విభజన తర్వాత ఏపీలో అసెంబ్లీ సమావేశాల తీరు మారిందా?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరు పూర్తిగా మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా చర్చలు, సూచనలు, సలహాలేమీ లేవు. ఆత్మస్తుతి పరనిందే అయిపోయింది.

Byline :  The Federal
Update: 2024-07-22 06:29 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ తీరు పూర్తిగా మారి పోయిందని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అజెండాలు, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడం, అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రతిపక్షాలను కూడా భాగం చేయాలి అనేది ఏమీ లేదు. ఎంత సేపటికి ప్రతిపక్షాలను ఎలా తొక్కాలి, వారిని ఎలా అవమానించాలి, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ఎలా మైక్‌ కట్‌ చేయాలి, ప్రతిపక్షాల గొంతును ప్రజలకు వినపడకుండా ఎలా నొక్కేయాలనేదే పాలక పక్ష ప్రధాన అజెండాగా మారి పోయింది.

ఉమ్మడి రాష్ట్రంలో తొలి నాళ్ల నుంచి ఆదర్శంగానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేవారు. అన్ని ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగానే నిర్వహణకు శ్రద్ద పెట్టే వారు. తూతూ మంత్రంగా కానీ, మొక్కుబడి విధానంతో కానీ, అధికార పక్షాన్ని పొగిడించుకోవడానికి అన్నట్లు కాకుండా అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఇచ్చే వారు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షాలను గౌరవించే వారు. ప్రజా సమస్యలపైన సుదీర్ఘమైన చర్చలు జరిపే వారు. ప్రజా వ్యతిరేక విధానలపైన ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు సంధించే వారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండేవి అసెంబ్లీ సమావేశాలు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సూచనలు, సలహాలు ఇవ్వడం రివాజుగా ఉండేది. ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతిపక్షాల సూచనలు పాటించేందుకు పాలక పక్షం వెనుకాడేది కాదు. విరామ సమయంలో అసెంబ్లీ వాతావరణం కోలాహలంగానే ఉండేది. అసెంబ్లీ లాబీల్లో అధికార, ప్రతిపక్షాల సభ్యులు స్నేహపూర్తి వాతావరణంలోనే మెలిగే వారు. సరదా చలోక్తులతో సంతోషంగానే ఉండే వారు. ప్రతిపక్షంలో ఉన్నా.. మంత్రులు, ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి తమ నియోజక వర్గాల సమస్యల పరిష్కరించుకునే వారు.
కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు భిన్నంగా మారి పోయాయి. స్నేహ పూరిత, సహృద్బావ వాతావరణం లేకుండా పోయింది. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య విద్వేష పూరిత వాతావరణం నెలకొన్నది. ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే బగ్గుమనే దుస్థితి నెలకొన్నది. అర్థవంతమైన చర్చలు లేవు. ప్రజలకు ఉపయోగపడే డిస్కషన్స్‌ లేవు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే దీనికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలపై చర్చలు జరపాలని అజెండాగా రూపొందిస్తారు. కానీ చర్చ జరిగేదంతా పాలసీలపైన కాదు, ప్రతిపక్షాలపైనే. ప్రతిపక్షాలకు సమయం కూడా ఇచ్చే వారు కాదు. సమయం ఇచ్చినట్టే ఇచ్చి మధ్య మధ్యలో అధికార పక్షం సభ్యులు, మంత్రులతో పాటు సభా నాయకుడుకు అవకాశమిస్తూ ప్రతిపక్షాలను తిట్టించడం, అవమానించడం చేస్తూ వచ్చారు. దీంతో పాటుగా సభలో కూర్చున్న సభ్యులు ప్రతిపక్ష సభ్యులను కించ పరచే విధంగా రన్నింగ్‌ కామెంట్రీలు చెప్పుతూ సభా మర్యాదలను మంటగలుపుతూ వచ్చారు. ఇవి శృతి మించడంతో నాటి ప్రతిపక్ష నేత జగన్‌ సమావేశాలకు హాజరు కావడం మానేసి పాద యాత్రకు వెళ్లి పోయారు.
ఇదే విధానం 2019 నుంచి 2024 వరకు కూడా కొనసాగింది. అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి గతంలో కంటే రెండాకులు ఎక్కువుగానే కొనసాగించారనే టాక్‌ ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు రెచ్చి పోయారు. చంద్రబాబును, టీడీపీని లక్ష్యంగా చేసుకొని చెలరేగి పోయారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆ పార్టీ సభ్యులను అవమానించడం, మాట్లాడకుండా చేయడం, సమయంలో కోత విధించడం, మాట్లాడుతుంటే మైక్‌లు కట్‌ చేయడం చేశారు. చంద్రబాబునే కాకుండా ఆయన సతీమణి భువనేశ్వరిని కూడా అవమానకరంగా మాట్లాడారన విమర్శలు మూట గట్టుకున్నారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చంద్రబాబు సీఎంగానే తిరిగి సభలో అడుగు పెడుతానని సభ నుంచి వెళ్లి పోయారు.
తాజాగా తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి సారి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం సమావేశాలు నిర్వహించగా, ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల్లో కూడా పెద్దగా మార్పులు ఉండవని, గతంలో మాదిరిగానే ప్రతిపక్షాలను తిట్టడం, తమను పొగుడుకోవడం తప్పితే ప్రజలకు సంబంధించిన చర్చలు ఏమీ ఉండవనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News