నెల్లూరు జిల్లాలో ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టిన జనం
భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే 08772236007 నంబర్ కు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు.
By : The Federal
Update: 2024-03-15 02:57 GMT
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి)
నెల్లూరు జిల్లాలో ఓం ప్రకంపనలు జనాన్ని ఆందోళనకు గురిచేశాయి. భయాందోళనలతో ఇళ్లలో నుంచి జనం రోడ్లపై పరుగులు తీశారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రాంతాల్లో.. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని కలెక్టర్ లక్ష్మి శ ధ్రువీకరించారు. ఈ తరహా భూప్రకంపనలు ఏర్పడడం ఆ ప్రాంతాల్లో ఇది ఏడోసారి అని చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువుల కింద పడిపోవడంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట లోని పిచ్చిరెడ్డి తోపు, మంగపతినగర్ ప్రాంతాల్లో గురువారం రాత్రి 8.43 గంటల ప్రాంతంలో ఐదు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.9 మ్యాగ్నిట్యూడ్ నమోదైనట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ ధ్రువీకరించారు.
భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి గురికావద్దన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే 08772236007 నంబర్ కు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు.
సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ లోని దొరవారి సత్రంలో కూడా.. రాత్రి 8.45 గంటలకు, దామ నెల్లూరు, సుగ్గుపల్లి, ఉట్చూరు, మంగళంపాడు గ్రామాల్లో రాత్రి 8.43 గం.లకు రెండు నుంచి మూడు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.
ఇళ్లలో అందరూ భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించే సమయంలో... సామాను కిందికి పడిపోయిందని, ఏం జరిగిందో తెలియక జనం రోడ్లపై పరుగు తీసారని నాయుడుపేటకు చెందిన సుధాకర్ నాయుడు తెలిపారు.
భూకంపం తీవ్రతకు కొన్ని ఇళ్లలో గోడలకు భారీ పగుళ్లు వచ్చాయని తెలిసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భూమి కంపించగానే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ టైమ్లో భూమి కంపించడంతో పాటు భారీ శబ్దం కూడా వచ్చిందని అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పలు చోట్ల సిమెంట్ రోడ్లకు బీటలు వచ్చాయని తెలిపారు. తరచూ ఈ ప్రాంతంలో భూ ప్రకంపను రావడానికి కారణం ఏంటి అనేది భూగర్భ శాస్త్రవేత్తలు పరిశీలించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.