అప్పన్నా.. నీ ప్రసాదానికీ అపచారమేనా?

నరసింహుడికి సరఫరా చేసే నెయ్యి కల్తీయేనా?.. రైతు డెయిరీ నెయ్యి నాణ్యతపైనా అనుమానాలు. ఈ ఆలయంలో ఉన్న నెయ్యి వాడకానికి బ్రేకు.

Update: 2024-09-23 13:18 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

తిరుమల శ్రీవేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదంపై చెలరేగిన నకిలీ నెయ్యి దుమారం ఇంకా సద్దుమణగలేదు. దీనిపై రాజుకున్న రాజకీయ 'ఆజ్యం' ఇంకా చల్లారలేదు. పైగా రోజు రోజుకూ ఈ వ్యవహారం తీవ్ర రూపం దాలుస్తోంది. పలు మలుపులు తిరుగుతోంది. దేశ, విదేశాల్లోని భక్తుల్లోనూ పెద్ద ఎత్తున అలజడి రేగుతోంది. వెంకన్న లడ్డూల్లో వినియోగించే ఆవు నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వులు కలిశాయంటూ అటు టీటీడీ, ఇటు కూటమి ప్రభుత్వం బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఇంతలో.. తిరుమల తర్వాత ఎంతో ప్రాశస్త్యం, వైశిష్ట్యం కలిగిన సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత కూడా లోపభూయిష్టంగా ఉందంటూ తాజాగా విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన సరికొత్త వివాదానికి తెరలేచింది. రెండు రోజుల క్రితం గంటా ఈ ఆలయానికి వెళ్లి అక్కడ అప్పన్న స్వామి లడ్డూల్లో వాడుతున్న ఆవు నెయ్యిని పరిశీలించారు.

 

ఒక్కో లడ్డూను రూ.15 విక్రయిస్తుండాన్ని పరిశీలించారు. ఆ నెయ్యి రంగు, నాణ్యతతో పాటు సరఫరా చేస్తున్న ధరపై ఆయనకు అనుమానం వచ్చింది. ఈ దేవస్థానానికి కిలో ఆవు నెయ్యి రూ.385.41కే సరఫరా అవుతోందని తెలుసుకున్న ఆయన ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారని ఆలయ అధికారులను నిలదీశారు. టెండరు దక్కించుకున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 'రైతు డెయిరీ' అనే సంస్థ ద్వారా ఈ అవు నెయ్యి సరఫరా అవుతోందని ఎమ్మెల్యే గంటాకు ఆ అధికారులు వివరించారు. దీనిపై ఆశ్చర్యపోయిన ఆయన బహిరంగ మార్కెట్లో కిలో ఆవు నెయ్యి రూ. వెయ్యికి పైనే ఉండగా అందులో మూడోవంతు ధరకు ఎలా సరఫరా చేస్తారని నిలదీశారు. ఆపై ఈ ఆవు నెయ్యి స్వచ్ఛమైనది కాదని, కల్తీ చేస్తేనే అంత తక్కువ ధరకు సరఫరా చేస్తారని నిర్ధరణకు వచ్చిన ఆయన.. ఆ నెయ్యి నాణ్యత పరీక్ష కోసం ల్యాబు పంపాలని ఆదేశించారు. అప్పటి వరకు రైతు డెయిరీ నెయ్యిని వాడొద్దని స్పష్టం చేశారు. దీంతో దేవస్థానం అధికారులు అప్పటికి దేవస్థానంలో నిల్వ ఉన్న 63 డబ్బాల (ఒక్కో డబ్బా 15 కిలోలు) ఆవు నెయ్యిని వాడకుండా పక్కనబెట్టారు.

తాత్కాలికంగా విశాఖ డెయిరీ నుంచి..

సింహాచలం దేవస్థానంలో సగటున రోజుకు 250 కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తారు. రోజుకు 25-30 వేల లడ్డూలు తయారవుతాయి. లడ్డూల తయారీకి 240 కిలోల వరకు, మరో 10 కిలోల స్వామికి భోగాలు, దీపారాధన తదితరాలకు అవసరమవుతుంది. ప్రస్తుతం ఆలయానికి సరఫరా చేస్తున్న రైతు డెయిరీ ఆవు నెయ్యి నాణ్యతపై అనుమానాలు తలెత్తడంతో దాని వాడకాన్ని నిలిపివేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా విశాఖ డెయిరీ నుంచి ఆవు నెయ్యిని కొనుగోలు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు. ఆ మేరకు సోమవారం విశాఖ డెయిరీ నుంచి వంద డబ్బాల ఆవు నెయ్యిని రప్పించారు. ఈ నెయ్యిని కిలో రూ.605.13 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రైతు డెయిరీ నెయ్యి శాంపిళ్లపై నివేదిక వచ్చే వరకు విశాఖ డెయిరీ నెయ్యినే ఈ దేవస్థానానికి వినియోగించనున్నారు. 

గతంలో ఈ దేవస్థానం కొనుగోలు చేసిన ఆవు నెయ్యి వివరాలు ఇలా.. 

 

కిలో రూ.393కే ప్రీమియర్ ఆగ్రోటెక్ నెయ్యి..

మార్కెట్లో కిలో గేదె నెయ్యి రూ.600 పైనే ధర పలుకుతోంది. అదే స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే కిలో రూ. వెయ్యి పైమాటే. అలాంటిది ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీమియర్ ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కిలో రూ.393.30కే సింహాచలం దేవస్థానానికి సరఫరా చేయడానికి టెండరు దక్కించుకుంది. 2022-23 సంవత్సరంలో ఆరు నెలల పాటు ఈ సంస్థ ఆ ధరతో 54 వేల కిలోలను సరఫరా చేసింది. అంటే బయట మార్కెట్ కంటే మూడో వంతు తక్కువ ధరకే ఎలా సరఫరా చేసిందో ఆ అప్పన్నకే ఎరుక. ఆ ఏడాది తర్వాత ఆరు నెలలూ విశాఖకే చెందిన సూర్యకుమారి ఏజెన్సీస్ కిలో ఆవు నెయ్యి రూ.529కి సరఫరా చేయడం

విశేషం. అంటే కిలో ఆవు నెయ్యి వద్ద రూ.136 తక్కువకే ప్రీమియర్ సంస్థ సరఫరా చేసింది. అంతేకాదు.. ఉత్తరప్రదేశ్ నుంచి విశాఖకు వేల కిలోమీటర్ల దూరం రవాణా చార్జి కూడా తడిసి మోపెడవుతుంది. కనీసం లీటరుపై రూ.30-35 రవాణా చార్జి అవుతుంది. అంటే ఆ సంస్థకు కిలో ఆవు నెయ్యి రూ.360 కంటే తక్కువకే లభ్యమవుతుందన్న మాట! ఈ లెక్కన ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత నేతి బీరకాయలో నెయ్యి చందంలా మారింది. గత ఐదేళ్లలో అత్యంత తక్కువ ధరకు ఆవు నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో రైతు డెయిరీ (కిలో రూ.385.41), ప్రీమియర్ ఆగ్రో టెక్ (రూ.393.30)లుండడం విశేషం!

నెయ్యి లోపాన్ని చూపని ల్యాబ్..

సింహాచలం దేవస్థానానికి సరఫరా అయ్యే సరకులు సహా నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి విశాఖలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ప్రాంతీయ ఆహార ప్రయోగశాల (రీజనల్ ఫుడ్ లేబరేటరీ)కు పంపుతారు. అటు నుంచి అంతా ఓకే అని రిపోర్టు వచ్చాక వినియోగిస్తారు. విచిత్రమేమిటంటే.. ఇప్పటివరకు ఆవు నెయ్యిలో నాణ్యతా లోపం ఉన్నట్టు నివేదిక రాలేదని, దాని ఆధారంగానే లడ్డూల్లో నెయ్యిని వినియోగిస్తున్నట్టు దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికీ, విస్మయానికి గురి చేస్తోంది. రూ.కిలో వెయ్యి ధర పలికే నెయ్యి రూ.385కి, రూ.393కి సరఫరా చేస్తే అందులో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉంటాయో ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. ఇందులో ఎవరిని తప్పుబట్టాలి? ఎవరిని శంకించాలి? అన్నది అంతుచిక్కడం లేదు. 'మార్కెట్లో స్వచ్ఛమైన ఆవునెయ్యి కిలో రూ.వెయ్యికి పైనే పలుకుతుంటే రూ.385కి సరఫరా చేస్తున్నారంటే అందులో నాణ్యతను కచ్చితంగా అనుమానించాల్సిందేనని విశాఖకు చెందిన రిటైర్డ్ ఇంజినీర్ అవసరాల లక్ష్మణరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. తాజాగా రైతు డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని విశాఖ ల్యాబు కాకుండా హైదరాబాద్ లోని ల్యాబు పంపడం గమనార్హం!

 

ప్రభుత్వరంగ డెయిరీల నుంచే కొనుగోలు చేయాలి..

'దేవాలయాలకు సరఫరా చేసే ఆవు నెయ్యి నాణ్యతను ప్రఖ్యాత ల్యాబ్ ల్లోనే పరీక్షించాలి. ఏమాత్రం నాణ్యత లేకున్నా కొన్ని ల్యాబ్లు ఏ లోపం లేనట్టు నివేదికలిస్తున్నాయి. సరఫరా సంస్థలు ఈ ల్యాబ్లను మేనేజ్ చేయడం వల్ల ఇలాంటి నివేదికలొస్తున్నట్టు అనుమానాలున్నాయి. కిలో రూ. వెయ్యి పైనే పలుకుతున్న ధర రూ.385కి సరఫరా చేస్తుంటే అది నాణ్యమైనది ఎలా అవుతుంది? ఇకపై తిరుమల, సింహాచలం సహా అన్ని దేవాలయాలకు ప్రభుత్వరంగంలో నడిచే డెయిరీల నుంచే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.' అని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు పాశర్ల ప్రసాద్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

దేవస్థానంలో విచిత్రం..

సింహాచలం దేవస్థానంలో ఆశ్చర్యం గొలిపే అంశం వెలుగు చూసింది. విచిత్రమేమిటంటే.. ఈ దేవస్థానానికి ఉన్న గోశాలలో 250కి పైగా దేశీయ గోవులున్నాయి. దేవస్థానం సిబ్బంది వీటి పాల నుంచి నెయ్యిని సేకరిస్తారు. అలా వచ్చిన స్వచ్ఛమైన నెయ్యిని కొన్నాళ్ల క్రితం వరకు కిలో రూ.1600కు విక్రయించే వారు. మరి ఈ దేవస్థానానికి అవసరమైన నెయ్యిని మాత్రం కిలో రూ.400కే కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ?

Tags:    

Similar News