మంత్రి అంబటికి పొగబెట్టిన వీళ్లెవరు?
మంత్రి అంబటి రాంబాబుకు పొగబెట్టారు సొంత పార్టీ వాళ్లే. ఇప్పటి వరకు పార్టీ వ్యతిరేకులు అంబటి పై విరుచుకుపడితే ఇప్పుడు సొంత పార్టీ వాళ్లు మండిపడుతున్నారు.;
మంత్రి అంబటి రాంబాబుకు పొగబెట్టారు సొంత పార్టీ వాళ్లే. ఇప్పటి వరకు పార్టీ వ్యతిరేకులు మంత్రి అంబటి రాంబాబుపై విరుచుకుపడితే ఇప్పుడు సొంత పార్టీ వాళ్లు మండిపడుతున్నారు. దీంతో అధికార పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గంలో విభేదాలు భగ్గుమన్నట్టయింది. మంత్రి అంబటిపై గతంలో ఆయన సామాజికవర్గానికి చెందిన నాయకులు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సత్తెనపల్లి టికెట్ ఆశిస్తున్న వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం నాయకులు కూడా అంబటి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. తమకే టికెట్ కావాలంటూ కొందరు వైవీ సుబ్బారెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి వినతిపత్రాలు అందించి వచ్చారు. తాజాగా కొందరు అసంతృప్తి నాయకులు నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేయనున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి ఫిర్యాదు చేశారు.
ఎవరి వీళ్లు.. ఏమా కథ..
సత్తెనపల్లి వైసీపీలో రెండు ముఠాలున్నాయి. ఒక ముఠాకి అంబటి అనుచరులు నాయకత్వం వహిస్తుండగా మరో ముఠాకి రెడ్డి సామాజిక వర్గ నేతలు నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట వచ్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను రెడ్డి సామాజిక వర్గ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. ‘మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాకుండా చూడండి. కాదూ కూడదని అంబటికే టికెట్ ఇస్తే 25 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయం’ అని అసమ్మతి నేతలు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అంబటికే టికెట్ ఇస్తే తాము పని చేయబోమని కూడా చెప్పారని సమాచారం. అనిల్ కుమార్ ను కలిసిన వారిలో అసమ్మతి నాయకులతో పాటు పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు కూడా ఉన్నారు. సత్తెనపల్లిలో వైసీపీ పరిస్థితి బాగా లేదని అనిల్ దృష్టికి తీసుకువచ్చారు. ‘‘పార్టీలో ముఠా కుమ్ములాటలకు అంబటి కారణం. గ్రూపు విభేదాలకు అంబటి ఆజ్యం పోశారు. మొదట్నుంచి పార్టీలో ఉంటున్న వారిని ఇబ్బందులకు గురిచేశారు. దందాలు చేయిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని గతంలో అంబటి కోసం పనిచేశాం. ఈసారి పనిచేయలేం’ అని వాళ్లు అనిల్ కు చెప్పారు. అనిల్ ను కలిసిన వారిలో వైసీపీ నాయకులు డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, చిట్టా విజయభాస్కరరెడ్డి, మర్రి వెంకట్రామిరెడ్డి, బ్రహ్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారవేశారు అంబటి అనుచరులు. ఎన్నికల్లో టికెట్లు ఆశించే వారు ఉండడం, టికెట్ రాకపోతే అసంతృప్తి చెందడం మామూలేనని, ఈ మాత్రానికే అంబటికి టికెట్ ఇవ్వకుండా పోతారా అని వ్యాఖ్యానించారు.