ఈవీఎంల రీవెరిఫికేషన్.. బాలినేని పిటిషన్‌పై విచారణ

ఏపీలో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ఈవీఎంలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు పలుమార్లు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారు.

Update: 2024-08-19 08:07 GMT

ఏపీలో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ఈవీఎంలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు పలుమార్లు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారు. కానీ ఓటమి బాధను తట్టుకోలేకే వారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు కొట్టిపారేశాయి. కానీ ఇప్పటికి కూడా ఈవీఎంల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లకు, మొత్తం ఓట్ల శాతానికి మధ్య తేడా ఉందని వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో ఈవీఎంల పనితీరుపై పలువురు కీలక నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. ఆయనకు 34 వేల 60 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ సందర్బంగా పలు పోలింగ్‌ బూత్‌ల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ వాటిలోని ఈవీఎంలు, వీవీప్యాట్‌ల రీవెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులు కోరారు. ఇందుకోసం రూ.5.66 లక్షలు కూడా చెల్లించారు. దీంతో ఆయన అభ్యర్థనను మన్నించిన కలెక్టర్.. రీవెరిఫికేషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ రీవెరిఫికేషన్‌లో ఈవీఎంల తయారీ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొంటారని వివరించారు. ఈ రీవెరిఫికేషన్ ఈరోజు నుంచే జరుగుతోంది.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఈ మాక్ పోలింగ్ ప్రక్రియ నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. రోజుకు మూడు ఈవీఎంల చొప్పు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులోని మొత్తం 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను అధికారులు పరిశీలిస్తారు. 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంల పరిశీలన, మాక్ పోలింగ్ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఈ మాక్ పోలింగ్ ప్రక్రియపై సీసీ కెమెరాలతో నిఘా ఉంచనున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాలను వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి బాలినేని. దీనిపై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. ఈ విషయంలో ఉన్నతన్యాయస్థానం తీర్పు వచ్చేవరకు టెక్నికట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్‌ను ఈసీ కొనసాగించనుంది.

మాకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదు.. బాలినేని

హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం, రీచెక్ చేయడంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. హైకోర్టులో నాకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. ఈసీని నేను రీ వెరిఫికేషన్ కోరాను. కానీ వాళ్లు కేవలం మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News