డీజీపీపై ఈసీ వేటు..

ఆంధ్రలో బదిలీల పర్వం సాగుతోంది. ఒకరి తర్వాత ఒకరికిగా వరుసగా అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. తాజాగా..

Update: 2024-05-05 13:00 GMT


ఎన్నికల ముందు ఆంధ్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్తోంది. ఎన్నికల విధుల నుంచి అధికారులను తప్పిస్తోంది. ఈసీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వైసీపీకి మైనస్‌ కావొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయనను వెంటనే విధుల నుంచి తప్పించాలని, ఆయన స్థానంలో కొత్త అధికారులను నియమించాలని తెలిపింది. అంతేకాకుండా ఆ స్థానంలో నియమించడానికి డీజీ ర్యాంకు అధికారులు ముగ్గురి పేర్లు పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సూచించింది. రేపు ఉదయం 11 గంటలలోపు కొత్త డీజీపీని నియమించాలని, సదరు అధికారికి సంబంధించిన నియామక పత్రాలను తమకు పంపాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఎవరీ రాజేంద్రనాథ్

1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన 2022లో ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో క్రైం రేట్ భారీగా తగ్గిపోయిందని అనేక కథనాలు కూడా వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక జోన్లలో ఆయన విధులు నిర్వహించారు. డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ అయిన తరువాత ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు.

Tags:    

Similar News