దావోస్‌కు తండ్రీ కొడుకులు..పెట్టుబడులు తెస్తారా

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నాలుగు రోజుల పాటు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం–2025 జరగనుంది.;

Update: 2025-01-01 15:18 GMT

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌లు దావోస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం–2025 సదస్సును జనవరిలో నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సులు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూటమి ప్రభుత్వ ప్రతినిధులుగా సీఎం చంద్రబాబు, మానవ వనరలు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ హాజరు కానున్నారు. వీరితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఆ శాఖ అధికారులు, ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు అధికారులతో కూడిన బృందం దావోస్‌ సదస్సులకు హాజరు కానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి దావోస్‌ సదస్సులకు ఏపీ ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలకు కూడా కూటమి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వీరు దావోస్‌ సదస్సుల్లో పాల్గొననున్నారు. జనవరి 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సులు జరగనున్నాయి. ‘షేపింగ్‌ ది ఇంటెలిజెంట్‌ ఏజ్‌’ అనే థీమ్‌తో దావోస్‌లో ఏపీ బృందం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వనరులు, పెట్టుబడులకు అవకాశాలు, పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి, స్మార్ట్‌ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు వంటి పలు అంశాలపైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుల వేదికలపైన వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏమేరకు పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకొస్తారు..ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకొని పోయిన ఆంధ్రప్రదేశ్ కు ఈ పర్యటన ఖర్చుకూడా మరో అప్పు భారంగా మారనుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News