‘నిరూపిస్తే ఉరేసుకుని చస్తా’: మాజీ మంత్రి

పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి బాలినేని క్లారిటీ ఇచ్చారు. దమ్ముంటే తనను ఎదర్కోవాలంటూ కూటమి సర్కార్‌కు ఛాలెంజ్ చేశారు.

Update: 2024-07-15 14:31 GMT

‘వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేనలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు. అతి త్వరలోనే ఆయన జనసేన జెండాతో కనిపిస్తారు’ కొన్ని రోజులుగా ఈ ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతోంది. అందులోనూ ఒంగొలులో ఎవరిని కదిలించిన ఈ అంశం గురించే చర్చిస్తున్నారు. బాలినేని.. వైసీపీని వీడరని కొందరు ధీమా వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం రాజకీయాలంటే ఇంతే బాస్.. అధికారం ఉన్నంత వరకే మన వెంట వందల మంది ఉంటారు.. ఒక్కసారి అధికారం పోతే నేతలు కూడా అంతే వెళ్లిపోతారంటూ వేదాంత ధోరణిలో బాలినేని వెళ్లడంలో తప్పులేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే తాజాగా ఈ ప్రచారాలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి తిప్పికొట్టారు. వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అయినా తనకు జనసేనలో చేరాల్సినంత అవసరం కూడా ఏమీ లేదని అన్నారాయన.

జనసేనలో ఎందుకు చేరతా

‘‘రాజకీయాల్లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2024 ఎన్నికలే నా చివరి ఎన్నికలను ఇప్పటికే ప్రకటించాను. కానే ప్రజల పట్ల ఏం తప్పు చేశానో మరి వారు నన్ను కాదని ఇతరులను పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాలు చూసి మనస్థాపానికి లోనయ్యాను. దాని నుంచి బయటపడటానికని హైదరాబాద్ వెళ్లిపోయాను. ఈ సమయంలోనే నేను జనసేనలో చేరనున్నట్లు కొందరు ప్రచారం చేశారు. అదంతా కల్పితం. ఎవరూ ఆ ప్రచారన్ని నమ్మొద్దు. అసలు జనసేనలో చేరాల్సిన అవసరం నాకేంటి. నేను ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. ఎన్నికల్లో నిలబడే వారంటే టికెట్ల కోసం తాపత్రపడుతూ పార్టీలు మారతారు. నా చివరి ఎన్నిక అయినప్పుడు నాకు పార్టీలు మారాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చారు.

దమ్ము ఉంటే నన్ను ఎదుర్కోండి

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒంగోలులో వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. అక్రమ కేసులు కూడా పెడుతున్నారని బాలినేని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే తనను ఎదుర్కోవాలంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ‘‘నేను ఒంగోలును విడిచిపెట్టను. ఇంక్కడే ఉంటా. ఏం చేస్తారో డైరెక్ట్‌గా నాపైనే చేయండి. నా కుమారుడు, నా వియ్యంకుడి వ్యాపారలపై తీవ్ర ఆరోపణలు చేస్తారు. అధికారంలో ఇప్పుడు కూటమే ఉంది. తప్పు జరిగి ఉంటే నిర్మోహమాటంగా చర్యలు తీసుకోండి’’ అని సవాల్ చేశారు.

క్లీన్ చిట్ వచ్చింది

‘‘నేను మంత్రిగా ఉన్నప్పుడు నన్ను హవాలా మంత్రి అంటూ ప్రచారం చేశారు. నేను హవాలా చేసినట్లు నిరూపించాలి. ఒంగోలులో కానీ ఇతరత్రా వ్యవహారాల్లో కానీ నేను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదు. ఒకవేళ నేను ఎప్పుడైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఇక్కడే ఉరేసుకుని చస్తా. కావాలంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్వయంగా విచారణ జరిపించవచ్చు. జగన్‌పై కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో నాపైన కూడా విచారణ జరిపించారు. అప్పుడు నాకు క్లీన్ చిట్ వచ్చింది. అది గుర్తుంచుకుని ఆరోపణలు చేయాలి. లేదంటా వాటిని నిరూపించాలి’’ అని ఛాలెంజ్ చేశారు బాలినేని.

Tags:    

Similar News