రామదూత ఆధ్వర్యంలో చంద్రబాబు గురు పూర్ణిమ
అమరావతిలో రామదూత స్వామి ఆధ్వర్యంలో ఘనంగా వేణు దత్తాత్రేయస్వామి పూజలు నిర్వహించారు. వాటికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-07-21 08:15 GMT
రామదూత స్వామి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో గురుపూర్ణిమ ఉత్సవాలు జరిగాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన ఈ ఉత్సవాలకు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. దేశంలోనే ప్రముఖ స్వామీజీగా పేరు పొందిన రామదూత స్వామి మొదటి సారిగా మంగళగిరిలో గురుపూర్ణిమ ఉత్సవాలను నిర్వహించారు. వేణు దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుక పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
రామదూత స్వామి ఆశ్రమం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరు వద్ద ఉంది. ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉంటుంది. స్వామిజీ ఆశ్రమంలో ఉన్న సమయంలో నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకొని వెళ్తుంటారు. రామదూత స్వామి ఆశ్రమానికి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీలుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారులు, పలువురు మంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్రంలోని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సందర్శించారు. కర్నాటక నుంచి ముఖ్యమంత్రి హోదాలో యడ్యూరప్ప కూడా హెలిక్యాప్టర్‌లో వచ్చి రామదూత స్వామి దర్శనం చేసుకొని వెళ్లారు. కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేతల వద్దకు నేరుగా వెళ్లగలిగిన స్వామీజీల్లో రామదూత స్వామీజీ ఒకరు. ఈయనకు ఢిల్లీతో పాటు హైదరబాద్, ఇంకా పలు రాష్ట్రాల్లో విడిది కేంద్రాలు ఉన్నాయి.
అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రామదూత స్వామి నిర్వహించిన గురి పూర్ణిమ ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా ఈ ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అభివాదం చేస్తూ కనిపించారు. రామదూత ఆశీర్వచనాలు అందుకొని పూలు, ఫలహారాలు అందించడమే కాకుండా దీపారాదన చేశారు. కన్వెన్షన్ హాల్‌లో వేణుదత్తాత్రేయుని విగ్రహాన్ని తాత్కాలికంగా తయారు చేయించి రామదూత స్వామి ఈ పూజలు చేయించారు.