బాంబుల గడ్డ.. ప్రశాంత నిలయం.. ఈ మార్పు వెనక మతలబు ఏంటో..!

ఒకనాడు బాంబులు, వేట కొడవళ్ళు స్వైరవిహారం చేసిన కడప జిల్లా. ఈ ఎన్నికల్లో పోలింగ్, ఆ తర్వాత పల్లెలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. సమీక్షలతో నేతలు సామరస్యంగా ఉన్నారు.

Update: 2024-05-27 09:13 GMT

ఫ్యాక్షన్ గొడవలు. ప్రతీకార హత్యలతో రగిలిన రాయలసీమ ప్రధానంగా కడప జిల్లా ప్రశాంతంగా ఉంది. గతంతో పోలిస్తే ఎన్నికల హింసకు తావులేని సామరస్య వాతావరణం నెలకొన్నది. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో గతంలో ఎలా ఉండేదంటే.. ఎన్నికలంటే బాంబుల స్వైరవిహారం. వేటకొడవళ్ళ విన్యాసాలు. దాడులు, ప్రతి దాడులు. బ్యాలెట్ బాక్సుల ధ్వంసం. పల్లెల్లో పోలీస్ పికెట్లు. బిక్కుబిక్కుమంటూ జీవనం. రాయలసీమలో రెండు దశాబ్దాల క్రితం వరకు రాజ్యమేలిన పరిస్థితి ఇది. సినిమాల్లోనూ మరింత మితిమీరిన దృశ్యాలతో రాయలసీమ ప్రాంత వాసులను అత్యంత దుర్మార్గులుగా చిత్రీకరించారు.

తరం మారింది. వ్యవసాయంపై దృష్టి సారించారు. పిల్లలను బాగా చదివించారు. వారందరూ ఉపాధి అవకాశాలపై దృష్టి కేంద్రీకరించారు. ఇవన్నీ వెరసి ముఠా నేతల వెంట నడిచే వారు కుటుంబాలపై శ్రద్ధ పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాయకులూ కూడా తమ పద్ధతులు మార్చుకున్నారు. దీనికి తోడు రాజకీయాల్లో కొత్తతరం రావడంతో పాతతరం వర్గకక్షలకు పాతర వేసిందని చెప్పడంలో సందేహం లేదు.

అందుకు నిదర్శనం..

2024 సార్వత్రిక ఎన్నికలే కాదు. అంతకు ముందు 2019, 2014 ఎన్నికలను పరిశీలిస్తే, హింసాత్మక సంఘటనలు లేవని చెప్పవచ్చు. గతంలో.. సాధారణ రోజుల్లో ముఠా నాయకులుగా చలామణి అయిన వారు వ్యక్తిగత భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకునేవారు. ఒక మార్గంలో వెళ్తామని లీక్ ఇచ్చి, మరో మార్గంలో పయనించేవారు. తరచూ జరిగే వర్గ పోరాటంలో అనుచరులు బలయ్యేవారు. ఎన్నికల వేళ ఆ హింస ఎక్కువగా ఉండేది. ఆ తరహా పరిస్థితి కడప జిల్లాలో ఎక్కువగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, కడప నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు వర్గ పోరాటాలతో సతమతమయ్యేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన ప్రశాంత వాతావరణం నెలకొంది.

పులివెందులలో.. విచిత్ర పరిస్థితి

కడప జిల్లా అంటే రాష్ట్రమే కాదు. జాతీయంగా కూడా రాజకీయంగా గుర్తింపు పొందింది. సీఎం వైఎస్. జగన్ మోహనరెడ్డి స్వప్రాంతం. ఆయన చెల్లెలు కడప ఎంపీ స్థానం నుంచి స్వయాన బాబాయ్ కుమారుడు, సిట్టింగ్ ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డిపై పోటీ చేశారు. ఈ కారణం రీత్యా అందరి దృష్టి కడప ఎంపీ స్థానంపై నిలిచింది. రాజకీయంగా చేసుకున్న ఆరోపణలు హద్దులు మీరాయి. అంతకు మినహాయించి ఎక్కడా ఘర్షణలకు ఆస్కారం ఇవ్వలేదు. ఈ ఎంపీ స్థానం పరిధిలో.. పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, బద్వేలు, కమలాపురం, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి నాయకుడిగా, శాసనమండలి వైస్ చైర్మన్‌గా పనిచేసిన వేంపల్లికి చెందిన సతీష్ రెడ్డి.. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సిపిలో చేరారు. సింహాద్రిపురం మండలానికి చెందిన బీటెక్ రవి టిడిపి అభ్యర్థిగా పోరాటం సాగించారు. మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి తర్వాత డాక్టర్ వైయస్సార్ కుటుంబంలో చీలికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

ఎక్కడ కూడా గతంలో మాదిరి సైక్లింగ్ పద్ధతిలో ఓటింగ్ జరగలేదు. అందుకు పిసిసి అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైయస్. షర్మిలరెడ్డికి, టిడిపి అభ్యర్థి బీటెక్ రవి, ఆ పార్టీ వర్గాలు పరోక్షంగా సహకారం అందించాయి. దీనికి తోడు వైఎస్. వివేక హత్య కేసులో అప్రూవర్‌గా మారిన ఎస్.కె దస్తగిరి పోటీలో ఉండడం, సైక్లింగ్, దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా తిరగడం వంటి కారణాలతో పాటు పోలీసులు కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే.. బీటెక్ రవి ఒక విచిత్రమైన సంఘటన బయటపెట్టారు. ‘‘మధ్యాహ్నం వరకు పోలింగ్ సాఫీగా నడిచింది. మధ్యాహ్నం తర్వాత దాదాపు 30 నుంచి 50 కేంద్రాల్లో 300 నుంచి 500 ఓట్లు మిగిలి ఉన్నాయి. ఎమ్మెల్యేగా నాకు (బీటెక్ రవి) ఎంపీ అభ్యర్థి వైఎస్. అవినాష్ రెడ్డికి చెరి సగం చేసుకుందామని ఆఫర్ వచ్చింది. అందుకు ఎమ్మెల్యే ఓట్లు నాకు.. ఎంపీ ఓట్లు వైయస్ షర్మిలకు వేయమని సూచించా" అని బీటెక్ రవి వెల్లడించారు. ‘‘అందుకు అధికార పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ ఎన్నికల్లో ఎవరి వార్డు వారిని వేసుకొని ఇద్దాం" అని సూచించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. పులివెందులలో సీఎం వైఎస్. జగన్ పరిస్థితి అంతవరకు తీసుకొచ్చానని ఆయన, తాను సాగించిన ఆధిపత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారు.

కానీ, సీఎం వైయస్ జగన్ మెజారిటీ తగ్గవచ్చు. పులివెందులలో భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ ప్రభావం కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డిపై ఎక్కువ చూపించే అవకాశాలు లేకపోలేదని ఇక్కడి ఎన్నికల సరళిని మొదటి నుంచి సూక్ష్మంగా పరిశీలిస్తున్న వ్యక్తులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి.. జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, కడప నియోజకవర్గాల్లో కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

" గతానికి భిన్నంగా పోలింగ్ జరిగింది. సైక్లింగ్ ఆస్కారం లేకుండా పోయింది" అని సీనియర్ జర్నలిస్ట్ రామసుబ్బారెడ్డి.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. "పులివెందులలో సీఎం వైఎస్. జగన్ మెజారిటీ తగ్గడంతో పాటు, కడప ఎంపీ స్థానంలో వైఎస్. షర్మిల అధికార పార్టీ అంచనాలను తలకిందులు చేస్తారు అందులో సందేహం లేదు" అని కూడా విశ్లేషిస్తున్న రామసుబ్బారెడ్డి.. కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఓడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని విశ్లేషించారు.

అంతా ప్రశాంతం

ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానంలో 82 ఏళ్ల వయసులోనూ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన నంద్యాల వరదరాజులరెడ్డికి సిటీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాదరెడ్డి మధ్య పోటీ జరిగింది. ఎవరి పరిధిలో వారు ఓట్లు సంపాదించడంలో చూపిన ప్రత్యేక శ్రద్ధ ఘర్షణలకు ఆస్కారం ఇవ్వకపోవడం గమనించదగిన విషయం. మైదుకూరులో కూడా కురువృద్ధ నాయకుడైన వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డితో టిడిపి అభ్యర్థిగా పుట్టా సుధాకరయాదవ్ రెండోసారి పోటీ పడ్డారు.

ఈయనకు సీనియర్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అండగా నిలిచారు. మైదుకూరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఫ్యాక్షన్‌కు పెట్టింది పేరు. అక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా అంతే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ‘‘ఇక్కడ కార్యకర్తలను, నాయకులను పట్టించుకోరు. ఇసుక అక్రమ రవాణా ఎక్కువైంది" అనే ఆరోపణలను వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం అనుకూలంగా ఉందని టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్. షర్మిలకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయించడంలో ప్రతిపక్ష కూటమి నాయకులు, వారి విధేయులు తోడ్పాటు అందించారని చెబుతున్నారు.

ప్రశాంతంగా బాంబుల గడ్డ

ఈనెల 13వ తేదీ జరిగిన పోలింగ్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితిని పోలీసులు సమయస్ఫూర్తితో నివారించారు. ఈ సెగ్మెంట్లో మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డిది దేవగుడి గ్రామం. ఈయన కుటుంబంతో ఫ్యాక్షన్ సాగించిన మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి కుటుంబానిది గోనుగుండ్ల గ్రామం. కాగా, బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సి. ఆదినారాయణ రెడ్డి ఫ్యాక్షన్ పోరాటంలో అనేకమంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. అనుచరుల్లో పదుల సంఖ్యలో వైకల్యం పొందిన వ్యక్తులు ఉండేవారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి వైయస్సార్సీపీలో చేరిపోయారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు కూడా తగ్గాయి. ఎవరి పనుల్లో వారు, ఎవరి రాజకీయాలకు వారు పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో.. ఈనెల 13వ తేదీ జరిగిన పోలింగ్ సందర్భంగా..

ముద్దనూరు మండలం జమ్మలమడుగు- కమలాపురం మధ్య ఉంటుంది. అక్కడికి... జమ్మలమడుగు నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సి. ఆదినారాయణ రెడ్డి తన అనుచరులతో ముద్దనూరు బయలుదేరారు. వైయస్సార్సీపి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మోలే సుధీర్ రెడ్డి కూడా కమలాపురం నుంచి ముద్దనూరుకు బయలుదేరారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం వారిద్దరిని వారి స్వప్రాంతంలోనే హౌస్ అరెస్ట్‌లో ఉంచారు. ఈ చర్య ద్వారా ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఎన్నికల ఘర్షణలు చెలరేగకుండా అత్యంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నారని చెప్పడంలో సందేహం లేదు.

కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో సీఎం వైఎస్. జగన్ మేనమామ, వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డిపై పుత్తా నరసింహారెడ్డి కుమారుడు కృష్ణచైతన్యరెడ్డి పోటీ చేశారు. టిక్కెట్టు దక్కలేదని కినుక వహించిన మాజీ ఎమ్మెల్యే జి. వీరశివారెడ్డి అధికార పార్టీ వైపు వెళ్లిపోయారు. ఆయన సొంత ఊరు కోగటంలో స్వల్ప ఘర్షణ జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అణచివేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో కమలాపురం నియోజకవర్గంలో వర్గ పోరుకు ఆస్కారం లేని రీతిలో చర్యలు తీసుకున్నారు. ఇక్కడ టిడిపి అభ్యర్థికి సానుకూలంగా పోలింగ్ జరగడంతో పాటు దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్‌ను అభిమానించే వారిలో విజయ అవకాశాలను శాసించే స్థాయిలో ఉన్న 70 వేల మంది ముస్లిం మైనార్టీ ఓట్లలో అధికంగా, కడప ఎంపీ అభ్యర్థి వైయస్ షర్మిలకు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు బలంగా చెబుతున్నారు.

కడప కోనసీమలో..

కడప జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గం మినీ కోనసీమగా భావిస్తారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ పంటలతో పాటు, పండ్ల తోటలకు ప్రసిద్ధి. చల్లదనం, దారి వెంట, పల్లెల్లో కనిపించే పచ్చదనంతో కూడిన మామిడి, బొప్పాయి తోటలు ఎక్కువ. రైల్వేకోడూరు నియోజకవర్గంలో మొదటిసారి టిడిపి స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థిగా అరవ శ్రీధర్, సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులుపై పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది.

పుల్లంపేట మండలంలో పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల లోపల ఘర్షణలు జరిగాయి. అధికార పార్టీ మాజీ ఎంపీపీ బాబుల్ రెడ్డి, ఆయన అల్లుడు స్మగ్లింగ్ డాన్‌గా పేరుపొందిన గంగిరెడ్డి అనుచరులు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ పరిస్థితుల్లో కొందరు ఈవీఎంలను ధ్వంసం చేశారు. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్ ప్రశాంతంగా సాగించారు. ఇక రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో టిడిపి అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యంపై మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పోటీ చేశారు.

అధికార పార్టీ అభ్యర్థికి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి సహకారం ఇవ్వకపోవడం, ఎన్నికలకు ముందే మండలాల సీనియర్ నాయకులు టిడిపిలో చేరిపోయారు. మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు, రాజ్యసభ సభ్యుడు నందలూరు మండలంతో పాటు మిగతా ప్రాంతాల్లో అన్ని తానే ఈ వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఈ మండలంలో టిడిపి బలంగా ఉంటుంది. బలిజ - ఉప కులాలు, కమ్మ, క్షత్రియులు మిగతా వర్గాలు అందించిన సహకారం పైనే టిడిపి అభ్యర్థి వివిధ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు.

కడప అసెంబ్లీ స్థానంలో కూడా డిప్యూటీ సీఎం అంజాద్ భాషాపై ఉన్న వ్యతిరేకత, కుటుంబ సభ్యుల తీరు పెద్దగా దెబ్బతీసిందని, ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిక్. ఆఫ్జల్ అలీ మైనార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉందని, ఇది కాస్త టిడిపి అభ్యర్థి ఆర్ మాధవీ రెడ్డికి అనుకూలమవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో కూడా కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైయస్ షర్మిల రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు బలంగా చెబుతున్నారు. ఒక చిన్న ఘర్షణ మినహ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం గమనార్హం.

రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి టిడిపి నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి వల్ల కాస్త మేలు జరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న మండిపల్లి రాంప్రసాదరెడ్డికి బలిజ, ఇతర బీసీ కులాల ఓట్లతోపాటు ముస్లింలలో ఓ వర్గం సహకారం అందించిందని, వారిద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉందని విశ్లేషిస్తున్నారు. ఇంకో వారం రోజుల్లో జరగనున్న ఓట్ల లెక్కింపులో వీరందరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది తేలనుంది.

Tags:    

Similar News