ఉచిత బస్సు ప్రయాణం మాటలకే పరిమితమా..!

ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు సహా కూటమి పార్టీల నేతలంతా ఊదరగొట్టారు.

Update: 2024-08-03 11:15 GMT

ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు సహా కూటమి పార్టీల నేతలంతా ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పదిరోజులకు ఒకసారి ఉచిత బస్సు పథకం తప్పకుండా అమలు చేస్తామని మాటలు చెప్తున్నారే తప్ప దీనికి సంబంధించి అధికారిక ప్రకటనంటూ ఏమీ రాలేదు. దీంతో అసలు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది అర్థంకాకుండా పోయింది. ఈ విషయంలో ఉచిత ప్రయాణం అంటూ మహిళలను మభ్యపెట్టే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, నెరవేర్చలేని హామీలను ఎందుకు ఇచ్చారని ప్రజలు నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ పథకం విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

పథకం మాటలకే పరిమితమా..

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది మాటలకే పరిమితం అవుతుందని కూడా ప్రచారం జోరుగానే సాగుతోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ కూడా ఈ పథకం అమలు చేస్తామంటున్నారే తప్ప ఎప్పటి నుంచి అనేది మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని పలువురు నిపుణులు అంటున్నారు. ఇదే క్రమంలోనే ఇలానే సాగదీసి సాగదీసి ప్రజలు తమకే విసుగొచ్చి ఈ పథకాన్ని మర్చిపోయేలా చేయడమే కూటమి ప్లాన్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే మంత్రి రామ్‌ప్రసాద్ ఈ పథకం విషయంలో ఎప్పుడు అడిగినా ఒకే మాట చెప్తున్నారని, ఎటువంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని కూడా విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఈ పథకాన్ని ఆగస్టు 15నుంచి ప్రారంభిస్తామంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతకు మించి ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేదు. అంతకుముందు నుంచీ కూడా రవాణా మంత్రి రాంప్రసాద్‌ ఒకే మాట చెప్తున్నారు. ‘‘ఉచిత బస్సు పథకాన్ని తప్పకుండా అమలు చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలైన విధానాన్ని పరిశీలిస్తున్నాం. రాష్ట్రంలోని బస్సుల గురించి అధికారులను ఆరా తీస్తున్నాం. ఇప్పుడున్న బస్సుల సంఖ్యతో ఈ పథకం అమలు చేయొచ్చా.. చేస్తే లాభమా నష్టమా వంటి అంశాలను కూడా చర్చిస్తున్నాం. చర్చలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తాం’’ అన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. చిత్తూరులో మూడు ఆర్టీసీ డిపోలకు సంబంధించిన 17కొత్త బస్సులను ప్రారంభించిన సందర్భంగా కూడా మంత్రి ఈ వ్యాఖ్యలే చేయడం కాస్తంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బస్సులు కొన్న వేళావిశేషంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు గురించి శుభవార్త చెప్తారని ఆశిస్తూ.. ఉసూరుమనిపించారని కొందరు మహిళలు నిరాశ వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వీరు ఇలానే మాట్లాడుతున్నారని అన్నారు. కర్ణాటకలో 2023 మే నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జూన్ 11న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసింది. అదే విధంగా తెలంగాణలో డిసెంబర్ 2023లో అధికారం చేపట్టగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి వారంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల తర్వాత కూడా ఈ పథకం అమలు విషయంలో పురోగతి శూన్యంగానే ఉందని, ప్రభుత్వం తీరు చూస్తుంటే పథకాన్ని అటకెక్కించే యోచనలో ఉన్నట్లు అనిపిస్తోందని పలువురు మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News