కేసులకు భయపడే గుంటూరు మేయర్ రాజీనామా చేశారా?

ఈయన పేరు కావటి మనోహర్ నాయుడు.. గుంటూరు నగర మేయర్.. వైసీపీ నాయకుడు.. ఇంకా ఏడాది పదవీ కాలం ఉంది. అయినా సరే ఆయన రాజీనామా చేశారు.;

Update: 2025-03-16 03:17 GMT
ఈయన పేరు కావటి మనోహర్ నాయుడు.. గుంటూరు నగర మేయర్.. వైసీపీ నాయకుడు.. ఇంకా ఏడాది పదవీ కాలం ఉంది. అయినా సరే ఆయన రాజీనామా చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ కి చెప్పలేదు, తన పక్కనున్న సొంత పార్టీ సహచర కార్పొరేటర్లకూ చెప్పలేదు. ఇలా ఎవరికీ చెప్పాపెట్టకుండా రాజీనామా చేసి కలకలం సృష్టించారు. గుంటూరు లాంటి నగరానికి మేయర్ పదవిలో ఉండి అన్ని వ్యవహారాలు చూడాల్సిన వ్యక్తి ఎందుకు రాజీనామా చేశారు, ఏమిటాయన తీరు అనేది చర్చనీయాంశమైంది.
టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక తనను అవమానిస్తోందని, ప్రొటోకాల్‌ పాటించడం లేదని, కారు తీసేశారని, సిబ్బందిని తగ్గించారని మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు.
2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి మేయర్ గా కావటి మనోహర్ నాయుడు ఎన్నికయ్యారు. ఇంకో ఏడాది పాటు ఆయన ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది. ఈలోపే ఆయన తప్పుకోవడం దేనికి సంకేతం అనేది చర్చనీయాంశంగా ఉంది. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ వ్యవహారశైలేనని చెబుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం, జనసేనలో చేరారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఆ రెండు పార్టీలకే దక్కాయి. ఈ కమిటీకి మేయరే ఛైర్మన్‌గా వ్యవహరిస్తుంటారు. అయినప్పటికీ- ఆయనకు సమాచారం ఇవ్వకుండా అధికారులతో కలిసి సొంత నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆరోపించారు.
వాస్తవానికి మార్చి 17న స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశాలు జరగాల్సి ఉంది. మేయర్ వాదన ప్రకారం తనకు చెప్పకుండానే అధికారులు నిర్ణయం తీసుకుని తనకు అజెండా కాపీ పంపారని చెబుతున్నారు. స్టాండింగ్‌ కమిటీలోని ఆరుగురు సభ్యులు కూటమికి చెందినవారే. వారు తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ హోదాలో ఆమోదించడం తప్ప వ్యతిరేకించలేనని భావించే రాజీనామా చేసి ఉండొచ్చన్న ప్రచారం నడుస్తోంది.
ప్రభుత్వాలు మారినపుడల్లా స్థానిక సంస్థల పాలకవర్గాలు మారుతుంటాయి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు ఆ సెగ గుంటూరు మేయర్ నూ తాకింది. పైగా కావటి మనోహర్ నాయుడు వైసీపీ ప్రభుత్వంలో బాగానే పెత్తనం చెలాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. తన స్థాయికి మించి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారనే ప్రచారం ఉంది.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గతంలో గుంటూరులో బంద్‌ నిర్వహించినప్పుడు మనోహర్ నాయుడే పోలీసు అవతారం ఎత్తి ప్రత్యర్థి పార్టీ వాళ్లను కంట్రోల్ చేసినట్టు చెబుతుంటారు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదని సాక్షాత్తూ హైకోర్టు ఆక్షేపించింది.
అవిశ్వాసం పెడతారనే రాజీనామా చేశారా?
టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగినట్టే గుంటూరులోనూ పార్టీ ఫిరాయింపులు జరిగాయి. దాదాపు 20 మంది వైసీపీ కార్పొరేటర్లు అటు టీడీపీలోకో, ఇటు జనసేనలోకో చేరిపోయారు. ఇంకా కొంతమంది గోడమీది పిల్లివాటం ప్రదర్శిస్తున్నారు. ఏదిఏమైనా ఇటీవలి కాలంలో కౌన్సిల్‌లో వైసీపీ బలం తగ్గి కూటమి బలం బాగా పెరిగింది.
గుంటూరు మేయర్ గా కావటి మనోహర్ నాయుడు బాధ్యతలు స్వీకరించి మార్చి 18 నాటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్లు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఉండడంతో ముందుగానే రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
అందరికీ కృతజ్ఞతలు చెప్పిన కావటి..
గుంటూరు నగర ప్రజలకు నాలుగేళ్లు మేయర్ గా సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ముందుగా వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి, నగర ప్రజలకు కావటి మనోహర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నిస్వార్థంగా పని చేశానని చెప్పారు. గుంటూరు కార్పోరేషన్ కు ప్రథమ పౌరుడిగా, మేయర్ స్థానంలో ఉన్న తన పట్ల తెలుగుదేశం ప్రభుత్వం అండ చూసుకుని, అధికారులు ప్రవర్తించిన తీరు ఎంతగానో కలచివేసిందన ఆయన చెప్పారు. దశాబ్దాలుగా మేయర్ కు ఇస్తున్న ప్రొటోకాల్ ను కూడా పాటించకుండా, వ్యక్తిగత సిబ్బందిని, ఆఖరికి కారు, కారు డ్రైవర్ ను కూడా తొలగించారని ఆరోపించారు. ఇంతగా అవమానించిన తర్వాత మేయర్ గా నేను కొనసాగటం భావ్యం కాదనిపించిదని, అందుకే రాజీనామా చేస్తున్నానని కావటి చెప్పారు.
Tags:    

Similar News