ఇక్కడ ప్రతిచెట్టూ నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తోంది
రాయలసీమ నిరుద్యోగులను ఎస్వీయు క్యాంపస్ వనం ఆదరిస్తోంది. తిరుపతి మంచి మనుషులు అండగా నిలుస్తున్నారు.;
శ్రీవారి పాదాల చెంత ఉన్న శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆవరణ (Sri Venkateswara University: SVU) లోని చెట్లు ఇళ్లయ్యాయి. పై చదవులు పూర్తిచేసిన నిరుద్యోగులెందరినో అక్కున చేర్చుకుంటున్నాయి. పోటీ పరీక్షల యుద్ధానికి సిద్ధమవుతున్న యువకులకు అండగా నిలుస్తున్నాయి. చెట్లే కాదు, క్యాంపస్ లోని సైకిల్ స్టాండులు కూడా మేమూ మీకు తోడంటున్నాయి. సంచుల నిండా కలలు నింపుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎస్వీయు క్యాంపస్ కోసం తిరుపతి వస్తున్న వాళ్లందరికి ఈ చెట్టు , ఈ సైకిల్ స్టాండ్ అండగా నిలిచిన దృశ్యం చూపరులను చలించేలా చేస్తుంది. ఇక్కడ నిరుద్యోగయుకులు పగలు చెట్ల కింద చదువుకుంటారు. సైకిల్ స్టాండ్స్ లో మూటా ముళ్లే దాచుకుంటారు. రాత్రి హాస్టల్ వరండాల్లోనిద్ర. మధ్యలో ఖర్చుల కోసం చిరుద్యోగాలు కూడా. క్యాంపస్ లో ఒక వైపు కనిపించే కొత్త ప్రపంచం.బాధమయ ప్రపంచం.
మార్కెట్ లో ఉద్యోగాలు లేవు. స్టాఫ్ట్ వేర్ రంగంలో కూడా ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయి. ప్రైవేట్ సెక్టర్ లో సోషల్ సైన్సెస్, హ్యమానిటీస్ చదివిన వాళ్లకు ఉద్యగాలు రావు. ఇక మిగిలింది. ఎపుడో పదేళ్లకో, పదిహేనేళ్లకో జరిగే ఎపి పిఎస్ సి (APPSC) పరీక్షలు, బ్యాంకు పరీక్షలే దిక్కు. టీచర్ పోస్టులు, కాన్ స్టేబుల్ ఉద్యోగాలు, గ్రూప్స్ ఎపుడు పడతాయని ఎదరుచూస్తూ రాష్ట్రంలో లక్షలాది వాటి కోసం జరిపే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఎపుడో రాబోయే నోటిఫికేషన్ కోసం ఇప్పటినుంచే నగరాలలో ఉంటూ కోచింగ్ తీసుకునే వాళ్లు కొందరైతే, ఇళ్లదగ్గిరే ప్రిపేర్ అవుతున్నవాళ్లు మరి కొందరు. ఇళ్ల దగ్గిర వసతులు లేని వాళ్లు ఇలా క్యాంపస్ చెట్లకింద స్థిరపడుతున్నారు.
పేదల విద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ విశ్యవిద్యాలయాలలో గొప్ప సామాజిక పరివర్తన జరిగింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న వాళ్లంతా పేదల పిల్లలే. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ పేదల విద్యాలయాలే. ఎస్ సి, ఎస్ టి, బిసి లేదా అల్పాదాయ వర్గాల వారే. పేదరైతుల పిల్లలు, కులవృత్తుల చేసుకునే వారి పిల్లలే వారిలో ఎక్కువ. చదువుతున్నపుడు వీళ్లంతా హాస్టళ్లో ఉంటూ కోర్సు పూర్తి చేస్తారు. చదువు అయిపోయాక ఇలా పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు.వీళ్లవరికి హోటళ్లలో భోజనం చేసి చదువుకునే స్తోమత్తు ఉండదు. ఆర్థాకలితోనే ముందుకు సాగుతూ ఉంటారు. నోటిఫికేషన్ పడుతుందని, పరీక్ష బాగా రాస్తామని, ఏదో ఒక ప్రభుత్వోద్యోగం రాకపోదని ఆశే వీళ్లకి ఇంధనం. అదే ముందుకు నడిపిస్తూ ఉంది. ఇపుడు ఎస్వీయు చెట్లకింద కనపడుతున్న పేద విద్యార్థులంతా నిలువెత్తు భవిష్యత్తు మీద కుటుంబం మొత్తం పెంచుకున్న ఆశల రూపాలు.
తిరుపతి విద్యాకేంద్రం కాబట్టి ఈ వూరికొచ్చి చెట్లకిందనైనా ఉండి చదువుకుంటూ ఉంటే పుసక్తాలు అందుబాటులో ఉంటాయి. యూనివర్శిటీల్లో చదువుతున్న స్నేహితుల అండవుటుంది. సొంత వూరికి దగ్గరగా ఉంటారు. వీరంతా హైదరాబాద్ వెళ్లి గదులు అద్దెకు తీసుకుని, కోచింగ్ కేంద్రాల ఖర్చు భరంచలేని రాయలసీమ పేద పిల్లలు వీరంతా.