ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు..

రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పూరించారు. 23 నుంచి రాష్ట్రమంతా చుట్టి రానున్నారు.;

Byline :  The Federal
Update: 2024-01-22 05:19 GMT
YS Sharmila

కాంగ్రెస్ అధ్యక్షురాలురాలు వైఎస్ షర్మిల కొరఢా ఝుళిపించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ప్రత్యర్థి పార్టీలను జాడించి వదిలిపెట్టారు. నేను ఎవ్వరూ వదిలిన బాణాన్ని కాదు, పొత్తులు లేకున్నా బీజేపీకి మూడు పార్టీలు తొత్తులేనని స్వరం పెంచారు. ఆమె స్వర ధాటికి వైఎస్సార్సీపీ వాళ్లు ముందుగా స్పందించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన తెలిపే సమయంలో కాస్త తడబడినట్లు కనిపించింది. ఏమి సమాధానం చెప్పాలో వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కూడా వైఎస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం గురించి మాట్లాడారు. ప్రజల్లో పెద్దగా ఈ సమాధానాలు ప్రభావం చూపే పరిస్థితులు లేవు. రాష్ట్రమంతా వైఎస్ షర్మిల చేసిన ప్రసంగాన్ని ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.

ఈనెల 23 నుంచి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆమె ఏపీసీసీ కార్యక్రమాలను విడుదల చేశారు. ఇచ్చాపురంలో పర్యటన మొదలవుతుంది. 23న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనరం జిల్లాల్లో పర్యటిస్తారు. 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తారు. 25న కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు, 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, 30న శ్రీ సత్యసాయి అనంతపురం, కర్నూలు, 31న నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటన ఉంటుంది.

జిల్లాల పర్యటనల్లో పార్టీలోకి కొత్తవారిని చేర్చుకునే కార్యక్రమం ఉంటుంది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో వుంటున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించారు. ఈనెల 24 నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల బయోడేటాలు తీసుకుంటారు. రోజుకు మూడు జిల్లాల్లో పర్యటనల సందర్భంగా పార్టీలో చేరికలు ఉంటాయని, పూర్వపు కాంగ్రెస్ వారంతా తిరిగి పార్టీలోకి రావాలని ఏపీసీసీ పిలుపునిచ్చింది.

రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఒక నియంతను గద్దె దింపేందుకు పోరాటం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఎవరికి ఎక్కువ భయం వుంటే వారే నన్ను విమర్శిస్తారని చెప్పడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. మహిళకదా అని తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణలో ఏమి జరిగిందో చూశారు. ఇక్కడా అదే జరుగుతుంది. నియంత కేసీ ఆర్ గద్దెదిగారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అంటూ షర్మిల మాట్లాడుతుంటే ఒకింత అక్కడికి వచ్చిన వారు ఆశ్చర్యపడ్డారు.

Tags:    

Similar News