రామ్‌గోపాల్‌ వర్మపై తొందర పడొద్దు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీసినందుకు వర్మ మీద కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు.;

Update: 2025-03-06 09:35 GMT

ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కేసుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొందరపడి రామ్‌గోపాల్‌ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఆరు వారాల పాటు వర్మ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్మకు కాస్త ఊరట లభించింది.

రామ్‌గోపాల్‌ వర్మ మీద సోషల్‌ మీడియా కేసులు, వాటి విచారణ, ముందస్తు బెయిల్‌ మంజూరు అంశాలు ఒక పక్క సాగుతుండగా, మరో వైపు వర్మ మీద మరో కేసు నమోద చేశారు. వర్మ తీసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి సిఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వర్మ కోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో క్వాష్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం హై కోర్టు విచారణ చేపట్టింది.
తనపై రాజకీయ దురద్దేశంతోనే ఫిర్యాదులు చేయడం, కేసు నమోదు చేయడం చేశారని, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని వర్మ తన పిటీషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్‌ బోర్టు కూడా సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో ఈ చిత్రాన్ని విడుదల చేశామని కోర్టుకు తెలిపారు. అయితే 2024లో దీనిపై కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, అందువల్ల ఈ కేసును కొట్టివేయాలని క్వాష్‌ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు ఆధారంగా తనపై సీఐడీ తీసుకోబోయే తదుపరి చర్యలను కూడా నిలుపుదల చేయాలని పిటీషన్‌లో వర్మ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రామ్‌గోపాల్‌ వర్మకు కాస్త అనుకూలంగా ఉండే విధంగానే తీర్పును వెలువరించింది. ఆరు నెలల వరకు వర్మపై పోలీసులు ఎలాంటి చర్యలకు తీసుకోవడానికి వీల్లేకుండా తీర్పులో పోలీసులను ఆదేశించింది.
Tags:    

Similar News