వైసీపీలో నలుగురు.. టీడీపీలో ముగ్గురు
మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంలో వైఎస్‌ఆర్‌సీపీ కంటే టీడీపీ వెనుకబడింది.
తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంలో ఒక అడుగు వెనక్కి వేశారు. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కంటే తక్కువ సంఖ్యలో మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నలుగురికి మంత్రి వర్గంలో మంత్రులుగా అవకాశం కల్పిస్తే.. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం కేవలం ముగ్గురు మహిళలకు మాత్రమే మంత్రి వర్గంలో చోటు కల్పించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఒక మెట్టు పైన నిలచింది. అంతేకాకుండా మహిళలను ఏకంగా ఉప ముఖ్యమంత్రులుగాను, హోమ్ మంత్రులుగాను సమున్నత స్థానం కల్పించడంలోను చంద్రబాబు కంటే జగన్ ప్రభుత్వం పై చేయి అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహిళకు హోమ్ మంత్రిని చేసి అప్పటి వరకు పురుషులను మాత్రమే హోమ్ మంత్రులుగా కొనసాగుతున్న రికార్డును డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రేక్ చేశారు. ఇదే విధానం జగన్‌మోహన్‌రెడ్డి కూడా అనుసరించారు. రెండు పర్యాయాలు చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో మహిళలకే హోమ్ శాఖను కట్టబెట్టారు. తొలుత మేకతోటి సుచరితను హోమ్ మంత్రి చేసిన జగన్ తర్వాత తానేటి వనితను ఆ స్థానంలో కూర్చో పెట్టారు.