క్షమించే ప్రసక్తే లేదు.. తాటతీస్తా: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీనికి బాధ్యులను వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ వ్యాఖ్యానించారు.

Update: 2024-09-20 13:57 GMT

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీనికి బాధ్యులను వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ వ్యాఖ్యానించారు. మద్దిరాలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అన్నీ అక్రమాలేనని, ఆఖరికి దేవుడి ప్రసాదాన్ని కూడా వదిలి పెట్టకుండా కల్తీ చేసి కోట్ల మంది భక్తులను మనోభావాలతో ఆటలాడారంటూ సీరియస్ అయ్యారు. వాళ్లు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, వారిని ఎవరూ క్షమించరని, వారు చేసిన దారుణాలకు గుణపాఠంగానే ప్రజలు ఎన్నికల్లో తమ తీర్పు వెలువరిచారని గుర్తు చేశారు. తప్పు చేసిందే కాకుండా ఎదురు దాడి చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, తప్పు చేసిన వారి తాటతీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అధికారంలోకి వచ్చింది తప్పు చేసే ప్రభుత్వం కాదని, తప్పు చేసిన వారి తిత్తి తీసే ప్రభుత్వమని అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టమని, కోట్ల మంది భక్తుల పరమ పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదం కల్తీ వెనక ఉన్న ఏ ఒక్కరిని వదిలి పెట్టమని మరోసారి స్పష్టం చేశారు.

జగన్ లాంటి సీఎం మళ్ళీ రారు: చంద్రబాబు

‘‘నేను నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంత మంది సీఎంలను చూశాను. కానీ జగన్ లాంటి సీఎంను మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు.. చూడబోను కూడా. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడానికి వెనకాడలేదు ఈ సీఎం. దేవుడికి కల్తీ నెయ్యితో తయారు చేసిన నైవేథ్యం పెట్టారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. ఆఖరికి తిరుమలలో పెట్టే అన్నప్రసాదం నాణ్యతను కూడా చెడగొట్టేశారు. టీటీడీ ప్రసాదాల్లో ఇష్టానుసారం పదార్థాలు వాడారు. ఇది క్షమించరాని నేరం. వదిలి పెట్టే ప్రసక్తే లేదు. తిరుమలలో సంపూర్ణ ప్రక్షాళన చేపట్టాం’’ అని వివరించారు సీఎం చంద్రబాబు.

ఎదురుదాడికి దడిసే రకం కాదు

‘‘సెలవులు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం. నెలకోసారి అధికారులు మీ ఇళ్లకే వచ్చి సమస్యలు తెలుసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. నేనే వెళ్లి పలు ఇళ్ల దగ్గర సమస్యలు తెలుసుకున్నా. ఐదేళ్లుగా జగన్ పాలనలో ఇబ్బంది పడ్డ అనేక కుటుంబాలను ఆదుకుంటాం. గాడి తప్పిన పాలనను మళ్ళీ గాడిలో పెడతాం. ఆ నమ్మకంతోనే మమ్మల్ని గెలిపించారు. అధికారులు తప్పులు చేస్తే వదిలి పెట్టే ప్రసక్తే లేదు. జగన్ శిష్యులు కొందరికి ప్రభుత్వం అంటే లెక్కలేనితనం ఉంది. ఎదురుదాడి చేసిన భయపెట్టేద్దాం.. భయపడతారులే అనుకుంటున్నారు. కానీ ఎదురుదాడి చేస్తే భయపడే రకం కాదు.. ఒక్కొక్కరికి తాటతీస్తా’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

వారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు..

‘‘పాలన ఎలా చేయాలో ఏమీ తెలియని ఏ1, ఏ2 ల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాళ్లు వచ్చి ఇప్పుడు పాలన గురించి మాట్లాడుతున్నారు. పాలన గురించి వీళ్లని అడిగి నేను తెలుసుకోవాలి? తప్పు చేయలేదు. టెండర్ పిలిచానని జగన్ చెప్తున్నారు. రూ.320కే కిలో నెయ్యి ఇస్తామంటూ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా?’’ అని సీఎం ప్రశ్నించారు. కాగా నెయ్యి సరఫరా టెండర్లలో ఎల్1గా ఉన్నసంస్థకే టెండర్ ఇచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.

Tags:    

Similar News