నీటి నుంచి నింగిలోకి.. పర్యాటకులకు కొత్త అనుభూతి
రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇంకొన్ని గంటల్లో ఓ విమానం కృష్ణా బ్యారేజీ నీటిలో ఎగిరి నుంచి శ్రీశైలం డ్యాంలో దిగనుంది.
పర్యాటకంలో కొత్త అనుభవం ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు పరిచయం కానుంది. నీటిలో తేలియాడి, ఆకాశమార్గాన విహరించి, మళ్లీ నీటిలో దిగే విమాన ప్రయాణం కొన్ని గంటల్లో ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. పర్యాటలకు ఆత్మస్థైర్యం నింపడానికి స్వయంగా ఆయనే సీ ప్లేన్ (Sea Plane)లో ప్రయాణించనున్నారు. తద్వారా పర్యాటకరంగాన్ని కొత్తపుంతలు తొక్కించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నీటి నుంచి గగనతలానికి ఎగిరే సీప్లేన్ విజయవాడ కృష్ణా బ్యారేజీ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ పున్నమి ఘాట్ నుంచి బయలు దేరే సీప్లేన్ శ్రీశైలం డ్యాం వద్ద ఉన్న పాతాళగంగ వద్ద నీటిలోనే మళ్లీ ల్యాండ్ అవుతుంది. ఆకాశమార్గాన తక్కువ ఎత్తులో విహరించే ఈ సీప్లేన్ నుంచి నల్లమల అడవుల అందాలను ఆస్వాదించవచ్చు. నాగార్జునసాగర్ పరీవాహ ప్రాంతాన్ని చూస్తే శ్రీశైలం జలాశయంలో దిగే ఈ విమానం నుంచి శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాన్ని గగనతలం నుంచి చూసే అవకాశం లభిస్తుంది. నీటి నుంచి నింగిలోకి ఎగిరే ఈ విమానం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభవం, అనుభూతిని కల్పించే దిశగా కేంద్ర విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.