హైబ్రిడ్‌ వర్క్‌ ప్లేస్‌ విధానంలో ఉపాధి అవకాశాలు : సీఎం చంద్రబాబు

ఉద్యోగ, ఉపాధి కల్పనలపై అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

Update: 2024-09-26 12:11 GMT

హైబ్రిడ్‌ వర్క్‌ ప్లేస్‌ విధానంతో అందరికీ ఉపాధి అవకాశాలను కల్పించాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమీక్ష చేశారు. 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని అధికారులకు సూచించారు. నైపుణ్యభివృద్ధి, శిక్షణ శాఖ, ఎంఎస్‌ఎంఇ, ఇండస్ట్రీస్, సెర్ప్‌ శాఖల అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సూచించారు. నైపుణ్యభివృద్ధిని పెంచుకోవడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్‌ విధానంలో ఇంటి వద్దనుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అన్నారు.

విజయవాడలో వరదల్లో మునిగి, సర్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి చూపించాలని కోరారని, ఆ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తలు కలిసి ఈ పనిచేయాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్‌ ప్లాన్‌ తో రావాలని అధికారులకు సూచించారు.
Tags:    

Similar News