వామ్మో! 57 రోజులకు రూ.2 వేల కోట్లా?

ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌తో అభ్యర్థుల గుండె ఆగినంత పనైంది. ఖర్చు కళ్ళ ముందు రీళ్ళలా తిరుగుతుంటే.. పగలే చుక్కలు కనిపిస్తున్నట్లు ఉంది.;

Update: 2024-03-17 12:21 GMT
Source: Twitter


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)


తిరుపతి: పార్టీల అధినాయకుల చల్లని చూపు కోసం పడికాపులు కాసారు. పోటీకి పరితపించారు. టికెట్ కోసం హైరానా పడ్డారు. అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న నాయకులు, వారి అనుచరులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకొందరు టికెట్ల వేటలో ఉన్నారు.. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ చూడగానే.. సంబరాల్లో మునిగితేలుతున్న అభ్యర్థుల గుండె ఆగినంత పని అయింది. వాయమ్మో..! ఇన్ని రోజులు.. ఇంత ఖర్చు భరించాలా? ఎంత పని చేస్తిరి. అని ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. 2019 ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన మొదటి విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏపీలో అసెంబ్లీ పోలింగ్ ఘట్టం ముగిసింది. ఈసారి మాత్రం ఎన్నికల కమిషన్ వారం రోజులు ఆలస్యంగా 2024 ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం ప్రకటించింది.
ఆ మేరకు ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 13వ తేదీన జరగనున్నాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి... 57 రోజులపాటు సుదీర్ఘ గడువు వచ్చింది. అదే అభ్యర్థులకు తీవ్ర భారమయ్యే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఎన్నికల షేడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు బెంబేలెత్తుతున్నట్లు కనిపిస్తుంది. 2022లో పెరిగిన ధరను దామాషాగా లెక్కలను ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకుంది. ఆ ప్రకారం పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థికి రూ.90 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.40 లక్షల ఖర్చు పరిమితి విధించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గమనిస్తే, అధికార వైఎస్ఆర్‌సీపీ, విపక్ష టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి ఎన్నికలను చావో రేవో అన్న స్థాయిలో భావిస్తున్నాయి. జనరల్ స్థానాలే కాదు. ఇతర సీట్‌లలో కూడా రూ.50-60 కోట్లు ఖర్చు చేసిన సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకు అంటే..

అప్పుడే మేలు...

2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీ విడుదల కాగా పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన జరిగింది. అంటే షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి పోలింగ్ వరకు సుమారు 33 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ హోరాహోరీగా పోట్లాడిన, గెలుపు ఓటములు మినహా, మిగతా వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో ఎవరికి ఎవరూ తీసిపోలేదు.

ఇప్పుడేమో.. సుదీర్ఘ గడువు...

2024 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ నాల్గవ విడతలో పోలింగ్ నిర్వహించనున్నది. అంటే.. దాదాపు 57 రోజుల సుదీర్ఘ గడువు వచ్చింది. ఇదే.. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులకు భారంగా మారినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల చేతి చిలుము వదిలే పరిస్థితి లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

ఆ లెక్క ఒకసారి పరిశీలిద్దాం..

రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్‌సీపీ తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. టీడీపీ కూటమి మాత్రం ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పెండింగ్‌లో ఉంచింది. ఈ విషయం పక్కకు ఉంచితే.. 57 రోజులపాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రచార ఖర్చు, వాహనాల పెట్రోల్, డీజిల్‌కు భారీగానే సమర్పించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

175 నియోజకవర్గాల్లో సెగ్మెంట్కు ఇద్దరు ప్రధాన అభ్యర్థులు పరిగణలోకి తీసుకున్నా.. 350 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల పోరులో ఉంటారు. వారిలో రోజుకు ఒక అభ్యర్థి రెండు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తే.. 59 రోజులకు 1.18 కోట్లు భరించాల్సి వస్తుందేమో! ఆ లెక్కన 350 మంది అభ్యర్థులు ఒక్క రోజుకు 33.71 కోట్లు సమర్పించుకోక తప్పని పరిస్థితి అని అంచనా! 350 మంది అభ్యర్థులకు పోలింగ్ ముందు రోజు వరకు అంటే 57 రోజులకు రూ.1,988. 89 (దాదాపు రెండు వేల కోట్లు) మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పదిందని అందరూ భావిస్తున్నారు. ఇందుకు పరిష్కారం ఒకటే.. అని ఓ ప్రొఫెసర్ అంటున్నారు..
" కేంద్రఎన్నికల కమిషన్‌లోకి టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి మరొకరు రావాల్సిన అవసరం ఉంది. అంత మాత్రాన సరిపోదు. పార్టీలు, నాయకులు, ప్రజలు కూడా మారాలి" అని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ బీవీ మురళీధర్ అభిప్రాయపడ్డారు. "ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు బాగానే ఉంటున్నాయి. వ్యవస్థలో థియరీకి, ప్రాక్టికల్‌కు చాలా తేడా ఉంది. డబ్బు ప్రభావాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పార్టీలు వాటిని పక్కదారి పట్టిస్తున్నాయి. ఓటర్లలో చైతన్యం రావడమే మార్పుకు నాంది’’ అని ప్రొఫెసర్ బీవీ మురళీధర్ అభిప్రాయపడ్డారు.

మోయలేని భారం

ఎన్నికలంటే అభ్యర్థులకు ఆషామాషీ కాదు. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలి. ఇందుకోసం నాయకులను మచ్చిక చేసుకోవాలి, కార్యకర్తలను పోషించాలి. ఇందుకోసం.. నియోజకవర్గమంతా పర్యటించడానికి కార్లు, అందులో పెట్రోల్ లేదా డీజిల్, కార్యకర్తల బైకులకు ఇంధనం నింపాలి. వేసవి కావడంతో నీళ్ల బాటిళ్ల ఖర్చు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్లీ ప్రచారానికి ఇదే తరహా ఖర్చు రాత్రి భోజనం. విందులు వినోదాల ఖర్చు మరో భారం. రోజూ కనీసం రూ.రెండు నుంచి మూడు లక్షల నుంచి సభలు, ఇతరత్రా కార్యక్రమాలను బట్టి ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి. ఇవన్నీ భరించకుంటే వెంట వచ్చే కార్యకర్తలు నాయకులు జారిపోతారని భయం.


ఖర్చు రాయాల్సిందే..

సభలు సమావేశాల నిర్వహణ ఖర్చులు, కార్యకర్తలకు వెచ్చించే ఖర్చులు కూడా లెక్కల్లో చూపించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జెండాలు, ఫ్లెక్సీలు, టీ షర్టులు, టోపీలే కాకుండా వాటర్ పాకెట్, టీ, స్నాక్స్, ప్రచారాల ఖర్చు కూడా చూపించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఏం చేయాలో పాలుపోనీ స్థితిలో అభ్యర్థులు సతమతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

ఎన్నికల నిడివి తగ్గించాలి

" పోలింగ్ ఇన్ని దశల్లో కాకుండా నిడివి తగ్గించాలి. దీనివల్ల అభ్యర్థుల ఖర్చు తగ్గుతుంది. ఎన్నికల ఫలితాలపై విశ్వాసం పెరుగుతుంది" అని రాజకీయ విశ్లేషకుడు తుంగ లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో భద్రతా దళాల మ్యాన్ పవర్ ఎక్కువగానే ఉంది. "నాలుగు ఐదు దశల్లో పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న విషయాన్ని గమనించాలని" లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. "పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎంలను ఓ గదిలో ఉంచి సుమారు 25 రోజులు పాటు కాపలా కాయాలి. ఫలితం త్వరగా ప్రకటించడానికి వీలుగా నిర్ణయాలు జరిగితే... ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గి, ఫలితం పై విశ్వసనీయత, గౌరవం కూడా పెరుగుతుంది’’అని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News