టీటీడీ వివాదాల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు.. అన్నింటా స్వామే!
సుబ్రమణ్య స్వామీ.. ఎంతటి మేధావో అంతటి వివాదాస్పదుడు. ఆయనకు ఎందుకో ఏపీ అంటే 'విపరీతమైన' అభిమానం.. ప్రత్యేకించి టీటీడీ వివాదం వస్తే చాలు ఆయన తెరపైకి రావాల్సిందే.;
By : The Federal
Update: 2025-04-19 12:10 GMT
సుబ్రమణ్యం స్వామి.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలపై కేసులు వేయడంలో దిట్ట. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంటే భలే మోజు. చంద్రబాబు అంటే ప్రత్యేకమైన వైరమేమీ లేదు గాని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చినన్ని ప్రశంసలు ఇవ్వడు.
ఈ స్వామి మామూలుగా అవినీతి, మతపరమైన అంశాలు, లేదా హిందుత్వ విషయాలపై చట్టపరమైన పోరాటాలకు దిగుతాడు. ఇబ్బందులు పెడతాడు. 2జి స్పెక్ట్రం కుంభకోణం, రామ జన్మభూమి కేసు, కేరళలోని శబరిమల బోర్డు నియంత్రణ, నేషనల్ హెరాల్డ్ వంటి అంశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పుడెప్పుడో జయలలిత పై కేసు వేసి ఆమె పదవి పోయే వరకు పోరాడాడు.
హిందూ మత సంస్థల పరిరక్షణలో న్యాయపరమైన చర్యల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యం స్వామికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం ఉంది. ఈ బంధం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చుట్టూ తిరుగుతుంది. టీటీడీ వ్యవస్థాపన, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై నిత్యం చురుగ్గా స్పందించే స్వామి, రాష్ట్ర రాజకీయాల్లో కూడా తలదూర్చకపోలేదు. పరువు నష్టం దావా నుంచి గోశాల ఘటనల వరకు, తిరుపతి మున్సిపల్ వ్యవహారాల నుంచి టీడీపీ నాయకత్వంపై పరోక్ష విమర్శల వరకు స్వామి ప్రధాన న్యాయపోరాటాలు చేశారు.
2021: పరువు నష్టం దావా...
టీటీడీ పరిరక్షణ పేరుతో సుబ్రమణ్యం స్వామి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికపై ₹100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. భారతీయ శిక్షాస్మృతి చట్టంలోని సెక్షన్ 153, 295 కింద ఆయన ఈ కేసు పెట్టారు. ఆ దినపత్రికలో వచ్చిన కథనాలు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే ప్రచురితమయ్యాయని ఆయన ఆరోపించారు. ఇది నాయుడిపై నేరుగా దావా కాకపోయినా, రాజకీయ ప్రమేయాన్ని స్పష్టంగా సూచించే కేసు ఇది.
2023: టీటీడీ శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు
టీటీడీ శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై సుబ్రమణ్యం స్వామి ఆరోపించారు. మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవహరించారని, అందుకే వారిని టార్గెట్ చేసినట్టు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై కేసు వేస్తానని హెచ్చరించారు తప్ప కేసు ఫైల్ చేయలేదు.
2024: కల్తీ నెయ్యి కేసు...
2024 సెప్టెంబర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించిందని ఆరోపించారు. ఇది సంచలనంగా మారింది. దీనిపై స్వామి స్పందిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు సామాజిక సామరస్యాన్ని భంగపరిచేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహరంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. సుప్రీం తీర్పు పై స్వామి పిటిషన్ ప్రభావం ఉన్నట్టు స్పష్టమవుతుంది.
2024-25: తిరుపతి మున్సిపల్ ఎన్నికలపై PIL...
2025 ఫిబ్రవరిలో సుబ్రమణ్య స్వామి, తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో PIL దాఖలు చేశారు. ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని, వీడియో ఆధారాలతో సహా అనేక పత్రాలను సమర్పించారు. ఈ కేసును టీటీడీ పరిరక్షణలో భాగంగా కూడా చూడవచ్చు. తిరుపతి ప్రాంతంలోని అధికార పాలనలో తతంగాలను ప్రశ్నించాలన్న ఆయన దృక్పథానికి సంకేతంగా ఉంది.
2025: గోశాల వివాదం— మరో పరిరక్షణ ప్రయత్నం?
ఏప్రిల్ 2025లో తిరుమల గోశాలలో ఆవుల మృతి ఘటన నేపథ్యంలో, సుబ్రమణ్యం స్వామి న్యాయపరంగా స్పందించాలని సంకల్పించారు. మతపరమైన నిబద్ధతతో కూడిన ఈ చర్య కూడా అధికార పార్టీ పాలనను ప్రశ్నించే ప్రయత్నమే. అయితే ఈ కేసు ఇప్పటిదాకా ఫైలవ్వలేదు.
టీడీపీపై నేరుగా? లేక పరోక్షంగా?
స్వామి వేస్తున్న కేసులు తెలుగుదేశం (టీడీపీ)తో ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ఆ పార్టీని ఇరుకున పెట్టేవే. ఆయన ఆరోపణలు, వ్యాఖ్యలు, కేసులన్నీ చంద్రబాబును, టీడీపీ విధానాలను టార్గెట్ చేసేలా ఉంటాయన్న భావన కనిపిస్తుంది.
2021 పరువు నష్టం దావా: నాయుడు సూచనలతో ప్రచారం జరిపారన్న ఆరోపణ.
2024 నెయ్యి కల్తీ పిటిషన్: నాయుడి వ్యాఖ్యల ఆధారాల భద్రతను ప్రశ్నించడం.
2023 విమర్శలు: నాయుడు, పవన్ కళ్యాణ్‌లు శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలు.
ఈ మూడు సందర్భాల్లోనూ నేరుగా నాయుడిపై లేదా టీడీపీపై కేసులు నమోదు కాలేదన్నది ఒకవైపు ఉండగా, రాజకీయంగా పరోక్ష విమర్శలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి.
సుబ్రమణ్యం స్వామికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో, ముఖ్యంగా తిరుమల ప్రాంతంతో ఉన్న మతపరమైన, రాజకీయ సంబంధాన్ని ఎత్తి చూపుతుంది. టీటీడీ లాంటి సంస్థలపై ఆయనకు అపారమైన ఆసక్తి ఉంది. అది హిందూ మత పరిరక్షణ, రాజకీయ లక్ష్యాలు, రాజ్యాంగ విచారణ, తనదైన వ్యక్తిత్వ పునాదుల మేళవింపుగా ఆయన చర్యలు ఉంటున్నాయి. టీటీడీ నిర్ణయాలను, రాజకీయ లక్ష్యాలతో కలిపి చూసే వైఖరి ఆయనది. ఆయన తీసుకున్న ప్రతి న్యాయ చర్య రాష్ట్ర పాలన విధానాలపై ప్రతిఫలించేలా ఉంది. న్యాయపోరాటాల్లో ఆయన పాత్ర, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో ఒక విశిష్ట అధ్యాయంగా నిలిచే అవకాశముంది.
టీటీడీ లాంటి సంస్థలు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండటాన్ని ఆయన మతస్వేచ్ఛకు భంగంగా చూస్తున్నారు. ఆయన కోణంలో టీటీడీ ఒక హిందూ ఆధ్యాత్మిక కేంద్రం. దానిని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం లేదా అవినీతి ఊబిలోకి లాగడం — అపవిత్ర చర్య. స్వామి చర్యలు పూర్తిగా మతపరమైనవే కాక, రాజకీయ వ్యూహాత్మక కోణంతో కూడినవే. హిందువుల సెంటిమెంట్‌ను రక్షించే కూటమికి తాను ప్రతినిధిని అనుకుంటుంటారు. ఇది ప్రత్యక్ష ఎన్నికల వ్యూహం కాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మత విశ్వాసానికి ప్రతీకగా ఉన్న తిరుమలపై తన నైతిక అధికారాన్ని బలపరచే ప్రయత్నంగా చూడవచ్చు.
స్వామి పలు సందర్భాల్లో.. “I am a devotee of Lord Venkateswara. Tirumala is not just a temple, it is a national treasure for Hindus.” అంటుంటారు. ఆయన కోర్టులో కూడా “I’m appearing as a devotee” అని హైలైట్ చేస్తుంటారు. టీటీడీ విషయంలో స్వామి స్పందనలు ఒక పెద్ద ఐడియాలజికల్ ఫ్రేమ్‌వర్క్ భాగంలో చూడాలి.
ఆయన గతంలో..
కేరళలో శబరిమల పిటిషన్,
రామసేతు రక్షణ పిటిషన్,
ఆలయ పాలన స్వతంత్రత కోసం పలు రాష్ట్రాల్లో కేసులు వేసిన విషయం గుర్తుంచుకోవాలి.
టీటీడీపై చర్యలు ఈ ధర్మరక్షణ యజ్ఞంలో భాగమేనని చెబుతుంటారు. టీటీడీ దేశవ్యాప్తంగా అత్యంత సంపన్నమైన మత సంస్థ. వేల కోట్ల ఆదాయం, లక్షలాది భక్తులు, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఈ సంస్థపై ఆయన దృష్టి సారించడంపై ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాజకీయంగా ఆకర్షణీయమైన వేదికది. భక్తి, ధర్మం, రాజకీయం మిళితమైన మిషన్ సుబ్రమణ్య స్వామిది.
వైఎస్ జగన్ పై స్వామి వైఖరి
టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సుబ్రమణ్య స్వామి విమర్శించారు. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన సానుకూలంగా స్పందించారు. 2021లో, టీటీడీ ఖాతాలను భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ద్వారా ఆడిట్ చేయడానికి జగన్ ముందుకు రావడం పట్ల స్వామి ప్రశంసించారు.