పవన్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి సంబంధించి హరిహర వీరమల్లు నిర్మాత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు..

Update: 2024-03-14 11:31 GMT
Source: Twitter


పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రాజకీయాలతో పాటు సినిమాల విషయంలో దూసుకుపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో ఆయన సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. తాజాగా పవన్‌ను ఉద్దేశించి ‘హరిహర వీరమల్లు’ సినిమా నిర్మాత ఎం మణిరత్నం ఆసక్తికర పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు. పవన్ కల్యాణ్.. జనసేన పార్టీని దృఢసంకల్పంతో స్థాపించారని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన పోరుకు సిద్ధమవుతోందని అన్నారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కు మణిరత్నం తన శుభాకాంక్షలు తెలిపారు.


ప్రజా సేవే పవన్ ధ్యేయం


సరిగ్గా పదేళ్ల క్రితం ప్రజాసేవే ధ్యేయంగా సిద్ధాంతపరమైన ఆశయాలు, దృఢసంకల్పంతో పవన్ కల్యాణ్.. జనసేన పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఏ క్షణంలో కూడా ఆయన తన ఆశయాలు, సిద్ధాంతాలను విస్మరించలేదని అన్నారు. ‘‘పవన్ స్థాపించిన జనసేన పార్టీ దశాబ్ద కాలం పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా పవన్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజా సేవ మార్గంలో ఆయన ప్రయాణం దిగ్విజయంగా సాగాలని, ప్రజలకు మేలు జరగాలన్న ఆయన కోరిక నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ఈ పోరులో పవన్‌కు మద్దతుగా నిలుస్తున్న పార్టీ కార్యకర్తలు, మహిళలకు శుభాకాంక్షలు’’అని ఆయన తన పోస్ట్‌లో తెలిపారు.


ప్రస్తుతం మణిరత్నం నిర్మిస్తున్న పీరియాడిక్ డ్రామా మూవీ ‘హరిహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ రాజకీయంగా బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ టీం కూడా ఈ సినిమాలో పవన్ నెవ్వర్ బిఫోర్‌లా కనిపిస్తారని, ఈ సినిమా పవన్ అభిమానులకు పక్కాగా కన్నులపండుగగా ఉంటుందని అంటోంది.

Tags:    

Similar News