ అన్నారు సునీత. ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న షర్మిలకు మద్దతు ప్రకటించారు సునీత.


Tags:    

Similar News