తిరుపతి దొంగ ఓట్లు కేసులో మరొక కొత్త మలుపు

ఇప్పటికే ఐఏఎస్ అధికారి గిరీషా సస్పెన్షన్‌కు గురయ్యారు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఆయన్ను నియమించకపోయినా ఆ అవతారం ఎత్తి దొంగవోట్లు జాతర చేశారు.

Update: 2024-02-10 13:45 GMT
చంద్రమౌళీశ్వరరెడ్డి (ఎడమ), ఐఏఎస్ అధికారి గిరీషా




తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో 30వేలకు పైగా ఓటరు గుర్తింపు కార్డులు అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసి, వాటితో దొంగ ఓట్లు వేయించిన ఘటనలో తవ్వేకొద్దీ ఆశ్చర్యకరమైన నిజాలు బయడపడుతున్నాయి.
అసలు ఎన్నికల సంఘం ఎలక్టోరల్‌ రిజిష్ట్రేషన్‌ అధికారిగా నియమించకుండానే అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్‌గా పనిచేసిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి ఈఆర్వోగా బాధ్యతలు నిర్వహించేసి దొంగ ఓట్ల దందాకు తెరతీసినట్లు తేలింది.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయించింది. ఎన్నడూ ఎరుగని ఎన్నికల మోసం బయటపడింది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఓట్ల అక్రమాల ద్వారా అధికార పార్టీ చూపించింది.
జగన్ ప్రభుత్వం, వైకాపా నాయకులు, అధికారులు కుమ్మక్కై సాగించిన అతి పెద్ద కుట్ర ఇది అని విపక్షా పార్టీ విమర్శిస్తుంది . తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్‌గా పనిచేసిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా, తిరుపతి శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ 2021 మార్చి 17న ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఆయన్ను నియమించలేదు. అయినా చంద్రమౌళీశ్వర్ రెడ్డి తనంతట తానే ఈఆర్వోగా బాధ్యతలు నిర్వర్తించేశారు. తన పేరు, ఫోన్‌ నంబర్ను ఈఆర్వో ప్రొఫైల్స్ కనిపించేలా పెట్టుకున్నారు. ఇది అతి పెద్ద ఎన్నికల నేరం. ఈఆర్వో నెట్ నుంచి 35 వేలకు పైగా ఓటరు గుర్తింపుకార్డులు అక్రమంగా డౌన్ లోడ్ చేయటం, వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసే నేరపూరిత కుట్ర అమలుకు ఇక్కడే బీజం పడింది. ఈ వ్యవహారంలో చంద్రమౌళీశ్వర్‌రెడ్డి ప్రమేయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆయన్ను సస్పెండ్ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. ఆయన ప్రస్తుతం మెప్మాలో సహాయ డైరెక్టర్‌గా ఉన్నారు.
చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని తాము ఈఆర్వోగా నియమించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి గిరీషా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇప్పుడు చంద్ర మౌళీశ్వర్రెడ్డి సస్పెండ్ అయ్యారు.
వీరి వెనక ఉన్న అసలు కుట్రదారుల పాత్ర కూడా బయటకు రావాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓటర్ కార్డుల తయారీ కేంద్రంగా మారడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత నవీమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. భారతదేశంలో అపారమైన ప్రతిభ ఉంటే కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాలేరని, అటువంటి వీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి, సమాజంలో గౌరవాన్ని, మీ జీవితాన్ని కలుషితం చేసుకుని పౌర సమాజం "చీ"కొట్టేలా ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేలా ఎందుకు తయారవుతున్నారో ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని 34 వేల EPIC (బోగస్ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్) కార్డులను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు తయారు చేశారని, సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం సాక్షాదారాలతో సహా ఐఏఎస్, నగరపాలక సంస్థ, రెవిన్యూ అధికారులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం దేశ ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.
తిరుపతిలో ఇటీవల జరిగిన పార్లమెంట్, ఎమ్మెల్సీ, నగరపాలక సంస్థ ఎన్నికలతో పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జరిగిన ఓటర్ల జాబితా చేర్పులు, మార్పులలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ సంయుక్తంగా ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేలా చనిపోయిన వారి స్థానంలో బతికున్న వారి ఫోటోలను చేర్చడం అలాగే ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. తిరుపతి, చంద్రగిరి, కాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించి అర్బన్ రూరల్ మండలాలలో సుదీర్ఘకాలంగా తిష్ట వేసి పనిచేసిన రెవెన్యూ అధికారులను సైతం కేంద్ర ఎన్నికల సంఘం "కేంద్ర నిఘా సంస్థ" ల ద్వారా విచారణకు ఆదేశిస్తే వారి అక్రమ ఆస్తులతో పాటు నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.


Tags:    

Similar News