రాజకీయాల్లోనూ... సకుటుంబ సపరివారంగా...

భార్య..తమ్ముడు.. మేనల్లుడు.. సకుటుంబ సపరివారంగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆ జిల్లానే శాసిస్తున్నారు.. ఎక్కడుంది ఆ రాజకీయ కుటుంబం...?

Update: 2024-03-17 10:56 GMT
బోత్సా కుటుంబం


(తంగేటి నానాజీ)


విశాఖపట్నం: ఆ మంత్రి రాజకీయమే వేరు.. తాను మంత్రిగా రాణించడమే కాదు.. తన వాళ్లను కూడా ప్రజాప్రతినిధులను చేయడం ఆయన గొప్పతనం. నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితుడైన ప్రస్తుత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనతో పాటు కుటుంబ సభ్యులనూ ప్రజాప్రతినిధులను చేశారు. దీంతో విజయనగరం జిల్లాలో తిరుగులేని రాజకీయ కుటుంబంగా బొత్స కుటుంబం పేరు పడింది.

వారసత్వం కాదు ఇది... ఫ్యామిలీ ప్యాక్...

రాజకీయాల్లో వారసులు కొత్త కాదు... ఎంతో మందిని మనం చూశాం.. చూస్తున్నాం.. కానీ మనం ప్రస్తుతం చూడబోయేది ఫ్యామిలీ ప్యాక్ రాజకీయం. తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని పోలినట్లే ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ కుటుంబం ఉంది. తాను మంత్రిగా కొనసాగుతుండగా తన భార్య బొత్స ఝాన్సీని రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయించి జడ్పీటీసీ చైర్ పర్సన్‌గా... ఎంపీగా గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఆమెను వైసీపీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించుతున్నారు. ఇక ఆయన తమ్ముడు బొత్స అప్పలనర్సయ్య గతంలో ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం గజపతి నగరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేయనున్నారు. మేనల్లుడు చిన్న శీను ప్రజా ప్రతినిధి కాకపోయినా పార్టీ పదవుల్లో కొనసాగుతూ తెరవెనక రాజకీయాలు నడుపుతున్నారు. ఇక బొత్సకి బంధువైన మరో తమ్ముడు బడుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు.

సకుటుంబ సపరివారంగా...

పెళ్లిళ్లు.. ఫంక్షన్లకు ఆహ్వానించినప్పుడు సకుటుంబ సపరివారంగా పిలుస్తాం... ప్రస్తుత రాజకీయాల్లో పిలవకపోయినా సకుటుంబ సపరివారంగా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ కుటుంబాలకు ఆదరణ కూడా లభిస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం విజయనగరం విశాఖ జిల్లాలో తమ రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకుంటుండగా... శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ కుటుంబ రాజకీయం చేస్తూ ఇద్దరూ మంత్రులయ్యారు. ప్రస్తుతం వైసీపీ నుంచి శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తుండగా... ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ నరసన్నపేట నుంచి పోటీ చేస్తున్నారు.


Tags:    

Similar News