అద్బుతంగా పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండర్
రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు పలువురి విద్యావేత్తల ప్రశంసలు అందుకుంటున్నాయి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-07-29 15:36 GMT
ప్రాథమిక విద్యా వ్యవస్థలో మంచి మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే నోట్ పుస్తకాలపై కానీ, బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులపై కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి ముద్రలు ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ఉండకూడవనే నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పాఠశాల విద్యకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను సోమవారం ఉండవల్లిలోని విద్యా శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. గతంలో ఈ క్యాలెండర్ ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి ఫొటోలు ముద్రించే వారు. అలా ఉంటే రాజకీయ నాయకుల ఫొటోలు వేసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని అకడమిక్ క్యాలెండర్లో ఎవరి ఫొటోలు లేకుండా కేవలం విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్టూన్‌లు, బొమ్మలతోనే క్యాలెండర్‌ను రూపొందించారు.
ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయని, అయితే పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులపై పెత్తనం చెలాయించాలనుకోవడం తగ్గితే మంచి వాతావారణం పాఠశాలల్లో ఉంటుందనే అభిప్రాయం చాలా మంది విద్యావేత్తల నుంచి వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే దీపకల్లోను మంత్రి సందేశం, ఫొటోలు, పార్టీ రంగులు లేకుండా మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు. స్కూల్ మేనేజమ్‌ంట్ కమిటీల పదవీ కాలం జూలై నెలతో ముగుస్తుంది. ఆగస్టులో మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని విద్యా శాఖకు ఆదేశాలు అందాయి. పాఠశాలల్లో టాయిట్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం టెండర్లు పిలవాలని మంత్రి లోకేష్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మార్పులకు అవసరమైన చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయులపై అజిమాయిషీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్న భోజనం మంచి నాణ్యతతో పిల్లలకు అందించడం బాధ్యతగా తీసుకుంటే ఆ పథకం సక్సెస్ అవుతుందనడంలో సందేహం లేదు.
కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో కూడా పాఠశాలల్లో రాజకీయ రంగు పులుముకోకుండా ఉంటే ఎంతో మంచి జరుగుతుందనే అభిప్రాయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. చిన్న నాటి నంచే విద్యార్థుల్లో మీ నాన్న ఆ పార్టీ, మా నాన్న ఈ పార్టీ అనే భావన కలుగకుండా ఉండాలంటే ప్రభుత్వం మాత్రమే విద్యార్థులకు కావలసిన వసతులు కలిపిస్తుందని మంత్రులు, రాజకీయ నాయకులు కాదని విద్యార్థుల్లో రావాలి. అప్పుడే విద్యా వ్యవస్థ సుహృద్బావ వాతావరణంలో అడుగులు వేస్తుంది.