మా గొడవలకు అదే కారణం.. తేల్చి చెప్పిన దువ్వాడ శ్రీనివాస్

తన ఇంటి పోరుపై దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనంతటికి ఒకటే కారణమన్నారు. మా కుటుంబ గొడవకు మాధురి జీవితం నాశనమైందని వ్యాఖ్యానించారు.

Update: 2024-08-10 03:57 GMT

మా ముప్పై ఏళ్ల వైవాహిక జీవితంలో రెండేళ్లు నరకయాతనలా మారిందంటూ దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబ కలహాలపై తీవ్రంగా స్పందించారు. తన భార్య రాజకీయ కాంక్ష, ఆధిపత్య కాంక్షే తమ మధ్య గొడవలకు ప్రధాన కారణమని, రెండేళ్లుగా దీని వల్లే తమ కుటుంబం ముక్కలైందంటూ ఆయన చెప్పుకొచ్చారు. దివ్వల మాధురి ప్రెస్ మీట్ తర్వాత వీరి రచ్చ మరింత పెరిగింది. దువ్వాడ ఇంటిముందు ఆయన భార్య వాణి, కుమార్తెలు ఆందోళకు దిగారు. దీంతో వారిపై దువ్వాడ శ్రీను దాడికి దిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తమ గొడవలకు మొత్తానికి వాణికి ఉన్న రాజకీయ కాంక్షే కారణమన్నారు. రెండేళ్లుగానే తీవ్ర విభేదాలు తలెత్తడం మొదలైందని అన్నారు. ‘‘నేను ఎమ్మెల్యే కావాలి. వ్యాపారం నా పేరుపై ఉండాలన్న వాణి వైనం వల్లే విభేదాలు. పెళ్ళయిన రెండేళ్లకే ఇది మొదలైంది. అప్పటి నుంచి ఆమె అధికారి కాంక్షను తట్టుకోలేకపోతున్నాను’’ అంటూ వ్యాఖ్యానించారు దువ్వాడ శ్రీనివాస్.

నా ఓటమికి భార్యే కారణం

‘‘ఎన్నికల్లో నేను ఐదు సార్లు ఓడిపోయాను. అందుకు నా భార్యే కారణం. తనకు టికెట్ రాకపోతే నన్ను ఓడిస్తానని కూడా అనేది. అందుకే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి కూడా సిద్ధమైంది. నేను విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చాను. పాతికేళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేశా. మరెన్నో కేసులు కూడా ఎదుర్కొన్నాను. ఈసారి జగన్ టికెట్ ఇవ్వడంతో మంచి అవకాశం వచ్చింది. అప్పుడు కూడా టికెట్ తనకే కావాలని రచ్చి చేసింది వాణి.ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం, జగన్ ముందుకు తీసుకెళ్లింది. నాతో విడాకులు కావాలని కూడా డిమాండ్ చేసింది. నేను నా టికెట్‌ను కూడా ఆమెకు త్యాగం చేశాను. కానీ పార్టీలో ఆమె గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో పార్టీ మాత్రం టికెట్ నాకే ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పోటీ చేయాలని భావించింది. దాన్ని వైసీపీ పెద్దలు నిలిపేశారు’’ అని చెప్పారు.

ఇప్పుడు పిల్లలే అస్త్రాలు

‘‘నన్ను రాజకీయంగా దెబ్బతీయాలన్నదే వాణి ఆలోచన. అందుకే ఇప్పుడు పిల్లలను విషనాగుల్లా మార్చి నాపైకి వదిలింది. వారికి నాపై శత్రుత్వాన్ని నూరిపోసింది. నేను పిల్లల్ని ఎండ, వాన తగలకుండా బంగారంలా పెంచాను. ఇద్దరినీ డాక్టర్స్‌గా చదివించాను. ఏలోటు లేకుండా చూశాను, ఆస్తులు రాశాను. ఇల్లు, ఫ్యాక్టరీ కూడా ఇచ్చేశాను. నన్ను ఇంటికి రాకుండా అడ్డుకుంటే తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాను. పిల్లల ఖర్చులకు కోటి యాభై లక్షల రూపాయాలు ఇచ్చయాను. నేను వాళ్లకి ఏ లోటు రానివ్వలేదు. పార్టీ టికెట్ విషయంలో తేడా రావడంతో నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు నా భార్య. హోటల్లో ఉంటూ.. బయట తింటూ ఉన్నాను. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడకు వచ్చి గొడవ చేస్తున్నారు’’ అని అన్నారు.

అందుకే కూతుళ్లను కలవలేదు

‘‘నా ప్రాణానికి ప్రాణంగా భావించే కూతుళ్లు నా దగ్గరకు వచ్చారు. వారితో దర్జాగా వెళ్తాను. కానీ వాళ్లు వచ్చేటప్పుడు టీడీపీ మూకలతో కలిసి వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్లు కారం, గునపాలు, నిచ్చెనలు తీసుకుని వచ్చారు. నన్ను ఏదో కేసులో ఇరికించాలని అచ్చెంనాయుడు చూస్తున్నారు. అందుకే ఇంటి దగ్గర కొడవలో ఫ్యామిలీ నుంచి నన్ను కొట్టేందుకు కొందరిని రెచ్చగొట్టారు. మా ఇంట్లో గొడవలు దశాబ్దాలుగా సాగుతున్నవే. కానీ ఏరోజు కూడా అవి నాలుగు గోడలు దాటి బయటకు పోలేదు. ఇప్పుడే రచ్చకెక్కింది. నాతో అక్రమసంబంధం అంటగడుతున్న దివ్వల మాధురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వాణినే. ఈమె రాజకీయ కాంక్షకు ఇప్పుడు మాధురి జీవితం నాశనం అయింది’’ అని మండిపడ్డారు.

మాధురి అంతా కోల్పోయింది

‘‘తన అత్తవారు, కన్నవారి దగ్గర దివ్వల మాధురి అంతా కోల్పోయింది. కట్టుకున్న వ్యక్తి కూడా కాదనడంతో ఆత్మహత్యే దారనుకున్న సమయంలో నేను ఆమెకు ఓదార్పు ఇచ్చాను. మా కుటుంబం వల్ల నీకు అన్యాయం జరిగిందని చెప్పి చనిపోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాను. మాధురి పావుగా నన్ను బలిపశువును చేయాలని ఎత్తుగడ వేసిన మహా రాజకీయ నేత దువ్వాడ వాణి. మాధురి నన్ను ట్రాప్ చేసిందంటూ ఆరోపిస్తున్నారు. నేనేమీ చిన్న పిల్లాడిని కాదు. నాకు తెలియనిదేమీ కాదు. అయినా మాధురి నన్ను నా దగ్గర ఏముందని ట్రాప్ చేయాలి. ఆమెకే చాలా ఆస్తులు ఉన్నాయి. నా దగ్గర నయా పైసా లేదు. నేను ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రెండేళ్లుగా నేను తిన్నానా లేదా అని పట్టించుకున్న నాథుడు లేరు. నాకు రెండేళ్లుగా భోజనం పెట్టిన వ్యక్తి మాధురి’’ అని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News