నకిలీ ఐఏఎస్ దొరికింది
విశాఖలో ఐఏఎస్ అధికారినంటూ హైల్‌చల్‌చేసిన అమృత భాగ్య రేఖను ప్రకాశం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు.;
By : The Federal
Update: 2025-01-24 15:46 GMT
మోసాలు చేసేందుకు ఏకంగా ఐఏఎస్ అధికారుల అవతారమెత్తుతున్నారు. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా హల్ చల్ చేస్తున్నారు. అమాయకులను నమ్మించి చీటింగ్‌లకు తెగబడుతున్నారు. బండారం బయటపడటంతో చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. అందులో మహిళలు కూడా ఉంటున్నారు. విశాఖలో నకిలీ ఐఏఎస్ అధికారి అవతారమెత్తిన లేడీనే దీనికి ఉదాహరణ. ఈమెపై విశాఖలోని పలు పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
అమృత భాగ్య రేఖ అనే యువతి నకిలీ ఐఏఎస్ అవతారమెత్తింది. ట్రైనీ కలెక్టర్‌ని అంటూ విశాఖలో హడావుడి చేసింది. తన మాటకారి తనంతో పలువురికి టోకరా వేసింది. ఆమె చేత మోసపోయిన బాధితులు విశాఖపట్నం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా పలు పోలీసు స్టేషన్‌లలో కూడా ఫిర్యాదులు చేశారు. ఇది కాస్త విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు తెలిసింది. ఆమె ఒరిజినలో.. డూప్లికేటో అని నిగ్గు తేల్చేందుకు పోలీసులను రంగంలోకి దింపారు. చివరకు ఆమె అసలు కాదు నకిలీ అని నిగ్గు తేల్చారు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ శంక బ్రత బాగ్జీ. ఆమెను పట్టుకునేందుకు డీసీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు గాలింపులు చేపట్టాయి.
అయితే తన కోసం పోలీసులు గాలిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆ నకిలీ మహిళా ఐఏఎస్ చిన్నగా అక్కడ నుంచి జారుకుంది. విశాఖ నుంచి విజయనగరం పారి పోయింది. అయినా ఆమె గురించి గాలింపులు ఆప లేదు. శుక్రవారం కూడా కొనసాగించారు. చివరికి ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ నకిలీ ఐఏఎస్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు ఇదే అవతారమెత్తిన ఆమె భర్త కూడా ఇది వరకే అరెస్టు కాగా ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.